ఇసుక దుమారం
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:25 AM
కృష్ణానదీ తీరంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళ శ్రీకాకుళం ఇసుకరేవు నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. రసీదులు ఇవ్వకుండా లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తిచూడటంలేదు. దీంతో అక్రమార్కుల ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.

- శ్రీకాకుళం రేవు నుంచి అనధికారికంగా ఇసుక అక్రమ రవాణా
- రాత్రి సమయంలో వందలాది లారీల్లో ఇసుక తరలింపు
- లారీకి రూ.10 వేలు కట్టించుకుని రసీదు ఇవ్వని నిర్వాహకులు
- అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు
- మచిలీపట్నంలో భారీగా ఇసుక నిల్వల గుర్తింపు
కృష్ణానదీ తీరంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళ శ్రీకాకుళం ఇసుకరేవు నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. రసీదులు ఇవ్వకుండా లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తిచూడటంలేదు. దీంతో అక్రమార్కుల ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుకరేవులో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసినవ్యక్తుల కనుసన్నల్లోనే మళ్లీ ఈ దందా నడుస్తోంది. స్థానిక టిప్పర్ యజమానులు, ఇసుక రేవులో ఆదిపత్యం చలాయిస్తున్న కొందరు వ్యక్తులు కూడబలుక్కుని ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. స్థానికుల టిప్పర్లలో ముందుగా ఇసుకను లోడ్ చేయాలనే షరతులు పెట్టి సాధ్యమైనంత వరకు ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టిప్పర్లు, లారీల్లో ఇసుకను లోడ్ చేసేందుకు అనుమతి ఇవ్వకుండా పెత్తనం చలాయిస్తుండటంతో ఈ ఇసుక అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం ఇసుకరేవులో నూతన పద్ధతిని పాటిస్తున్నారు. ఇసుక లోడ్ చేసిన తర్వాత అనధికారికంగా అక్కడున్న వ్యక్తులు ఒక్కో టిప్పర్‌కు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. నగదు కట్టించుకున్నట్లు రసీదులు ఇవ్వమని టిప్పర్ డ్రైవర్లు కోరితే రసీదులు లేవని, తెల్లారేసరికి ఇసుకను గమ్యస్థానాలకు చేర్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దారిలో అధికారులు తనిఖీ చేస్తే రసీదులు చూపించాల్సి వస్తోందని డ్రైవర్లు చెబితే, శ్రీకాకుళం ఇసుకరేవు నుంచి ఇసుకను తీసుకువెళుతున్నామని చెప్పాలని, మిమ్మల్ని ఎవరూ ఆపరని చెప్పడం గమనార్హం. ఇసుక రవాణాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న కొందరు వ్యక్తులు ఈ దందాను కొనసాగిస్తున్నా అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడకపోవడానికి తెరవెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతోంది.
స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లకుండానే..
జిల్లాలోని తోట్లవల్లూరు, ఘంటసాల మండలాల నుంచి రాత్రి సమయంలో ఇసుకను వాహనాల్లో లోడ్ చేయడానికి అవకాశం లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. పగలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రేవుల్లో వాహనాల్లోకి ఇసుకను లోడ్ చేయాల్సి ఉంది. పగలు సమయంలో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఉంచిన ఇసుకను రాత్రి సమయంలో కూడా వాహనాల్లో లోడ్ చేసేందుకు అవకాశం ఉంది. ఎన్ని టన్నులు ఇసుక వాహనాల్లో లోడ్ చేశారో కాటావేసి, ప్రభుత్వ నిబంధనల మేరకు నగదును కట్టించుకుని, వాహనం నంబరు, ఏ ప్రాంతానికి ఇసుకను రవాణా చేస్తున్నారో కంప్యూటర్‌లో నమోదు చేసిన తర్వాత రసీదులను ఇవ్వాలి. కానీ కొంతకాలంగా ఈ ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చారు. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వాహనాలను రేవులోకి తీసుకుపోయి వాటిలో ఇసుకను లోడ్ చేయించి ఒక్కో టిప్పర్‌కు కనీసంగా రూ.పదివేల నగదును అక్కడ నిర్వాహకులు తీసుకుని బయటికి పంపేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. ఈనెల 6వ తేదీన గుడివాడ డీఎస్పీ రాత్రిపూట గస్తీ తిరుగుతున్న సమయంలో ఇసుకను తరలిస్తున్న ఏడు టిప్పర్‌లను నిలిపి తనిఖీ చేశారు. ఈ టిప్పర్‌ల వద్ద ఇసుకను కొనుగోలు చేసినట్లు ఎలాంటి రసీదులు లేవు. దీంతో ఎలాంటి రసీదులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఇసుకను ఏం చేస్తారో..
ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక రేవు నుంచి వందలాది లారీల ఇసుకను మచిలీపట్నం తరలించి గుట్టలుగా పోశారు. ఇసుక కొనుగోలు సమయంలో ధర నిర్ణయంలో తేడా వచ్చి ఇరువురు వ్యక్తులు వాదనకు దిగడంతో అక్రమ ఇసుక నిల్వలపై అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇసుక అక్రమ నిల్వల వ్యవహారం వెలుగుచూసింది. మచిలీపట్నం మండలం రుద్రవరంలో ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచారనే విషయంపై ఓ వ్యక్తి రెవెన్యూ, మైనింగ్ అఽధికారులకు 11 రోజుల రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి ఎలాంటి అనుమతులు లేకుండా మచిలీపట్నంలోని కాలేఖాన్ పేట మునిసిపల్ హైస్కూల్ సమీపంలో, మచిలీపట్నం-అవనిగడ్డ రహదారి పక్కనే శివగంగ డ్రెయిన్ వంతెన సమీపంలో పెద్దఎత్తున ఇసుక నిల్వలను అధికారులు గుర్తించారు. ఇసుక నిల్వలకు సంబంధించిన వివరాలు కోరితే సంబంధిత వ్యక్తులు సరైన ఆధారాలు చూపలేకపోయారు. దీంతో ఇక్కడి నుంచి ఇసుకను తరలించవద్దని రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇసుకను తరలించుకుపోకుండా ఇద్దరు పోలీసులను కాపలా పెట్టారు. 11 రోజులుగా రెవెన్యూ, పోలీస్ విభాగం అధికారులు ఈ ఇసుక నిల్వలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండటం గమనార్హం.