Sanjeevayya : విలువలకు రూపం సంజీవయ్య
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:58 AM
కర్నూలు నగరంలో నేడు అంతర్భాగంగా ఉన్న కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో 1921 ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య జన్మించారు మునెయ్య, సుంకలమ్మ దంపతులకు ఆయన ఐదో సంతానం. కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. జీవనాధారం కోసం పశువులు కాయడం,

నేడు సంజీవయ్య 104వ జయంతి
దామోదరం ప్రస్థానం స్ఫూర్తిదాయకం
అధికారికంగా జయంతి వేడుకలు
అమరావతిలో సంజీవయ్యకు పుష్పాంజలి
ఘటించనున్న సీఎం చంద్రబాబు
పేదల బిడ్డను వెతుక్కొంటూ వచ్చిన పదవులు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే పదితరాలకు తరగని ఆస్తి పోగేసుకుంటున్న రోజులివి! నేతలంటే మేతలే... అనే అభిప్రాయం బలపడిన కాలమిది.
కానీ, ఆయనను పదవులు వెతుక్కొంటూ వచ్చాయి. ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల వరకు ఆయనను ఏరికోరి కేబినెట్‌లో చేర్చుకున్నారు. దేశంలోనే తొలి దళిత సీఎంగా కీర్తినీ ఆయన ఆర్జించారు. కానీ, ఆర్థికంగా ఆర్జించింది లేదు. స్వగ్రామంలో ఆయన తల్లి చివరివరకు కట్టెల పొయ్యి మీదే వంట చేసి తాను తిని, పదిమంది ఆకలి తీర్చింది. ఆయన ఎవరో కాదు...విలువలకు రూపంగా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దామోదరం సంజీవయ్య. నేడు (శుక్రవారం) ఆయన 104వ జయంతి. సంజీవయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సంజీవయ్యకు సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించనున్నారు.
కర్నూలు, ఆంధ్రజ్యోతి : కర్నూలు నగరంలో నేడు అంతర్భాగంగా ఉన్న కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో 1921 ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య జన్మించారు మునెయ్య, సుంకలమ్మ దంపతులకు ఆయన ఐదో సంతానం. కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. జీవనాధారం కోసం పశువులు కాయడం, కూలి పనులకు వెళ్లడం, పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేయడం, ఖాళీ సమయాల్లో చేనేత వస్త్రాలు విక్రయించేవారని అప్పటి పెద్దల ద్వారా తెలుసుకున్నామని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన జన్మించేనాటికి ఇంట్లో అందరూ నిరక్షరాస్యులే. అయితే, సంజీవయ్యకు చదువు పట్ల అమిత ఆసక్తి. అది గుర్తించిన అన్న చిన్నయ్య, మేనమామల ప్రోత్సాహాంతో సంజీవయ్య చదువులో ఒక్కో మెట్టు ఎక్కారు. బ్రిటిష్ పాలనలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. కేంద్ర ప్రజా పనుల తనిఖీ అధికారిగా పని చేస్తుండగా న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ కృష్ణయ్యతో పరిచయం అయింది ఆయన ప్రోత్సాహంతో మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. గణపతి శాస్త్రి, జాస్తి రామలక్ష్మమ్మ దగ్గర జూనియర్‌గా పనిచేశారు. 1950లో భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భావం తర్వాత ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన వచ్చింది. కర్నూలుకు చెందిన సర్దార్ నాగప్ప ఎమ్మెల్యే, ఎంపీ రెండు పదవుల్లో ఉండగా.. ఎమ్మెల్యే పదవి ఉంచుకుని ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ సీటు ఎస్సీ రిజర్వుడు కావడంతో, రామలక్ష్మమ్మ సిఫారసుతో ఆ పదవి సంజీవయ్యను వరించింది. 1952లో ఎమ్మెల్యేగా గెలిచి రాజాజీ కేబినెట్‌లో చేరారు. అప్పటికి ఆయన వయసు 31ఏళ్లే. ఆంధ్ర రాష్ట్రం తొలి సీఎం ప్రకాశం పంతులు కేబినెట్‌లోను, బెజవాడ గోపాలరెడ్డి కేబినెట్‌లోను, ఉమ్మడి ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోను బాధ్యతలు చేపట్టారు. ప్రధానులు నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పనిచేశారు. నెహ్రూ, ఇందిర హయాంలో రెండు పర్యాయాలు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. నీలం సంజీవరెడ్డి కొన్ని కారణాలతో 1960లో పదవి కోల్పోయారు. నీలం స్థానంలో అప్పటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. ఓ దళిత నాయకుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం దేశంలోనే అది ప్రథమం. 1960-1962 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఉపాధ్యాయురాలు కృష్ణవేణితో 1954 మే7న సంజీవయ్య వివాహం జరిగింది. ఆయన 1967 ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై.. దీర్ఘకాలంగా కోలుకోలేకపోయారు. 1972 మే7న ఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందారు.
