Cold Wave Hits Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ముందెన్నడూ లేని విధంగా..
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:46 AM
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎజెన్సీ ప్రాంత ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత అల్పానికి పడిపోయాయి. జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడా అదే పరిస్థితి నెలకొంది. నిన్న(శనివారం) తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో అత్యంత అల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పదేళ్ల రికార్డు స్థాయిలో చలి బెంబేలెత్తిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో అత్యంత అల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, గత ఏడాది ఇదే ప్రాంతంలో 17.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం.
కమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూలో కూడా గత కొద్దిరోజుల నుంచి గడ్డ కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్‌లో 10 డిగ్రీలు, మహాబూబ్‌నగర్‌లో 5.4, మెదక్‌లో 5.4 ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రతి చోటా సాధారణం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉండనుందని హెచ్చరించారు.
ఏపీలోనూ దారుణ పరిస్థితులు..
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎజెన్సీ ప్రాంత ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. చలి వాతావరణం కారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వెచ్చటి ప్రాంతాల్లోకి పరుగులు తీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మాజీ అగ్నివీర్‌లకు బీఎస్ఎఫ్‌లో 50శాతం రిజర్వేషన్