పర్యావరణహిత నగరంగా శ్రీసిటీ
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:12 AM
శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వాములతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది.

నిర్మాణ పనుల్లో 90శాతం ఎం-శాండ్ వినియోగం
మట్టి పునర్వినియోగంపై మార్గదర్శకాలు
వరదయ్యపాళెం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వాములతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. అనే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) మూల సూత్రాల ఆధారంగా పర్యావరణానికి హానిని గణనీయంగా తగ్గించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టుల పనుల్లో ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఎం-శాండ్ (గ్రానైట్ రాళ్ల పొడితో తయారయ్యే ఇసుక)ను విధిగా 90 శాతం ఉపయోగించాలని నిర్ణయించింది. ఫిల్లింగ్ కోసం బయట మట్టిని కొనుగోలు చేయడం తగ్గించి ఆయా ప్లాట్లలో తవ్విన మట్టినే ఉపయోగించే విధానాన్ని ప్రోత్సహించనుంది. దీంతో పాటు భూ ఉపరితలాన్ని సమర్థంగా నిర్వహించి వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వకు ఉత్తమ పరిష్కారాలు చూపనుంది.
హరిత నగర లక్ష్యాన్ని సాధించే దిశగా సుస్థిర వనరుల నిర్వహణ, పర్యావరణ హిత కార్యకలాపాలను అమలు చేయడంలో శ్రీసిటీ ఎప్పుడు ముందుంటుందని ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను అవలంబించడం ద్వారా స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి దోహదపడే చర్యలను అమలు చేస్తామన్నారు. కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఏజీ అండ్ పీ నెట్‌వర్క్ ద్వారా.. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను శ్రీసిటీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే పద్ధతి వల్ల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా బొగ్గు వినియోగంతో ఏర్పడే కాలుష్య బెడదను అరికడుతుందన్నారు. పారిశ్రామిక సంస్థలు వీలైనంత త్వరగా సీఎన్‌జీకి మారడం ద్వారా ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోచ్చని తెలిపారు. ఈ నూతన విధానాల అమలు ద్వారా పారిశ్రామికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను నెలకొల్పి ప్రముఖ సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంటుందని వెల్లడించారు.