Share News

College Demolition: శాతవాహన కళాశాల నేలమట్టం

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:59 AM

దశాబ్దాల ఘన చరిత్ర ఒక్కరాత్రిలో శిథిలమైంది. సొసైటీ ఏర్పాటు చేసిన కళాశాల ఓ వ్యక్తి దౌర్జన్యానికి నేలమట్టమైంది. విజయవాడలో శ్రీ దుర్గామల్లేశ్వర సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న శాతవాహన జూనియర్‌, డిగ్రీ కళాశాలను గురువారం అర్ధరాత్రి కూల్చివేశారు.

College Demolition: శాతవాహన కళాశాల నేలమట్టం

  • విజయవాడలో అర్ధరాత్రి కాలేజీ భవనాలు కూల్చివేత

  • కోర్టు ఆదేశాల పేరు చెప్పి వ్యక్తి దౌర్జన్యం

  • తరగతి గదుల్లో బల్లలు తీసుకెళ్లిపోయిన వైనం

  • శిథిలమైపోయిన 55 ఏళ్ల ఘన చరిత్ర

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు

విజయవాడ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల ఘన చరిత్ర ఒక్కరాత్రిలో శిథిలమైంది. సొసైటీ ఏర్పాటు చేసిన కళాశాల ఓ వ్యక్తి దౌర్జన్యానికి నేలమట్టమైంది. విజయవాడలో శ్రీ దుర్గామల్లేశ్వర సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న శాతవాహన జూనియర్‌, డిగ్రీ కళాశాలను గురువారం అర్ధరాత్రి కూల్చివేశారు. ఓ వ్యక్తి అనుచరులు సుమారుగా 20 మంది విశాలాంధ్ర రోడ్డులో ఉన్న కళాశాల ప్రాంగణంలోకి అర్ధరాత్రి ప్రవేశించి ముందుగా వాచ్‌మన్‌ వద్ద నుంచి ఫోన్‌ లాక్కుని, అతడిని ఒక గదిలో బంధించారు. తర్వాత మొత్తం భవనాలను ఎక్స్‌కవేటర్లతో పడగొట్టేశారు. తరగతి గదుల్లో ఉన్న బల్లలను వ్యాన్‌ల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ స్థలం తమదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ కళాశాలలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కూల్చివేత వెనుక పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వర సొసైటీని 1969లో గుండవరపు ప్రజాపతిరావుతోపాటు మరికొంతమంది కలసి ఏర్పాటు చేశారు. అప్పట్లో విజయవాడలో ఆంధ్ర లయోలా కళాశాల మాత్రమే ఉండేది. ఈ విద్యాసంస్థ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో హిందూ విద్యార్థుల కోసం కళాశాలను ఏర్పాటు చేయాలని సొసైటీ యోచించింది. ఈ నేపథ్యంలోనే శాతవావాహన కళాశాల పురుడు పోసుకుంది. 1971లో ముందుగా జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి.. తర్వాత డిగ్రీ స్థాయికి పెంచారు. కాలేజీకి అవసరమైన భూమిలో 2.95 ఎకరాలను బోయపాటి అప్పారావు అనే వ్యక్తి నుంచి సొసైటీ కొనుగోలు చేసింది. ఆయన సోదరి విజయలక్ష్మి 1.25 ఎకరాలను సొసైటీకి ఇచ్చారు. అయితే భూమికి సంబంధించి అగ్రిమెంట్‌ రాశారు తప్ప రిజిస్ట్రేషన్‌ జరగలేదు. కొంతకాలం తర్వాత అప్పారావు కుమారుడు బోయపాటి శ్రీనివాస అప్పారావు ఈ భూమి తనదంటూ కోర్టును ఆశ్రయించారు. మరోపక్క ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని సొసైటీ కూడా జిల్లా కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉంది. హైకోర్టులో తీర్పు సొసైటీకి అనుకూలంగా రావడంతో శ్రీనివాస అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


దీనిలో సొసైటీ వ్యవస్థాపక సభ్యుడు ప్రజాపతిరావు, అప్పటి కార్యదర్శి వంకాయలపాటి కామేశ్వరరావు, దుర్గామల్లేశ్వర సొసైటీ రెస్పాండెంట్స్‌గా ఉన్నారు. ఈనెల మూడో తేదీన సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి బోయపాటి శ్రీనివాస అప్పారావు తన అనుచరులతో కళాశాల భవనాలను కూల్చివేయించారు. ఈ స్థలం తనకు చెందినదని, ఆక్రమించిన వారు శిక్షార్హులని బోర్డులు ఏర్పాటు చేశారు. రెస్పాండెట్లుగా ఉన్న ప్రజాపతిరావు, కామేశ్వరరావు పిటిషన్లను ఉపసంహరించుకోవడంతో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని శ్రీనివాస అప్పారావు తరఫు న్యాయవాది తెలిపారు. అక్రమంగా కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించి భవనాలను కూల్చడంపై సొసైటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ప్రజాపతిరావు పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు, సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస అప్పారావు, ధూళిపూడి శ్రీకాంత్‌, వంకాయలపాటి శ్రీనివాసరావు, నిడుమోలు రమాసత్యన్నారాయణ తదితరులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 05:00 AM