Share News

Special Incentives: సీమ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:49 AM

దశాబ్దాల క్రితం కడప జిల్లాలో ప్రతిపాదించిన రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటిదాకా శంకుస్థాపనలకే పరిమితమైంది.

Special Incentives: సీమ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు

  • ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం

  • ఎకరా రూ.5 లక్షల చొప్పున 1,100 ఎకరాల కేటాయింపు

  • టౌన్‌షిప్‌ కోసం మరో 200 ఎకరాలు

  • 268 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు జమ్మలమడుగు నుంచి లైన్‌

  • గండికోట నుంచి ఏటా 2 టీఎంసీలు

  • ఎన్‌హెచ్‌-69తో అనుసంధానిస్తూ 12 కిలోమీటర్ల యాక్సెస్‌ రోడ్డు

  • ముద్దనూరు నుంచి ప్లాంట్‌ వరకు 12 కిలోమీటర్ల రైల్వేలైన్‌

  • పదేళ్లు విద్యుత్‌ సుంకం రాయితీ రూ.16,350 కోట్ల పెట్టుబడి

  • 2,500 మందికి ఉపాధి 2029కల్లా తొలి దశ పూర్తి

అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల క్రితం కడప జిల్లాలో ప్రతిపాదించిన రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటిదాకా శంకుస్థాపనలకే పరిమితమైంది. గత ఏడాది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎ్‌సడబ్ల్యూ ఏపీ స్టీల్‌ లిమిటెడ్‌ (జిందాల్‌ స్టీల్స్‌) సంస్థ కడప జిల్లా జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె వద్ద రెండు దశల్లో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి.. 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని తాజా ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రెండు దశల్లో మొత్తం రూ.16,350 కోట్ల పెట్టుబడితో 2034 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జేఎ్‌సడబ్ల్యూ తెలిపింది. మొదటి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉపాధి కల్పన, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పనకు ప్రతిపాదనలు సమర్పించింది. 2029 నాటికి మొదటి దశను పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనుంది.


2034 నాటికి రెండో దశ పూర్తి చేస్తుంది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సిఫారసులతో ఆమోదించిన రాష్ట్రప్రభుత్వం.. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జేఎ్‌సడబ్ల్యూ ఏపీ స్టీల్‌ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించింది. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ 2.0 కింద అవసరమైన ఆమోదాలు, అనుమతులను సులభతరం చేస్తూ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ స్ఫూర్తితో వేగంగా ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను నిర్దేశించింది. ఈ ప్యాకేజీ కింద.. సున్నపురాళ్లపల్లె వద్ద ఎకరా రూ.5 లక్షల చొప్పున 1,100 ఎకరాల భూమిని ఔట్‌రైట్‌ సేల్‌ ప్రాతిపదికన.. ఇప్పటికే ఉన్న ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం.. రెండు దశల సేల్‌ అగ్రిమెంట్‌ కమ్‌ సేల్‌ డీడ్‌ కింద ప్రభుత్వం కేటాయించింది. టౌన్‌షిప్‌ ఏర్పాటు కోసం సున్నపురాళ్లపల్లె వద్ద మరో 200 ఎకరాలు కేటాయించింది.


  • ప్లాంట్‌కు అవసరమైన 268 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు జమ్మలమడుగు సబ్‌ స్టేషన్‌నుంచి 400 కె.వి. డబుల్‌ సర్క్యూట్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ (డిస్ట్రిబ్యూషన్‌ సబ్‌స్టేషన్‌తోపాటు) ఏర్పాటు.

  • ఏటా 2 టీఎంసీల నీరు గండికోట జలాశయం నుంచి కేటాయింపు. ఈ నీటి సరఫరాకు పంపింగ్‌ సదుపాయాలతో పైప్‌లైన్‌ ఏర్పాటు.

  • జాతీయ రహదారి-67తో అనుసంధానం చేస్తూ ప్రాజెక్టు ప్రాంతం వరకు 12 కిలోమీటర్ల మేర 4 లైన్ల యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం.

  • ముద్దనూరు రైల్వేస్టేషన్‌ నుంచి ప్లాంట్‌ వరకు 12 కిలోమీటర్ల మేర పీఎం గతిశక్తి పథకం కింద రైల్వేలైన్‌ ఏర్పాటు.

  • ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) కింద ప్రాజెక్టు స్థిర మూలధన పెట్టుబడిలో 50 శాతం వరకు మినహాయింపు.

  • పదేళ్ల కాలంలో రూ.607.2 కోట్ల వరకు 20 శాతం మూల ధన ప్రోత్సాహకాలు.

  • ఉత్పత్తి ప్రారంభించిననాటి నుంచి పదేళ్లలోపు రూ.1,092 కోట్ల వరకు విద్యుత్‌ సుంకం రాయితీ, రూ.4.875 కోట్ల మేర స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌.

  • రెండో దశ ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయపాలన ప్రకారం ప్రారంభిస్తే.. స్థిర మూలధన పెట్టుబడిలో 50 శాతం ప్రోత్సాహకాలు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో

బద్వేల్‌లో ఉప ఎన్నిక‌.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 04:50 AM