పోలీస్‌శాఖలో ‘స్పా’ కోవర్టులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:04 AM
భార్గవ్‌ను పక్కా ఆధారాలతో పట్టుకోవాలని పోలీసులు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు సోదాలకు వెళ్లినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వెనుతిరిగారు. స్పా చుట్టూ నిఘా వ్యవస్థను అమర్చుకున్నట్టే పోలీసు అధికారుల కదలికలను తెలుసుకునేందుకు మాచవరం పోలీస్ స్టేషనలోనూ కోవర్టులను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి నిదర్శనమే ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ సిబ్బందికి చేసిన సూచనలు నేరుగా భార్గవకు చేరడం.

- రెండు రోజుల కిందట హైటెక్ స్పాపై నిఘా పెంచాలన్న ఇన్‌స్పెక్టర్
- వెంటనే నిర్వాహకులకు చేరిన సమాచారం
- తర్వాత రోజు మాచవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి భార్గవ్ వీరంగం
- న్యాయస్థానాల్లో నిలబెడతానని బెదిరింపులు
- రోల్‌కాల్‌లో ఇన్‌స్పెక్టర్ అన్న మాటలను చేరవేసిన సిబ్బందిపై ఆరా
- కోవర్టుల జాబితాపై దర్యాప్తు ముమ్మరం
‘మన పోలీస్‌స్టేషన పరిధిలో దాదాపుగా అన్ని స్పా సెంటర్లు మూసివేశారు. వెటర్నరీ కాలనీలో చలసాని భార్గవ్ ఇంకా స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. మనకు దొరక్కుండా టెక్నాలజీని అడ్డుపెట్టుకుని వ్యవహారాలను నడుపుతున్నాడు. ఇక నుంచి వాహనాల తనిఖీలన్నీ ఆ స్పా సెంటర్ దగ్గర చేయాలి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అక్కడే కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల పోలీసులు నిత్యం ఇక్కడే ఉంటున్నారన్న భయం కలుగుతుంది’ ఇది చలసాని ప్రసన్న భార్గవ్‌కు చెందిన స్టూడియో9 స్పా సెంటర్‌పై దాడులు చేయడానికి రెండు రోజుల ముందు రాత్రి మాచవరం ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ రోల్‌కాల్‌లో సిబ్బందితో అన్న మాటలు.
-‘నేను లీగల్‌గా స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నా. నాకు అన్ని అనుమతులు ఉన్నాయి. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి మీ సీఐ నా గురించి రోల్‌కాల్‌లో ఏదేదో చెప్పారంట. నా సత్తా ఏమిటో కోర్టుల ద్వారా చూపిస్తా. నా జోలికి వస్తే న్యాయస్థానాల్లో నిలబెడతా’ ఇది పోలీసులు స్పా సెంటర్‌పై దాడి చేయడానికి ముందు రోజు భార్గవ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందితో చేసిన సవాలు.
ఈ విషయం ఇప్పుడు పోలీస్ శాఖలో పెద్ద దుమారం రేపుతోంది. సిబ్బందితో ఇన్‌స్పెక్టర్ అన్న మాటలు ఎక్కడా పొల్లుపోకుండా నిమిషాల వ్యవధిలో చలసాని ప్రసన్న భార్గవ్‌కు చేరిపోవడంతో స్టేషన్ కోవర్టు వ్యవస్థ విషయం మరోసారి బయటకు వచ్చింది. -ఆంధ్రజ్యోతి, విజయవాడ
ఏమార్చేందుకు వేర్వేరు కార్యాలయాల ఏర్పాటు
నగరంలో అన్ని స్పా సెంటర్లను పోలీసులు మూసి వేయించారు. పోలీసులు నిర్ధేశించిన ఎస్‌వోపీ ఉన్న స్పా సెంటర్లు మాత్రమే ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి. వెటర్నరీ కాలనీ ఫీడర్ రోడ్డులో చలసాని ప్రసన్న భార్గవ్ మాత్రం ఒక అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని స్పా ముసుగులో చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. తనకు ఒక యూట్యూబ్ చానల్ ఉందని, నిర్మాణ రంగంలో ఉన్నానని చెప్పుకునేందుకు రెండు కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవైపు చలసాని కన్‌స్ట్రక్షన్స్ బోర్డు, మరో వైపు యూట్యూబ్ చానల్‌కు సంబంధించిన బోర్డు కనిపిస్తుంది. ఈ రెండింటికి పైభాగంలో మాత్రం రాసలీలలు జరుగుతుంటాయి.
