Share News

YCP Sharmila: ఉనికి కోసమే జగన్‌ బల ప్రదర్శనలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:35 AM

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ తన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు, బలప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు.

YCP Sharmila: ఉనికి కోసమే జగన్‌ బల ప్రదర్శనలు

  • సింగయ్య మృతికి బాధ్యత వహించకుండా సమర్థించుకోవడం దుర్మార్గం

  • జగన్‌ ఇప్పటికీ మోదీ దత్తపుత్రుడే: షర్మిల

నెల్లూరు (వైద్యం), ఒంగోలు, కార్పొరేషన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ తన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు, బలప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పంచాయతీలో..జగన్‌ కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మరణిస్తే.. ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించకుండా, సమర్థించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలో ఉండగా పరదాల మాటున తిరిగిన జగన్‌ ఇప్పుడు సంఘ విద్రోహులను పరామర్శించేందుకే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ పాదాల వద్దకు చేరి అప్పట్లో కేంద్రం అమలు చేసిన ప్రతి బిల్లుకూ మద్దతు తెలిపారని, రాష్ట్ర సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు.


ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును 45 అడుగుల ఎత్తు కట్టాల్సి ఉన్నా కేంద్రం 41 అడుగులే కడతామంటూ పార్లమెంట్‌లో తీర్మానం చేసినా ఒక్క ఎంపీ కూడా దీన్ని ప్రశ్నించలేదని నిలదీశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ మోసం చేసిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించక పోవటం సరికాదని పేర్కొన్నారు. సూపర్‌సిక్స్‌ అమలులోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని విస్మరించారని అన్నారు. అన్నదాత సుఖీభవ రైతులకు ఇవ్వలేదని, తల్లికి వందనం కూడా అందరి తల్లులకూ పడలేదని.. ఇలా సూపర్‌సిక్స్‌కు కోతలు విధిస్తూ పోతే చంద్రబాబును ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. అంతకుముందు నగరంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి షర్మిల పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ మోదీ దత్తపుత్రుడే అని షర్మిల ఒంగోలులో అన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 05:35 AM