Southwest Monsoon AP: 28లోగా ఏపీకి నైరుతి
ABN , Publish Date - May 23 , 2025 | 07:02 AM
అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాల్లో అల్పపీడనాల ప్రభావంతో ఈ నెల 28లోగా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి.
అరేబియా సముద్రంలో అల్పపీడనం
27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విశాఖపట్నం, అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో కేరళ, తమిళనాడుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇదిలావుండగా, ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. తాజా అంచనాల ప్రకారం రుతుపవనాలు ఈ నెల 28వ తేదీలోగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కాగా, రాష్ట్రంలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల శాఖ తెలిపింది.