Share News

Skill Development: ‘నైపుణ్య శిక్షణ’కు ‘సీడాప్‌’ తూట్లు!

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:00 AM

ఈ శిక్షణ కార్యక్రమాల అమలుకు 2016, 2019లో ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీ(పీఐఏ)లను ఎంప్యానెల్‌ చేశారు. మొత్తం 41 పీఐఏలు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Skill Development: ‘నైపుణ్య శిక్షణ’కు ‘సీడాప్‌’ తూట్లు!

యువత ఉపాధి కల్పనపై నీలినీడలు

అర్ధంతరంగా 13 పీఏఐల తొలగింపు

ఈ ఏడాది లక్ష మందికి శిక్షణ కష్టమే

వైసీపీకి పనిచేసిన వ్యక్తికి పెద్దపీట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నైపుణ్యాభివృద్ధి శాఖలో భాగంగా ఉన్న సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడాప్‌) గత కొన్నేళ్లుగా యువతకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై) ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమాల అమలుకు 2016, 2019లో ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీ(పీఐఏ)లను ఎంప్యానెల్‌ చేశారు. మొత్తం 41 పీఐఏలు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందుకుగాను ఒక్కో వ్యక్తికి సగటున రూ.50వేల చొప్పున పీఐఏలకు వెళ్తాయి. యువతకు శిక్షణతో పాటు భోజనం, రవాణా ఖర్చులు, ఉపాధి కల్పన, ఉద్యోగం వచ్చాక మొదటి రెండు నెలల సహకారం అందించడం పీఐఏల బాధ్యత. వివిధ చేతి వృత్తులు, ఇతర కోర్సులపై 3, 4, 6 నెలల పాటు వేర్వేరు శిక్షణ కార్యక్రమాలను పీఐఏలు నిర్వహిస్తాయి. అయితే కొందరికి మేలు చేసే ఉద్దేశంతో అకస్మాత్తుగా 13 పీఐఏలను ఇటీవల సీడాప్‌ తొలగించింది. ప్రాజెక్టు అప్రూవల్‌ కమిటీ(పీఏసీ)లో పెట్టి తొలగించినట్లు వారికి సమాచారం ఇచ్చింది. అయితే తొలగించే ముందు వారికి కనీసం నోటీసులు కూడా జారీచేయలేదు. అలాగే వారి వివరణ కూడా తీసుకోలేదు. సీడాప్‌ అధికారులు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకించినట్లు తెలిసింది. కానీ మంత్రి నారా లోకేశ్‌ పేషీలోని ఓ అధికారి, సీడా్‌పలో ఓ కీలక అధికారి, మరో రాష్ట్ర స్థాయి మిషన్‌ మేనేజర్‌ కలిసి ఉద్దేశపూర్వకంగా ఈ పీఐఏలను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.


వందల కోట్లతో శిక్షణ

పెద్దగా ప్రచారం లేకపోయినా సీడాప్‌ ఏటా వందల కోట్లతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి కూడా కేంద్ర ప్రభుత్వ పథక నిధులు కావడంతో ఎలాంటి అడ్డంకులూ లేకుండా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏడాదికి కనీసం రూ.200 కోట్లకు పైగా బిల్లులు పీఐఏలకు వెళ్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం తమకే రావాలని కొందరు ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం సీడా్‌పలో శిక్షణ కార్యక్రమాలకు ఎంప్యానల్‌ కావాలంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ) సిఫారసు చేయాలి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గత ప్రభుత్వంలో సీడా్‌పలో చక్రం తిప్పారు. ఇటీవల ఆయన పీఐఏను ఎన్‌ఐఆర్‌డీ బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఆ వెంటనే పేరు మార్చుకుని మరో పీఐఏ ద్వారా మళ్లీ సీడా్‌పలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో అనంతపురంలో ఆయన వైసీపీ అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు పలికారు. పలుమార్లు అప్పటి సీఎం జగన్‌ను కలిశారు. ప్రభుత్వం మారగానే ఉత్తరాంధ్రలో ఓ ఎంపీ ద్వారా మంత్రి లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాటి వ్యక్తికి ఎక్కువ ఆదాయం కట్టబట్టేలా సీడాప్‌ పెద్దపీట వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా ఈ ఏడాది లక్ష మందికి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని సీడాప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో 25లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ మేరకు సీడాప్‌ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఎక్కువ పీఐఏలు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను, వారి ఆసక్తులను గుర్తించి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొందరిని తొలగించడం వల్ల మిగిలిన 28 పీఐఏలతో లక్ష మంది శిక్షణ ఇవ్వడం ఎలా సాధ్యమని సీడాప్‌ వర్గాలు అంటున్నాయి.


సీడాప్‌ ద్వారా ఐదేళ్లలో 25లక్షల మందికి ఉపాధి కల్పించాలి.. ఇదీ ప్రభుత్వ లక్ష్యం! ఈ లక్ష్యానికి సీడాప్‌ తూట్లు పొడుస్తోంది. ఏడాదికి లక్ష మంది చొప్పున శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా అర్ధంతరంగా 13 ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీలను తొలగించి శిక్షణ కార్యక్రమాలు వేగంగా సాగకుండా బ్రేక్‌ వేసింది. మిగిలిన పీఐఏలకు లాభం చేయడం కోసమే ఉద్దేశపూర్వకంగా 13 పీఐఏలను తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. అందులోనూ గత ప్రభుత్వంలో వైసీపీకి బహిరంగంగా ప్రచారం చేసిన ఓ వ్యక్తిని తీసుకొచ్చి పెద్దపీట వేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 05:00 AM