పనులు 2,467.. పూర్తయినవి 696
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:08 AM
జిల్లాలో జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తిగా పడకేశాయి. ఏ నియోజకవర్గంలో కూడా కనీస స్థాయిలో పనులు జరగలేదు.
- జిల్లాలో జలజీవన్ మిషన్ తీరిదీ
- మ్యాచింగ్ గ్రాంట్ విడుదలలో వైసీపీ నిర్లక్ష్యం
- దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తిగా పడకేశాయి. ఏ నియోజకవర్గంలో కూడా కనీస స్థాయిలో పనులు జరగలేదు. 2,467 పనులు మంజూరైతే కేవలం 696 పనులే పూర్తయ్యాయంటే ప్రగతి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను ప్రకటించింది. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా జాప్యం చేసింది. ఆ ప్రభావం పనులపై పడింది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా పనులు పూర్తికాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌పై దృష్టిసారించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడంతో పనులకు మోక్షం కలగనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో పనులు పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 2,467 పనులు గతంలో మంజూరయ్యాయి. ఆమదాలవలసలో 271 పనులకు గాను 91, ఎచ్చెర్లలో 224కు గాను 85, నరసన్నపేటలో 438కి గాను 104, పలాసలో 247కుగాను 48, పాతపట్నంలో 348కుగాను 134, శ్రీకాకుళంలో 279కుగాను 120, టెక్కలి నియోజకవర్గంలో 373 పనులకుగాను 54 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమీక్షించిన తరువాత పనులు వేగవంతం అయ్యాయి. ఎక్కడికక్కడే స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేశారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 287 పనులు పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ పూర్తయిన పనులు కేవలం 60 మాత్రమే. ఇంకా 227 పనులు వివిధ స్థితిలో ఉన్నాయి. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే కేవలం సోంపేట మండలంలో అధికారులు పనులు చేయించి చేతులు దులుపుకొన్నారు.
ఇప్పటికే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. వంశధార నదికి కుడివైపులా ఉన్న పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాలకు సైతం తాగునీటిని ఇదే ప్రాజెక్టు ద్వారా విస్తరించేందుకు నిర్ణయించారు. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు తాగునీరు అందించే వీలుగా సారవకోట మండలం బొంతు వద్ద ఒక ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్నారు. అలాగే శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలగాను సరుబుజ్జిలి మండలం వెన్నలవలస వద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.