Share News

Shar Bomb Threat: షార్‌కు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:00 AM

శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో తీవ్రవాదులు ఉన్నారంటూ వచ్చిన కాల్‌తో సోమవారం తెల్లవారుజామున కలకలం రేగింది. విస్తృత తనిఖీలు చేశాక ఉత్తుత్తిదేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Shar Bomb Threat: షార్‌కు బాంబు బెదిరింపు

  • చెన్నై పోలీసు కంట్రోల్‌ రూంకు అర్ధరాత్రి ఫోన్‌కాల్‌

  • తమిళనాడు అధికారుల సమాచారంతో తనిఖీలు

  • ఫేక్‌ కాల్‌గా నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్‌

సూళ్లూరుపేట, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో తీవ్రవాదులు ఉన్నారంటూ వచ్చిన కాల్‌తో సోమవారం తెల్లవారుజామున కలకలం రేగింది. విస్తృత తనిఖీలు చేశాక ఉత్తుత్తిదేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్‌చేసిన వ్యక్తి.. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన బాలకృష్ణన్‌ విజయ్‌బాబుగా సూళ్లూరుపేట పోలీసులు గుర్తించారు. దీంతో సేలం వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వివరాలు ఇవి.. షార్‌లో తీవ్రవాదులు ఉన్నారని, బాంబు పెట్టారంటూ ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చెన్నై పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోను చేశాడు. తమిళనాడు పోలీసు అధికారులు ఏపీ పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే తిరుపతి జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, పోలీసులు సోమవారం తెల్లవారుజామున షార్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందం షార్‌ ప్రధాన రహదారులు, మొదటి గేటు, రెండో గేటు, షార్‌ ఉద్యోగుల కాలనీ, లేబర్‌ కాలనీల్లో అణువణువూ గాలించారు. సీఐఎ్‌సఎఫ్‌ కమాండెంట్‌ ఆధ్వర్యంలో 80 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి షార్‌ కేంద్రం లోపల రాకెట్‌ ప్రయోగ వేదికలతోపాటు చుట్టుపక్కల అడవుల్లోనూ జల్లెడ పట్టారు. సముద్ర మార్గంలో మెరైన్‌ పోలీసులు, కోస్టల్‌ గార్డులు కూంబింగ్‌ చేశారు. తెల్లవారు జామున నుంచి 11 గంటల వరకు ఇటు పోలీసులు, అటు సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది విస్తృత తనిఖీలు చేశారు. షార్‌ కేంద్రంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. షార్‌ లోపలకు వెళ్లే అన్ని వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతా ఉత్తిదేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిందితుడిని విచారిస్తున్న పోలీసులు

షార్‌కు బెదిరింపు కాల్‌చేసిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన బాలకృష్ణన్‌ విజయ్‌బాబుగా గుర్తించిన సూళ్లురుపేట పోలీసులు.. సేలం వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అతడు కాల్‌ చేసిన ఫోన్‌ నంబరు ఆధారంగా.. పోలీసులు విజయబాబును గుర్తించారు.

Updated Date - Jun 17 , 2025 | 04:01 AM