పాలనలో మేటి!
ఏసీబీ ఏర్పాటు : దామోదరం సంజీవయ్య తాను ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ) ఏర్పాటుచేశారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, రవీంద్రభారతి, లలితకళల అకాడమీ కూడా అప్పుడే నెలకొన్నాయి. టీచర్లకూ పింఛన్: అప్పట్లో ఉపాధ్యాయులకు పింఛను సౌకర్యం లేదు. బతకలేక బడి పంతులు అని.. బాధపడే రోజులవి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. సంజీవయ్య తన హయాంలో పెన్షన్ విధానాన్ని టీచర్లకు కూడా వర్తింపజేశారు.
ఆరు లక్షల బంజరు పంపిణీ : తన హయా ంలో సంజీవయ్య ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం రెండు వేల ఎకరాలు భూ సమీకరణ ఆయన హయాంలో జరిగింది. రిజర్వేషన్ కోటా పెంపు: రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 17 శాతానికి, బీసీలకు 24 నుంచి 33 శాతానికి పెంచారు. తెలుగుకు పట్టం : ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు ఇచ్చారు. అంతర్జాతీయ తెలుగు రచయితల సమ్మేళనం నిర్వహించారు.
సాగు.. దారిలో : హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టుకు(సంజీవయ్య సాగర్), నల్లమల అటవీ ప్రాంతంలో వరదరాజస్వామి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పులచింతల, వంశధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘బోనస్ సంజీవయ్య’: కేంద్ర పరిశ్రమలు, కార్మిక శాఖల మంత్రిగా, బోనస్ కమిషన్ సిఫారసులను అమలుచేసి కార్మికుల మదిలో ‘బోనస్ సంజీవయ్య’గా ఖ్యాతి పొందారు. తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఒప్పంద కార్మికుల చట్టం, బాల కార్మిక చట్టం, రవాణా వాహన కార్మికులు చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక సంస్థల చట్టం, కనీస వేతనాలు చట్టం అమలులోకి తెచ్చారు.
‘కట్టెల పొయ్యి తీసేసి కిరోసిన్ పొయ్యి ఇస్తారా?’
సంజీవయ్య అంటే గిట్టని నాయకులు కొందరు, ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రధాని నెహ్రుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఓ వ్యక్తిని సంజీవయ్య సొంతూరు పెద్దపాడుకు నెహ్రూ పంపారు. అక్కడ ఓ చిన్న ఇంటి ముందు కారు ఆపి.. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ఓ వృద్దురాలిని ఆ వ్యక్తి పలకరించారు. ఇంటి ముందు కారు ఆగడం. ... పెద్దమనిషి తనను కలవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘నా కుమారుడికి ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తున్నారా? మా అబ్బాయి జీతం పెరుగుతుందా? ఈ కట్టెల పొయ్యి తీసేసి కిరోసిన్ పొయ్యి కొనుక్కోవచ్చా..?’ అంటూ ఆశగా అడిగారు. ఆమె ఎవరో కాదు.. అప్పటి రాష్ట్ర మంత్రి సంజీవయ్య తల్లి సుంకులమ్మ.