Share News

Southwest Monsoon: నాలుగైదు రోజుల్లోనే కేరళకు నైరుతి

ABN , Publish Date - May 21 , 2025 | 02:36 AM

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ఉత్తర కేరళలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

Southwest Monsoon: నాలుగైదు రోజుల్లోనే కేరళకు నైరుతి

సాధారణం కంటే వారం ముందే రుతుపవనాల రాక

వయనాడ్‌ సహా నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

24 గంటల్లో 204 మి.మీ.పైగా వర్షం కురిసే చాన్స్‌

భారీ వర్షాలతో బెంగళూరు, గువాహటీ అతలాకుతలం

రేపు అల్పపీడనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. సాధారణంగా జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ముందస్తుగానే మే 27న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. దానికంటే కూడా ముందుగానే కేరళను తాకనున్నట్టు తాజాగా మంగళవారం వెల్లడించింది. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ర్టాలను రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. అంటే సాధారణం కంటే వారం ముందుగా రుతుపవనాలు కేరళకు రానున్నాయి. కేరళలోకి ప్రవేశించిన రెండు, మూడు రోజులకు రాయలసీమ, దక్షిణ కోస్తాను తాకుతాయని అంచనావేశారు.

cfg.jpg

ఉత్తర కేరళలో స్తంభించిన జనజీవనం

కేరళ ఉత్తర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక పట్టణకేంద్రాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. కాసరగాడ్‌, కన్నూర్‌, వయనాడ్‌, కోఝికోడ్‌ జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పాలక్కడ్‌, మలప్పురం, త్రిశూర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. ఇడుక్కి, ఎర్నాకుళం, కొట్టాయం, అలప్పుఝా, పతనంతిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు, అసోం రాష్ట్రంలోని గువాహటీ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.


రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇంకా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. బాపట్ల జిల్లా రేపల్లెలో 90, విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లో 75, కృష్ణా జిల్లా ఘంటసాలలో 71 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఎల్‌ నినో ముప్పు లేదు..

ఈ ఏడాది ఎల్‌ నినో ఏర్పడే పరిస్థితులు లేవని గతనెలలోనే ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్‌ నినో ఏర్పడదంటే బలమైన రుతపవనాలకు సంకేతం. దేశంలో వ్యవసాయం సమృద్ధిగా ఉండాలంటే బలమైన రుతుపవనాలు ఉండటం కీలకం. నైరుతి రుతుపవనాల సీజన్‌లో గత 50 ఏళ్ల సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా, దానికి 96 నుంచి 104 శాతాన్ని సాధారణ వర్షపాతంగా ఐఎండీ నిర్ధారించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 02:41 AM