Heatwave: మరో వారం వరకు భగభగలే
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:11 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత పెరిగింది. రానున్న రోజుల్లో వడగాడ్పులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడ వర్షాలు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండ తీవ్రత కొనసాగింది. దక్షిణ భారతంలో అనేక ప్రాంతాల్లో అధికపీడనం ఉంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తుండడంతో గడచిన రెండు రోజుల నుంచి ఉక్కపోత పెరిగింది. సోమవారం గాలిలో తేమశాతం రాయలసీమలో 30 నుంచి 50, కోస్తాలో 50 నుంచి 80 శాతం వరకూ నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉక్కపోత కొనసాగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికితోడు అనేక ప్రాంతాల్లో ఎండలు పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈనెల 28వ తేదీ వరకూ ఎండ తీవ్రత కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, ఉత్తర ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న వారం పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఎండలు మరింత పెరిగి వాతావరణ అనిశ్చితి నెలకొని పిడుగులు, వడగళ్లతో వానలు పడే అవకాశం ఉందన్నారు.
నేడు, రేపు వడగాడ్పులు
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత, వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 28 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 21 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. అక్కడక్కడ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం తిరుపతి రూరల్‌లో 42.1, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 41.5, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.4, ఏలూరు జిల్లా దెందులూరులో 41.3, పల్నాడు జిల్లా రావిపాడు, నంద్యాల జిల్లా గోనవరంలో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..