పోలీస్ కోవర్టుల సమాచారంతో తప్పించుకుంటూ..
భార్గవ్‌ను పక్కా ఆధారాలతో పట్టుకోవాలని పోలీసులు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు సోదాలకు వెళ్లినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వెనుతిరిగారు. స్పా చుట్టూ నిఘా వ్యవస్థను అమర్చుకున్నట్టే పోలీసు అధికారుల కదలికలను తెలుసుకునేందుకు మాచవరం పోలీస్ స్టేషనలోనూ కోవర్టులను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి నిదర్శనమే ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ సిబ్బందికి చేసిన సూచనలు నేరుగా భార్గవకు చేరడం. ఇన్‌స్పెక్టర్ రోల్‌కాల్ నిర్వహించినప్పుడు ముగ్గురు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు, ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. పోలీసులకు ప్రతిరోజు రాత్రి రోల్‌కాల్ ఉంటుంది. రాత్రిపూట విధుల్లో ఉండే సిబ్బందికి సంబంధిత స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పలు సూచనలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఏవిధంగా నిఘా పెట్టాలో చెబుతారు. అటువంటి రోల్‌కాల్‌లో ఎస్‌హెచ్‌వో(స్టేషన్ హౌస్ ఆఫీసర్) అన్న మాటలు చలసానికి చేరడంతో అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు.
భార్గవ్‌తో టచ్‌లో ఉన్నదెవరు?
పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని వ్యవహారాలను చక్కబెట్టడంలో భార్గవ్‌కు మంచి నైపుణ్య ఉంది. వైసీపీ హయాంలో గురునానక్ కాలనీలో ఉన్న రైల్వే విశ్రాంత ఉద్యోగికి చెందిన స్పా కేంద్రాన్ని పటమట పీఎస్‌లో పనిచేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను ఉపయోగించుకుని సెటిల్‌మెంట్ చేసి బలవంతంగా రాయించు కున్నాడని నాటి పోలీసు అధికారులు గుర్తించారు. నాడు భార్గవ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి స్పా ముసుగులో అతడు చేస్తున్న అరాచకాలను బయటకు తీశారు. భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పట్లో మాచవరంలో పనిచేసిన ఒక ఇన్‌స్పెక్టర్, పటమటలో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర భార్గవ్ అరాచకాల్లో ఉందని తెలియడంతో అప్పటి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ముగ్గురిని వీఆర్‌కు పంపారు. తర్వాత ఆ ఇన్‌స్పెక్టర్ ఇక్కడి నుంచి ఏలూరు రేంజ్‌కు వెళ్లిపోయారు. మిగిలిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు మొన్నటి వరకు జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేవారు. నెల కిందట అక్కడి నుంచి మాచవరం పీఎస్‌కు బదిలీపై వచ్చినట్టు తెలిసింది. రోల్‌కాల్‌లో ఇన్‌స్పెక్టర్ అన్న మాటలే భార్గవ్ చెవిలో పడేశారా, స్టేషన్‌లో జరిగే వ్యవహారాలన్నీ చేరవేశారా అని అధికారులు అనుమానిస్తున్నారు.
