22ఏ భూ సమస్యలకు స్వస్తి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:39 AM
90 percent of grievances are revenue issues ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా 22-ఏలో చిక్కుకున్న భూ సమస్యలకు, భూ కబ్జాలకు ఇకపై విముక్తి లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు, ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి.
గ్రీవెన్స్‌లో 90 శాతం రెవెన్యూ అంశాలే
ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
అధికారులకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారాలు
ముఖ్యమంత్రి చొరవతో కష్టాలకు సెలవ్
తక్షణ, శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చర్యలు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
కలెక్టరేట్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా 22-ఏలో చిక్కుకున్న భూ సమస్యలకు, భూ కబ్జాలకు ఇకపై విముక్తి లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు, ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించేందుకుగాను శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ‘మీ చేతికి మీ భూమి- 22ఏ భూ స్వేచ్ఛ’ పేరిట ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో 90 శాతం రెవెన్యూ సమస్యలే. సమస్యల తక్షణ పరిష్కారానికి కలెక్టర్ నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులందరినీ ఒకేచోట చేర్చి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి, బాధితులకు సంబంధిత పత్రాలను కూడా అందజేస్తాం. ముఖ్యమంత్రి భూ సమస్యలను వేగంగా, శాశ్వతంగా పరిష్కరించేందుకు తహసీల్దార్లకు, ఆర్డీవోలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ జీవో జారీ చేశారు. న్యాయపరమైన సమస్యలు ఉన్నవి మినహా మిగిలినవి పరిష్కరించి రికార్డులను అప్‌డేట్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలకు గ్రామాలే 22-ఏ పరిధిలోకి వెళ్లాయి. వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి చొరవతో భూ కష్టాలకు ఇక సెలవ్’ అని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ప్రతీ ఫిర్యాదును ‘ఈ-ఆఫీస్’ ద్వారా నమోదు చేసి, ఇక్కడే ఉన్న అధికారులు తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
గ్రీవెన్స్‌లో పరిష్కరించిన సుమారు 200 మందికి భూ విముక్తి ధ్రువీకరణ పత్రాలను మంత్రి అచ్చెన్న అందజేశారు. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన మల్లా భారతమ్మ తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ ‘ఏళ్లుగా మా భూమి 22-ఏలో చిక్కుకుపోయింది. నాతోపాటు మరో 19మంది ఇదే సమస్యతో సతమతమవుతున్నాం. ఈ గ్రీవెన్స్‌లో తక్షణ పరిష్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని తెలిపారు. అలాగే సోంపేట మండలానికి చెందిన సనపల వాసుదేవరావు, మందసకు చెందిన జుత్తు తారకేశ్వరరావు, ఎచ్చెర్ల మండలానికి చెందిన కొణతల అప్పారావు తదితరులు ధ్రువపత్రాలను అందుకుని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లావణ్య, ఆర్డీవోలు సాయిప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, తహసీల్దార్లు, సర్వేయర్లు, దేవదాయశాఖ, రిజిస్ట్రేషన్, అటవీ శాఖ అధికారులు, వీఆర్వోలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.