Share News

SC MLAs: దళిత ద్రోహి జగన్‌

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:38 AM

వైఎస్‌ జగన్‌ దళిత ద్రోహి అని శాసనసభలో ఎస్సీ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగా..

 SC MLAs: దళిత ద్రోహి జగన్‌

  • 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు

  • ఎస్సీ ఎమ్మెల్యేల ధ్వజం.. పునరుద్ధరిస్తాం: మంత్రి డోలా

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ దళిత ద్రోహి అని శాసనసభలో ఎస్సీ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగా.. జగన్‌ ఆ పథకాలన్నింటినీ రద్దు చేసి ఎస్సీల కడుపు కొట్టారని దుయ్యబట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తమ శాఖకు నిధులను అభ్యర్థిస్తూ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన డిమాండ్‌పై చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అమలు చేసిన 27 పథకాలకు వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌, జగనన్న పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటని తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని కొండ్రు మురళీమోహన్‌ విమర్శించారు. దళిత మహిళలపై అత్యాచారాలు, ఘోరాలు, నేరాల్లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని వీఎం థామస్‌ ఎద్దేవా చేశారు.


ఎస్సీలకు దక్కాల్సిన రూ.33 వేల కోట్లను జగన్‌ దారి మళ్లించారని బొగ్గుల దస్తగిరి ఆరోపించారు. గిత్తా జయసూర్య, ఎంఎస్‌ రాజు, అయితాబత్తుల ఆనందరావు, ఆదిమూలం కూడా గత ప్రభుత్వం ఎస్సీలకు చేసిన అన్యాయంపై ధ్వజమెత్తారు. మంత్రి సమాధానమిస్తూ... 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కేంద్ర సహకారంతో వాటిని పునఃప్రారంభిస్తున్నామన్నారు. కాగా.. సొంత ఇళ్లను అద్దెకు ఇస్తున్నవారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చట్టంలో తగు మార్పులు, చేర్పులు చేయనున్నామని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. ఇళ్లలో అద్దెకుంటున్నవారు యజమానులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు ప్రస్తావించారు. ఈ సమస్యకు పరిష్కారం చూసుతూ ప్రైవేటు బిల్లు తీసుకొస్తామని తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 06:38 AM