Supreme Court: ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్‌రెడ్డిలకు మధ్యంతర రక్షణ
ABN , Publish Date - May 14 , 2025 | 05:43 AM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనెల 16వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర రక్షణ కల్పించింది.
ఈ నెల 16 వరకు కల్పించిన సుప్రీంకోర్టు
అదేరోజుకు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు అన్ని విధాలా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై మంగళవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బాలాజీ గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసులో విచారణకు హాజరుకావాలని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, కానీ వారు విచారణకు రావడం లేదని తెలిపారు. అయితే, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిద్దరికి ఈనెల 16వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ, అదే రోజుకు తదుపరి విచారణను వాయిదావేసింది. కాగా, బాలాజీ గోవిందప్ప అరెస్టు అక్రమమంటూ ఆయన తరపున సీనియర్ న్యాయవాది వాదించగా, అది అక్రమమా? సక్రమమా? అనేది తేల్చాల్సింది న్యాయస్థానమని ధర్మాసనం తెలిపింది. అరెస్టు చేశారని, 24గంటల్లో రిమాండ్ చేస్తారని, ఆ తర్వాత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..