వేసవిలో తాగునీటిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:38 AM
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. జిల్లాపరిషత సమావేశపు హాలులో జిల్లా పరిషత 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన గురువారం జరిగింది.

- జిల్లా పరిషత చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
- 2025-26 జెడ్పీ బడ్జెట్ నిల్వ రూ.172.02 కోట్లు
- ఆదాయం అంచనా రూ.1300.24 కోట్లు
-సీపీజీఎఫ్‌ఎం అవార్డుకు కృష్ణా జిల్లా పరిషత ఎంపిక
- రోడ్లు, తాగునీటి సమస్యలపై సభ్యుల విజ్ఞప్తి
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాదాసీదాగా ముగిసిన సమావేశం
మచిలీపట్నం, జనవరి30(ఆంధ్రజ్యోతి) :
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. జిల్లాపరిషత సమావేశపు హాలులో జిల్లా పరిషత 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన గురువారం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వివిధ పథకాలపై సమీక్షలు జరపకుండా బడ్జెట్ అంచనాలకు సమావేశం ఏక గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ ఏటా తాగునీటి అవసరాల కోసం జెడ్పీ నుంచి రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అంతే మొత్తంలో నగదు కేటాయించామని తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జెడ్పీ బడ్జెట్ ప్రారంభ నిల్వ రూ.172.02 కోట్లు ఉన్నట్లు చెప్పారు. అనంతరం 2025-26 సంవత్సరంలో జెడ్పీ ఆదాయం రూ.1300.24 కోట్లుగా, ముగింపు నిల్వ రూ.182.31 కోట్లుగా ఉంటుందని అంచనా వేశామని, ఈ ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలపాలని జెడ్పీ చైర్‌పర్సన్ కోరగా, సభ్యులు ఆమోదం తెలిపారు.
రహదారుల గుంతలైనా పూడ్చండి
జిల్లాలో రహదారుల అభివృద్ధి, డొంకరోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని కోడూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కోడూరు-అవనిగడ్డ రహదారిని సంవత్సరాల తరబడి అభివృద్ధి చేస్తామని చెప్పడమే తప్ప, పనులు మాత్రం చేయడంలేదన్నారు. 12 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి గుంతమయంగా ఉందని, ప్రయాణికులకు నరకం కనిపిస్తుందని కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ-అశ్వారావుపాలెం మధ్య రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి కొంతమేర చేసి సరిపెట్టారు.. అసలు ఇదేం పద్ధతి అంటూ అవనిగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి అధికారులను నిలదీశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధిపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులతో మాట్లాడినా పనులు చేయడంలేదన్నారు. తోట్లవల్లూరు, విజయవాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, సువర్ణరాజు మాట్లాడుతూ జిల్లాలో వివిధ రకాల నిధులతో సిమెంటు రోడ్ల నిర్మాణానికే అనుమతులు ఇస్తున్నారని, రైతులకు ఉపయోగపడే విధంగా డొంక రోడ్ల అభివృద్ధికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ, జెడ్పీ నిధులతో డొంకరోడ్ల నిర్మాణం చేసేందుకు అవకాశం ఉన్నా అనుమతులు ఏకారణంతో ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మోపిదేవి మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అధికారులు కాంట్రాక్టర్ల వద్ద నగదు తీసుకుని పనులు సక్రమంగా చేయించడంలేదని మోపిదేవి జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెయిలీ బ్రిడ్జి వెల్డింగ్ పనుల్లో జాప్యం
మొవ్వ మండలం కాజ గ్రామం వద్ద ఐనంపూడి డ్రైనేజీపై బెయిలీ బ్రిడ్జికి కనీస మరమ్మతులు చేయడంలేదని జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు వేమూరి పరిశుద్ధరాజు సమావేశం దృష్టికి తెచ్చారు. 15 గ్రామాల ప్రజల రాకపోకలకు ఆధారంగా ఉన్న ఈ బ్రిడ్జిపై ఉన్న రేకులకు వెల్డింగ్ పనులు కూడా చేయకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ విడుదల కాలేదని, టెండర్లు రద్దయ్యాయని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
కొల్లేరు గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించండి
కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు మండలాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. జెడ్పీ నుంచి నిధులు కేటాయించి వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆయా మండలాల్లోని తాగునీటి పథకాల ఫిల్టర్ బెడ్‌లకు త్వరితగతిన మరమ్మతులు చేయించాలని కోరారు. గతంలో పంచాయతీలకు సంబంధించిన నిధులను మళ్లించడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో స్థానిక సంస్థలకు జవసత్వాలు కలుగుతున్నాయని వివరించారు.
గ్రామీణ సమస్యలపై దృష్టి పెట్టండి
సమస్యలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయని, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కోరారు. ఒకసారి సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తదుపరి సమావేశం నాటికైనా పరిష్కరించాలన్నారు.
జెడ్పీకిసీపీజీఎఫ్‌ఎం అవార్డు
జిల్లా పరిషతకు సంబంధించిన లెక్కలు పారదర్శకంగా చూపినందుకు గాను కమిటీ ఆన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్(సీపీజీఎఫ్‌ఎం) 2024-25 ఆర్థిక సంవత్సరానికి కృష్ణా జిల్లా పరిషతను ఉత్తమ జిల్లా పరిషతగా ఎంపిక చేసినట్లు జిలా ్లపరిషత సీఈవో కన్నమనాయుడు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందకుమార్, ఆర్డీవో కె.స్వాతి పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాందీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.