CM Chandrababu Naidu : ఇదే మా పథం!
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:35 AM
‘చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల ముందు అందరూ అనుకున్నారు. నేనొస్తే జరిగే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో

నేనొస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు
ఇప్పుడు అది చేసి చూపిస్తున్నాను: సీఎం
7 నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు
మళ్లీ పట్టాలెక్కిన అమరావతి, పోలవరం
ప్రతి కుటుంబానికీ ఇల్లు, నీళ్లు, విద్యుత్, గ్యాస్
ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో
పోటీకి అవకాశమివ్వాలి: చంద్రబాబు
ఇప్పటికే ఇవి చేశాం
1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్... ప్రధాని శంకుస్థాపన.
రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ..
అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ఆర్సెలార్ నిప్పన్ ఆసక్తి..
ముడి ఇనుముపై స్పష్టత వస్తే 1.40 లక్షల కోట్లతో స్థాపన.
హైవేలపై కేంద్రం ఖర్చు 50 వేల కోట్లు.. రైల్వే లైన్లపై రూ.70 వేల కోట్లు
గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
ఆదాయం పెంచుకోకుండా పథకాలు అమలుచేయాలంటే అప్పులొక్కటే మార్గం. ఒక దశ దాటాక అప్పులు రావు. తీర్చే దారీ దొరకదు. కేంద్రం మన ఒక్కళ్లకే సాయం చేయలేదు. మన కాళ్లపై మనం నిలబడి ఆదాయం పెంచుకోవాలి.
మనకు మనుషులే ఆస్తి. ఆ ఆస్తి తగ్గితే బలహీనపడతాం. జనాభాను పెంచుకోవాలి. కొత్తతరం చాలినంత రాకపోతే పెద్ద తరం మాత్రమే మిగులుతుంది. కొన్ని దేశాలు ఇది ముందుగా ఊహించలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. మనం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎన్నికల ముందు అందరూ అనుకున్నారు. నేనొస్తే జరిగే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ఏడు నెలల్లో రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు సాధించాను. రూ.లక్షా 85 వేల కోట్ల వ్యయంతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఆర్సెలార్ నిప్పన్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో రూ.లక్షా 40 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆసక్తి చూపుతోంది. 12-14 మిలియన్ టన్నుల ముడి ఇనుము కేటాయించాలని ఆ కంపెనీ కేంద్రాన్ని అడుగుతోంది. కేంద్రం 7-9 మిలియన్ టన్నులు కేటాయించడానికి సుముఖంగా ఉంది. దీనిపై కొంత స్పష్టత వస్తే ఈ స్టీల్ ప్టాంట్ వస్తుంది. జాతీయ రహదారులపై రూ.50 వేల కోట్లు, రైల్వే లైన్లపై రూ.70 వేల కోట్లను కేంద్రం మన రాష్ట్రంలో ఖర్చు చేయబోతోంది. రోడ్లపై రాష్ట్రప్రభుత్వం పెట్టే ఖర్చుకు ఇది అదనం. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. పూర్తిగా నిలిచిపోయిన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కించాం. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా చేపట్టి పూర్తి చేస్తాం. ఈ 7 నెలల్లో రాష్ట్రంలో వృద్ధి రేటును గత ఏడాదితో పోలిస్తే మూడున్నర శాతం పెంచాం. ఏటా 15ు వృద్ధి రేటు సాధించి దానిని కొనసాగించగలిగితే కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు వస్తుంది. రాష్ట్రం సొంత ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితేనే ప్రజలకు పెట్టగలుగుతాం. ఆ స్థాయిలో వృద్ధి రేటు పెంచుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం. కొత్తగా 26 రంగాల్లో ప్రభుత్వ పాలసీలను ఖరారు చేసి పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంచాం. ఎక్కడ ఎటువంటి వ్యక్తి ఉంటే ఫలితం వస్తుందో అక్కడ అటువంటి వారిని పెడుతున్నాం’ అని చెప్పారు. అధికారంలోకి రాగానే రోడ్లు వేశామన్నారు. ధాన్యం రైతులకు 24 గంటల్లో డబ్బులు వేస్తున్నామని గుర్తుచేశారు. జిల్లా, మండలం, గ్రామం చొప్పున వృద్ధి రేటు లెక్కగట్టాలనుకుంటున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖలో తలసరి ఆదాయం పెరుగుతుందని.. చుట్టూ పారిశ్రామికీకరణ జరుగుతుండడం వల్ల తిరుపతి అతి పెద్ద నగరంగా మారుతుందని చెప్పారు. ఉద్యానవన పంటలు బాగా ఊపందుకుంటే కోస్తా ప్రాంతాన్ని రాయలసీమ దాటేసే అవకాశం ఉందన్నారు.పామాయిల్‌తో పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మెట్ట ప్రాంతం.. డెల్టా ప్రాంతమైన భీమవరాన్ని దాటేసే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
మాది రాజకీయ పార్టీ... రాజకీయ పాలన..
