రేపటి నుంచి శివరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:15 AM
తిమ్మమ్మ మర్రిమాను ఉన్న మండలంలోని గూటిబైలు గ్రామంలో ఏటా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు మంగళవారం అమ్మవారి రథోత్సవంతో ప్రారంభమవుతాయి.

నంబులపూలకుంట, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తిమ్మమ్మ మర్రిమాను ఉన్న మండలంలోని గూటిబైలు గ్రామంలో ఏటా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు మంగళవారం అమ్మవారి రథోత్సవంతో ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మహాశివరాత్రి రోజు ను అమ్మవారి సన్నిధిలో జాగరణచేస్తే వారికి మేలు జరుగుతుందని భక్తుల నమ్మకం. బుధవారం మహాశివరాత్రి జాగరణ సందర్భంగా అమ్మవారు ప్రత్యేకాలంరణలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి తిమ్మమాంబ జీవిత చరిత్ర బురకథ రూపంలో వినిపిస్తారు. ఈ కథను వినడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గురువారం మొక్కులు తీర్చుకుని ఆరాత్రి బస చేస్తారు. ఆరోజుకూడా బురకథ ఉంటుంది. ఈ యేడాది శివరాత్రికి హోటల్ నిర్వాహణతో పాటు, ఏర్పాట్లు కూడా చాలా అంగరంగవైభవంగా చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
చూడదగిన ప్రదేశాలు: తిమ్మమ్మ, బాలవీరయ్యల దర్శనాంతరం తిమ్మమాంబ సతీసహగనం చేసిన ప్రదేశంలో తిమ్మమ్మ ఘాట్, తిమ్మమ్మ కోట, శివప్రాజెక్టు, ఓబుళదేవర గుట్టలో వెలసిన గణపతి, లక్ష్మీనరసింహస్వామి, కనకదుర్గమ్మ, కైవారంతాత, అయ్య ప్పస్వామి,వెంకటేశ్వరస్వామి ఆలయలను భక్తులు దర్శించుకోవచ్చు.
ఇలా వెళ్లాలి..: కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మీదుగా, పుట్టపర్తి జిల్లాలోని తనకల్లు మండలంలోని కొక్కంటి క్రాస్ మీదుగా మర్రిమానుకు చేరుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లా వాసులు అన్నమయ్య జిల్లా కేంద్రానికి చేరుకుని గాండ్లపెంట మండలంలోని రెక్కమాను మీదుగా మర్రిమానుకు చేరుకోవచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులు కదిరి వచ్చి గాండ్లపెంట మండలంలోని రెక్కమాను మీదుగా మర్రిమాను చేరుకోవచ్చు.