కోర్టుల్లో పోలీసులపై పిటిషన్లు
చలసాని ప్రసన్న భార్గవ్ పోలీసులపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తుంటాడు. అనుమతులు లేకుండా స్పాలు నిర్వహించడంలో, పరాయి వ్యక్తుల మీద అనుమతులు తీసుకుని నిర్వహించడంలోనూ దిట్ట. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు వేధిస్తున్నారని ఇంతకుముందు కోర్టుల్లో పిటిషన్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా కొద్దినెలల కిందట పోలీసులు వరుసగా తనిఖీలకు వెళ్లడంతో ఉన్నతాధికారులను కలిసి తన స్పా కేంద్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకపోయినా మాచవరం పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో నగరంలో సగం స్పా కేంద్రాలు భార్గవ్ కంబంధహస్తాల్లో ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే స్పా మాఫియాకు డాన్‌గా మారిపోయాడు. పోలీసులు అతడి స్పాలో తనిఖీలకు వెళ్తున్నారన్న సమాచారం తెలుకోవడానికి కొన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బందిని కోవర్టులుగా మార్చుకున్నాడు. అతడు ఇచ్చే నెలావారీ మామూళ్లకు కక్కుర్తి పడిన కొంతమంది ఇన్‌స్పెక్టర్లు వేసే అడుగులను ముందుగానే తెలియజేసేవారు. ఇప్పటికీ పోలీసు స్టేషన్లలో కోవర్టులు ఉన్నారని మాచవరం పీఎస్‌లో జరిగిన ఘటనతో తేలిపోయింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మాచవరం పీఎస్‌లో భార్గవ్ కోవర్టుల లెక్కలను తేల్చాలని అధికారులు నిర్ణయించారు. కొద్దిరోజుల్లోనే ఈ కోవర్టుల జాబితా బయటకు తీస్తామని అధికారులు వెల్లడించారు.
మడ అడవుల ఆక్రమణ
- మచిలీపట్నం మండలం కానూరులో మడ చెట్ల నరికివేత
- మూడు రోజులుగా సాగుతున్న వ్యవహారం
- 50 ఎకరాలుపైనే కబ్జాకు ప్రణాళిక
- అధికారులకు పెదపట్నం, కానూరు గ్రామస్తుల ఫిర్యాదు
- అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
మడఅడవులపై మళ్లీ అక్రమార్కుల కన్నుపడింది. మచిలీపట్నం మండలం కానూరు రెవెన్యూ గ్రామ పరిధిలో సహజసిద్ధంగా ఎదిగిన మడ చెట్లపై రసాయనాలు వినియోగించి తొలగిస్తున్నారు. 50 ఎకరాలుపైనే కబ్జాకు ప్రణాళిక రచించారు. అటువైపు ఎవరూ రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నారు. గత మూడు రోజులుగా సాగుతున్న ఆక్రమణ పర్వంపై పెదపట్నం, కానూరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆవైపు ఎవరూ కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మండలం కానూరు గ్రామానికి చెందిన స్వామి, అతని అనుచరులు 50 ఎకరాలకుపైగా మడఅడవుల భూములను ఆక్రమించేందుకు పథక రచన చేశారు. మచిలీపట్నం మండలం పెదపట్నం నుంచి బంటుమిల్లి మండలం నారాయణపురం వెళ్లే రహదారికి సమీపంలో కానూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని మడఅడవులను ఇందుకు ఎంచుకున్నారు. ఈసారి నూతన వ్యూహాన్ని అమలు చేశారు. ముందుగా మడచెట్లు చనిపోయేందుకు వాటి పై రసాయనాలు పిచికారీ చేయించారు. రసాయనాల ప్రభావంతో చెట్లు ఎండిపోయాయి. వాటిని గత మూడు రోజులుగా కూలీలను తీసుకువెళ్లి కొట్టి తొలగిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని చెబుతూ ఆక్రమణ కొనసాగిస్తున్నారు. నారాయణపురం వంతెన వద్ద నుంచి చెట్లను నరికివేస్తున్న ప్రాంతానికి ఎవ్వరినీ వెళ్లనీయకుండా అక్రమార్కులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. అటువైపునకు ఎవరైనా వెళుతుంటే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు.
మత్స్యకారులను బెదిరిస్తూ..
కానూరు గ్రామం సముద్రం పక్కనే ఉండటంతో మడ అడవుల్లోకి సముద్రపు పోటు సమయంలో ఉప్పునీటితోపాటు మత్స్య సంపద చేరుతుంది. సముద్రం ఆటు సమయంలో మడ అడవుల్లోని గుంతల్లో చేపలు, రొయ్యలు, పీతలు ఉండి పోతాయి. వాటిని స్థానిక మత్స్యకారులు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ తరహా వేటను కొనసాగించే మత్స్యకారులను సైతం అవైపునకు వెళ్లనీయకుండా అక్రమార్కులు కట్టడి చేస్తున్నారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.
