Share News

AP to Hyderabad : విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:43 AM

పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు

AP to Hyderabad : విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

రైల్వే బ్రిడ్జి వద్ద ఇరుక్కున్న కంటైనర్‌

4.కి.మీ మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌కు భారీగా ప్రజల

తిరుగు ప్రయాణం రోడ్లపై వాహనాల బారులు

హైదరాబాద్‌ దారిలోట్రాఫిక్‌ జామ్‌

ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రజల రాక

ప్రధాన రోడ్లపై వాహనాల బారులు

బీబీనగర్‌, చౌటుప్పల్‌ టౌన్‌, కేతేపల్లి, కోదాడ రూరల్‌, చిట్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, కార్లు ఇతర ప్రైవేటు వాహనాలు, బైక్‌ల వరదతో రద్దీ నెలకొంది. 65వ నంబర్‌ జాతీయ రహదారి, ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద కంటైనర్‌ ఇరుక్కుపోయింది. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దాదాపు అరగంటపాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్‌ సాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్‌వైపు జాతీయ రహదార్లపై రద్దీ నివారణకు టోల్‌గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని గూడూరు, పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాల మీదుగా గురువారం లక్ష వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. గూడూరు టోల్‌ప్లాజా వద్ద రద్దీని నివారించేందుకు 100 అడుగుల దూరంలోనే ఫాస్టాగ్‌ స్కాన్‌ అయ్యేలా సాంకేతిక చర్యలు తీసుకున్నారు. ఈ టోల్‌ప్లాజాలో మొత్తం 12గేట్లు ఉండగా, హైదరాబాద్‌ వైపు ఎనిమిది, వరంగల్‌ వైపు నాలుగు గేట్ల నుంచి వాహనాలను పంపుతున్నారు. సాధారణ రోజుల్లో 20వేల వాహనాలు ప్రయాణిస్తే గురువారం 23వేల వాహనాలు వెళ్లాయి. ఇక్కడ బైక్‌ల మీద వస్తున్నవారికి పోలీసు సిబ్బంది డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్‌లో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. హైవేపై 200మంది పోలీసులను నియమించినట్లు, రెండు పెట్రోలింగ్‌ వాహనాలను 24 గంటలు తిప్పుతున్నామని ఏసీపీ తెలిపారు.

చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద 16గేట్లు కాగా హైదరాబాద్‌ వైపు 12గేట్ల నుంచి విజయవాడ వైపు నాలుగు గేట్ల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల వాహనాలు వెళుతుండగా, గురువారం అదనంగా 10వేల వాహనాలు వెళ్లాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాలోని 12టోల్‌ వసూలు కౌంటర్లలో వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు ఏడు కౌంటర్లు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు 5 కౌంటర్లు కేటాయించారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 17వేల వాహనాలు వెళుతుండగా, గురువారం 50వేల వాహనాలు వెళ్లాయి.

Updated Date - Jan 17 , 2025 | 03:43 AM