మాది రాజకీయ పార్టీ. ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చాం. దానిని ఇంటింటికీ తీసుకెళ్లింది మా కార్యకర్తలే.. అధికారులు కాదు. మావాళ్లు చెప్పింది నమ్మి ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. దానికోసం రాజకీయపరమైన పాలన అందిస్తాం. రాజకీయంగా బలంగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తాం. పనిగట్టుకుని ఎవరినీ వేధించం. అదే సమయంలో తప్పు చేసినవారిని వదిలిపెట్టం. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిపై కఠినంగా వ్యవహరించాం. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో తలదూర్చిన వారిని.. రౌడీయిజం చేస్తున్న వారిని ఊరుకోవడం లేదు. గతంలో తప్పులు చేసిన వారి విషయంలో పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నాం. తప్పులు చేసినవారు కొన్ని రోజులు తప్పించుకోవచ్చేమో గానీ ఎల్లకాలం తప్పించుకోలేరు. అన్నీ చూసుకుని వెళ్తాం. ఈ పని నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనది చిన్న రాష్ట్రం కావడంతో చాలినంత మంది అధికారులు లేక ఇబ్బంది వస్తోంది. ఉన్నవారితోనే పని చేయించుకోవడానికి యత్నిస్తున్నాం.
గ్రామీణ సంప్రదాయాలు కాపాడతాం
గ్రామీణ సంప్రదాయాలు కాపాడేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా చిన్నతనంలో మా ఊరి చుట్టుపక్కల జల్లికట్టు బాగా జరిగేది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉండేది. జల్లికట్టును తమిళనాడు ప్రభుత్వం నిషేధిస్తే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. స్పెయిన్‌లో బుల్‌ఫైట్ పేరుతో సంప్రదాయం ఉంది. కొన్ని సంప్రదాయాలను మనం తోసివేయలేం. రైతులు బాగుంటే సంక్రాంతి ఆనందంగా జరుగుతుంది. ఈసారి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పది లక్షల మంది వచ్చారు. తమ మూలాలు మరచిపోకుండా రావడం ఆనందదాయకం.
పీ-4 విజయవంతమవుతుంది..
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఒక ఇల్లు, మరుగు దొడ్డి, విద్యుత్, నీటి కనెక్షన్లు, పైపు ద్వారా గ్యాస్ సరఫరా, ఇంటిపైన సౌర విద్యుత్ తయారీకి పలకలు, ప్రతి వీధిలో వీధిదీపాలు, ప్రతి ఊరిలో ప్రకృతి వ్యవసాయం ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో బాగా పేదరికంలో ఉన్న కుటుంబాలు 12 లక్షలు ఉన్నట్లు గుర్తించాం. కలిగినవారిని ప్రోత్సహించి.. ఈ పేద కుటుంబాలకు వారి ఆసరా అందేలా చూడాలని అనుకుంటున్నాం. గతంలో పీ-3 రాష్ట్రంలో సంపద సృష్టించింది. పైన ఉన్నవారు.. కింద ఉన్నవారికి చేయూతనిచ్చి పైకి తెచ్చేందుకే పీ-4 కార్యక్రమం. దీనిని ఉగాది పండగ రోజు ప్రారంభిస్తున్నాం. ఇది బలవంతం కాదు. ఎవరికి వారు తమకు తాముగా ముందుకొచ్చి సమాజంలో అట్టడుగున ఉన్నవారిని పైకి తేవడానికి చేపట్టాం. దీనికోసం అందరినీ చైతన్యపరుస్తున్నాం. టెక్నాలజీ ద్వారా పేదలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా చూడాలనునుకుంటున్నాం. అనేక ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించబోతున్నాం. రాయలేనివారు నోటి మాటగా చెప్పి రికార్డు చేసి పంపినా అధికారులు చూసే ఏర్పాటు చేస్తున్నాం. పీ-4 విజయవంతం అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఇది జరిగితే రాష్ట్రంలో పేదరికం బాగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని అనుకుంటున్నాం. చట్టం చేసిన తర్వాత పిల్లలు కనేవారికే ఇది వర్తిస్తుంది.