గతంలో మణిమేశ్వరం సమీపంలో ఆక్రమణకు యత్నం
గతేడాది నవంబరులో కానూరు రెవెన్యూ గ్రామం, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం సరిహద్దులో మడఅడవులను నరికి చెరువులుగా మార్చేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు అందడంతో మడఅడవుల ఆక్రమణను అడ్డుకున్నారు. ఈ ఏడాది జనవరిలో అదే ప్రాంతంలో మడచెట్లను నరికివేస్తుండటంతో అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో పరిశీలించి మడచెట్లను నరికివేయిస్తున్న ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరువకముందే కానూరుకు చెందిన కొందరు వ్యక్తులు పెదపట్నం, నారాయణపురం సమీపంలో మడ అడవులను అక్రమించేందుకు చెట్లను నరికివేయించడం గమనార్హం.
ఆక్రమణలపై ఫిర్యాదు
కానూరులో ఏపుగా ఎదిగిన మడఅడవులను నరికి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కానూరు, పెదపట్నం గ్రామస్తులు రెండు రోజుల కిందటే అధికారులకు ఫిర్యాదు చేశారు. మడచెట్లు నరికివేస్తున్న ప్రాంతంలో రొయ్యల చెరువులు ఉన్నాయని, అక్కడకు వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పెదపట్నం, కానూరు గ్రామస్తులు కోరుతున్నారు.
నగరం ‘సురక్షితం’
ఫ అన్ని అపార్ట్‌మెంట్లకు నిఘా నేత్రాలు
ఫ బహుళ ప్రయోజనాలు ఉండేలా పోలీస్‌శాఖ ఏర్పాటు
ఫ అపార్ట్‌మెంట్‌కు ఒక సీసీ కెమెరా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం
ఫ మిగిలిన కెమెరాల ఏర్పాటు బాధ్యత ఆ సంక్షేమ సంఘాలదే
ఫ ప్రయోగాత్మకంగా ‘పశ్చిమ’లో అమలు
నగరానికి నలుదిక్కుల ఎటుచూసినా బహుళ అంతస్తులతో అపార్టుమెంట్లు కనిపిస్తున్నాయి. వాటికి ఎక్కడో ఒకచోట సీసీ కెమెరాలు కనిపిస్తాయి. వాటిలో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయో, ఎన్ని పనిచేయడం లేదో ఎవరికీ తెలియదు. ఒకవేళ పనిచేసినా ఫుటేజీల్లో స్పష్టత ఉండదు. దీనితో పోలీసులు ప్రాజెక్టు సురక్షకు శ్రీకారం చుట్టారు. నగరంలో ఉన్న ప్రతి అపార్టుమెంట్‌కు బహుళ ప్రయోజనాలు ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. ఈ ‘సురక్ష’లను ప్రయోగాత్మకంగా పశ్చిమ నియోజకవర్గంలో అమలు చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
విజయవాడ నగరాన్ని నిఘా నీడలోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో సంబంధం లేకుండా కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నగరానికి నాలుగు వైపులా నిఘా నేత్రాలను, సురక్ష కమిటీలను ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ వర్గాల నుంచి 20 మందిని ఎంపిక చేసి సురక్ష కమిటీలుగా వేశారు. ఇప్పుడు ఈ కమిటీల ద్వారా నగరంలోని అపార్టుమెంట్లలో ‘సురక్ష’లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. దీనికోసం పోలీసుశాఖ ఒక ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో అపార్టుమెంట్‌కు పోలీసు శాఖ ఒక సీసీ కెమెరాను ఉచితంగా ఇవ్వనుంది. మిగిలిన సీసీ కెమెరాలను అపార్టుమెంట్ల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నగరాన్ని భద్రతా వలయంలో పెట్టడానికి పోలీసు అధికారులు మూడు దశలుగా ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో కమ్యూనిటీ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కాలనీలు, సంక్షేమ సంఘాల ద్వారా నిధులను సమీకరించి 1,264 కెమెరాలను ఏర్పాటు చేయించారు.
