Tirumala Ticket Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ‘శ్రీవారి’ టికెట్ల పేరిట మోసం
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:51 AM
ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తిరుమల టూటౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా పంజవరం గ్రామానికి చెందిన పంజా రమణప్రసాద్(29) బీటెక్ చదివి, 2015 వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు.
నకిలీ టికెట్లతో రూ.కోటి ఆర్జన
పశ్చిమగోదావరి జిల్లా వాసి అరెస్టు
తిరుమల, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ రూ.లక్షలు సంపాయించుకునే యువకుడు.. జల్సాలకు అలవాటు పడి దొంగదారి పట్టాడు. తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరిట ఘరానా మోసం చేసి రూ.కోటికిపైగా ఆర్జించాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తిరుమల టూటౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా పంజవరం గ్రామానికి చెందిన పంజా రమణప్రసాద్(29) బీటెక్ చదివి, 2015 వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. జల్సాలకు అలవాటు పడిన రమణ ప్రసాద్.. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టాడు. 2016లో తిరుమలకు వచ్చి లడ్డూ దళారీగా మారాడు. లడ్డూలు బ్లాక్‌లో విక్రయిస్తూ పరిచయాలు పెంచుకున్నాడు. శ్రీవారి దర్శనం, సేవా టికెట్లను కూడా ఇప్పిస్తానని భక్తులను నమ్మించాడు. దర్శనం, ఆర్జిత సేవలు చేయించుకోవాలనుకొనేవారు రమణ ప్రసాద్‌ను సంప్రదించేవారు. ఇదే అదునుగా వారి నుంచి నగదు తీసుకుని నకిలీ టికెట్లు పంపుతూ దోచుకున్నాడు. తనకు ఎవరైనా ఫోన్ చేసినా ట్రూకాలర్‌లో ‘టీటీడీ, టీటీడీ జేఈవో ఆఫీస్’ అని వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తనపేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా భక్తుల నుంచి నగదు తీసుకున్నాడు. రమణ ప్రసాద్ మోసాలకు గురైన కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు రమణ ప్రసాద్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రూ.25 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు పంపారు. కాగా, రమణప్రసాద్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా రూ.1,33,58,390 లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. తిరుమలలోని వన్‌టౌన్, టూటౌన్ పోలీస్టేషన్లలో 12 కేసులు, విజయనగరం, కాకినాడలో ఒక్కో కేసు చొప్పున చీటింగ్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలోనూ కొన్ని కేసులు ఉన్నాయని, వాటిలో జైలు శిక్ష కూడా అనుభవించాడని చెప్పారు.