వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:01 AM
ప్రత్యేక ప్రణాళికలతో యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కృష్ణా యూనివర్సిటీ వీసీ కె.రాంజీ తెలిపారు. నాణ్యమైన విద్యాబోధన , భవనాల నిర్మాణం, పరిపాలనాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. వీసీ చాంబరులో ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సెనెట్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

- నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యం
- భవన నిర్మాణాలు, పరిపాలన అంశాలకు ప్రాధాన్యం
- కృష్ణా యూనివర్సిటీ వీసీగా కె.రాంజీ బాధ్యతల స్వీకరణ
మచిలీపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
ప్రత్యేక ప్రణాళికలతో యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కృష్ణా యూనివర్సిటీ వీసీ కె.రాంజీ తెలిపారు. నాణ్యమైన విద్యాబోధన , భవనాల నిర్మాణం, పరిపాలనాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. వీసీ చాంబరులో ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సెనెట్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళం జిల్లా బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి మూడేళ్లు వీసీగా, నాగార్జున యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా ఏడాది పాటు పనిచేశానన్నారు. ఈ అనుభవంతో కృష్ణా యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడ నాణ్యమైన విద్యను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటానన్నారు. బాలురు, బాలికల వసతి గృహాలను ఏడాది లోపు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మిగిలిన భవనాలు ఏ కారణంతో నిలిచిపోయాయో విచారణ జరిపి, త్వరితగతిన ఈ భవనాల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక స్పృహను కలిగించేందుకు గ్రామాల్లో ఒకరోజు పాటు పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయిస్తామన్నారు. వర్సిటీ పరిధిలో 120 కళాశాలలు ఉన్నాయని, వాటన్నింటినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామన్నారు. వర్సిటీ ప్రాంగణాన్ని పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల్లో పరిపాలనను గాడిన పెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని, ఎవరైనా సరిదిద్దుకోలేనంతగా తప్పులు చేసినట్లు రుజువైతే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. రీసెర్చ్ విభాగంలో పరిపాలనా పరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి చక్కదిద్దుతామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి వీసీగా నియమించిన రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత వీసీకి యూనివర్సిటీ రెక్టార్ ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ర్టార్ శోభన్‌బాబు, యూనివర్సిటీ క్యాంపస్ సైన్స్, అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా, ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.