అపార్టుమెంట్ సంక్షేమ సంఘాలతో సమావేశాలు
ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు విజయవాడలో విశాలంగా ఉన్న రహదారులు. నగరంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ప్రధాన రహదారులు కాకుండా 85 శాతం అంతర్గత రహదారులు ఉన్నాయి. నగరంలో మొత్తం మూడు వేలకు పైగా అపార్టుమెంట్లు ఉన్నాయని పోలీస్ గణాంకాలు తేల్చాయి. ఈ అపార్టుమెంట్లన్నీ ఎక్కువగా ఈ అంతర్గత రహదారులను ఆనుకుని, వీధుల్లో ఉన్నాయి. వాటికి ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల్లో కొన్ని పనిచేస్తున్నాయని, మరికొన్ని పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే అందులో స్పష్టత ఉండడం లేదు. కొన్ని అపార్టమెంట్లలో సీసీ కెమెరాలు కేవలం అలంకారప్రాయంగా ఉంటున్నాయి. ఇవన్నీ కొన్ని కారణాలైతే ఈ సీసీ కెమెరాలన్నీ అపార్టుమెంట్ల లోపల మాత్రమే ఉంటున్నాయి. వాటిలో బయట ఉన్న రహదారులు కనిపించలేదు. దీనితో ప్రతి అపార్టుమెంట్‌లోను బహుళ ఉపయోగాలు ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 600-700 అపార్టుమెంట్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ అపార్టుమెంట్ల సంక్షేమ సంఘాలతో సురక్ష కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహిస్తారు. పోలీసు శాఖ 4మెగా ఫిక్సల్ సీసీ కెమెరాను ఉచితంగా ఇస్తుందని, అటువంటి కెమెరాలను రెండు, మూడు వరకు సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తారు. ఈ కెమెరాలను 45 డిగ్రీల కోణంలో బయట రహదారులను చిత్రీకరించేలా ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలకు ఎన్వీఆర్ (నెట్‌వర్క్ వీడియో రికార్డర్) అవసరం ఉండదు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే సరిపోతుంది. 256 జీబీ సామర్థ్యం ఉన్న ఎస్‌డీ కార్డును కెమెరాలో అమర్చుతారు. ఇది 28 రోజుల ఫుటేజీ భద్రంగా ఉంచుతుంది. తర్వాత అది చెరిగిపోతుంది. ఇలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఐపీ అడ్రస్‌లను ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా నగరంలో ఉన్న ప్రతి రహదారిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజవర్గంలో ‘సురక్ష’ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
15 వేల కెమెరాల ఏర్పాటే లక్ష్యం
పోలీసు కమిషనరేట్ పరిధిలో 10 వేల నుంచి 15వేల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టును చేపట్టాం. ఒక సీసీ కెమెరాను అపార్టుమెంట్ సంక్షేమ సంఘాలకు ఉచితంగా అందజేస్తాం. ప్రతి అపార్టుమెంట్‌కు సంక్షేమ నిధి ఉంటుది. దాని నుంచి రెండు, మూడు కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ కెమెరాలను ఏ కోణంలో ఏర్పాటు చేయాలో మా సిబ్బంది సూచిస్తారు. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామానికి ప్రవేశమార్గం, బయటకు వెళ్లే మార్గంతోపాటు ముఖ్యమైన కూడలిలో ఒక సీసీ కెమెరా ఇలా మొత్తం మూడు నుంచి నాలుగు కెమెరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
-ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు కమిషనర్
అవుటర్ ఆశలు
- రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
- మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలు
- పెట్టుబడుల ఆకర్షణతో ఉపాధి, ఉద్యోగాల కల్పన
- రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానం
- పరిశ్రమల స్థాపన, పర్యాటక, ఆతిథ్య రంగాల అభివృద్ధికి బాటలు
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)తో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పల్లెలకు మహర్దశ పట్టనుంది. తాజాగా ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించింది. గ్రామీణుల భూములు, ఆస్థుల విలువ పెరగనుంది. మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్‌గా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో కంచిచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, కృష్ణాజిల్లాలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల పరిధిలోని మొత్త 52 గ్రామాల మీదుగా ఈ అవుటర్ రింగ్ రోడ్డు వెళుతుంది. కంచికచర్ల నుంచి మొదలై జుజ్జూరు, నందిగామ, జి.కొండూరు, మైలవరం, అంపాపురం, పెద్ద అవుటపల్లి, మారేడుమాక, దావులూరు, రొయ్యూరు, చిన పులిపాకల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అలైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే ఆయా ప్రాంతాలన్నింటికీ మహర్దశ పట్టనుంది. విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదన వెనక్కిపోవటంతో నిరాశతో ఉన్న ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజల్లో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఆశలు రేకెత్తిస్తోంది. ఓఆర్‌ఆర్‌ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలోనే ఓఆర్‌ఆర్‌కు భూ సేకరణ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఏడాది లోపు ఈ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్‌తో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఊతం ఇవ్వడంతో పాటు, అభివృద్ధి అవకాశాలను సృష్టించడం వంటివి జరగనుండటంతో భూముల బూమ్ నెలకొంది.
పెరగనున్న భూములు, ఆస్థుల విలువ
అవుటర్ రింగ్ రోడ్డు అనుసంధానమవుతున్న ప్రాంతాల్లో భూములు, ఆస్థుల విలువలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రధానంగా నందిగామ, జి.కొండూరు, మైలవరం, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ సమీపంలోని భూములు రెసిడెన్షియల్, కమర్షియల్‌గా అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా మారనున్నాయి. షాపింగ్ మాల్స్, ఆఫీసులు, వెంచర్లు, నివాస ప్రాంతాలు, కాలనీలు, దాబాలు, షాపులు ఇలా అనేక రకాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇలాంటి కార్యకలాపాల వల్ల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అవుటర్ వెంబడి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి అవకాశం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువుగా సాగటం వల్ల స్థానిక ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అనేక ఉపాధి, ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
పెట్టుబడుల ఆకర్షణ
అవుటర్ రింగ్ రోడ్డు వల్ల పెట్టుబడులను ఆకర్షించటానికి అవకాశాలు పెరుగుతాయి. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, పట్టణ ప్రాంతాల పరిధిలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. పెట్టుబడులు ఏ స్థాయిలో అయినా ఉండవచ్చు. స్థానిక పెట్టుబడులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను కూడా ఆకర్షించటానికి వీలుగా పరిస్థితులు ఉంటాయి.
మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం
అవుటర్ రింగ్ రోడ్డు సాకారమవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం ద్వారా నిరంతరాయ విద్యుత, వాటర్ నెట్‌వర్క్, సీవరేజీ నెట్‌వర్క్, అనుసంధాన రోడ్లు, ఉద్యానవనాలు, పాఠశాలలు, కాలేజీలు వంటివి ఏర్పాటు కావటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.
పరిశ్రమలు, వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు మార్గం
అవుటర్ రింగ్ రోడ్డు వల్ల మెరుగైన కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు కూడా అవుటర్ వెంబడి కొలువుదీరటానికి అవకాశం ఉంది. అవుటర్ వెంబడి పరిశ్రమల ఏర్పాటు వల్ల తమ ఉత్పత్తులను అత్యంత తేలిగ్గా ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దిగుమతులు చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. అనేక రకాల వ్యాపారాలను కూడా స్థాపించటానికి అవకాశం ఉంది. ఈ కార్యకలాపాల వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతాయి.
పర్యాటకంగా అభివృద్ధి
ఓఆర్‌ఆర్ వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్ తోటపల్లిలోని బ్రహ్మయ్య లింగం చెరువు పక్క నుంచి వెళుతోంది. దీంతో బ్రహ్మయ్య లింగం చెరువు, బ్రహ్మకైలాసం వంటివి దైవక్షేత్రం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింతగా అభివృద్ధి చెందటానికి దోహదపడనుంది. ఇలా ఎన్నో ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పర్యాటక వనరులను బట్టి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, కాటేజీలతో ఆతిథ్య రంగం కూడా విస్తరించనుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుసంధానం
అమరావతి, విజయవాడ, గుంటూరు వంటి పట్టణ ప్రాంతాలతో సెమీ అర్బన్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు ఓఆర్‌ఆర్ వల్ల అనుసంధానం ఏర్పడుతుంది. దీనివల్ల పట్టణ ప్రాంతాలతో తేలిగ్గా అనుసంధానం కావటంతో పాటు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది.