సమస్యల ‘సఖీ’
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:06 AM
ఆపదలో ఉన్న బాధిత మహిళలకు అండగా ఉండాల్సిన సఖీ కేంద్రం(వన్‌స్టాప్ సెంటర్) దిశానిర్దేశం లేకుండా నడుస్తోంది. ఆస్పత్రికి దూరంగా.. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఉన్న ఉద్యోగులకు ఆర్నేల్లుగా జీతాలు లేవు. బాధిత మహిళలకు సకాలంలో వైద్యసేవలు, న్యాయపరమైన, మానసిక ధైర్యం కోసం ఇచ్చే కౌన్సెలింగ్ ఇవ్వడంలేదు. సమస్యలతో సఖీ కేంద్రం కొట్టుమిట్టాడుతోంది.

-ప్రభుత్వాస్పత్రిలో ఉండాల్సిన కార్యాలయం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు
-ఆరు నెలలుగా సిబ్బందికి అందని జీతాలు
- అరకొర సిబ్బందితోనే కేంద్రం నిర్వహణ
- బాధిత మహిళలకు అందని భరోసా
- దీర్ఘకాలంగా పట్టించుకోని అధికారులు
ఆపదలో ఉన్న బాధిత మహిళలకు అండగా ఉండాల్సిన సఖీ కేంద్రం(వన్‌స్టాప్ సెంటర్) దిశానిర్దేశం లేకుండా నడుస్తోంది. ఆస్పత్రికి దూరంగా.. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఉన్న ఉద్యోగులకు ఆర్నేల్లుగా జీతాలు లేవు. బాధిత మహిళలకు సకాలంలో వైద్యసేవలు, న్యాయపరమైన, మానసిక ధైర్యం కోసం ఇచ్చే కౌన్సెలింగ్ ఇవ్వడంలేదు. సమస్యలతో సఖీ కేంద్రం కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వివిధ కారణాలతో గృహహింసకు గురైన మహిళలు, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న బాలికలు, మహిళలు, వృద్ధులు, కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని తల్లులు, ఇంటి నుంచి వెలివేయబడిన వృద్ధ మహిళలు, పనిచేసే ప్రాంతాల్లో వేధింపులకు గురైన శ్రామిక మహిళలు, బాల్య వివాహాలు చేసుకున్న బాలికలు, ఇలా అనేక రూపాల్లో మానసికంగా కుంగిపోయిన మహిళలను అక్కున చేర్చుకుంటుంది ‘సఖీ’. వారు విపత్కర పరిస్థితుల నుంచి బయట పడేందుకు మార్గాలు అన్వేషించడం, బాధితుల బంధువులను సఖీ కేంద్రాలకు పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం చేస్తుంది. బాదిత మహిళలు, బాలికలు తమంతట తాముగా ఇంటికి వెళతామని చెప్పేవరకు వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తుంది. కానీ ఇవేమీ ఇక్కడ జరగడంలేదు.
నర్సులు లేకుండానే..
మచిలీపట్నం సఖీ కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండాలి. వీరిలో నర్సులు ముగ్గురు, ఆయాలు ముగ్గురు, న్యాయవాది, కంప్యూటర్ ఆపరేట్, మహిళా సంరక్షకురాలు. అయితే ముగ్గురు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు ఉన్నప్పటికీ వారిని ఐసీడీఎస్ నడిపే శిశుగృహాల్లో ఉపయోగించుకుంటున్నారు.
వైద్య సేవలకు దూరంగా ఏర్పాటు
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో సఖీ కేంద్రం ఉండాలి. వివిధ రకాల దాడుల్లో, లైంగిక వేధింపుల్లో గాయపడిన వారిని ఆస్పత్రిలో ప్రత్యేకంగా కేటాయిచిన గదుల్లో ఉంచి, వారికి రక్షణ కల్పించడంతోపాటు వైద్యసేవలను నిత్యం అందుబాటులో ఉంచాలి. అలా కాకుండా ఆస్పత్రికి దూరంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయంలోని పైఅంతస్తులో ఈ గదులను ఏర్పాటు చేశారు. నర్సులు కూడా లేకుండా ఇక్కడ బాధిత మహిళలకు ఎంతమేర వైద్యసేవలు అందుతాయో తెలియని పరిస్థితి. జిల్లాల విభజన జరిగిన నాటి నుంచి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో సఖీ కేంద్రానికి కనీసంగా రెండు గదులైనా కేటాయించాలని కోరుతూ వస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
నిధులు లేక అప్పులపాలు
వివిధ కేసులకు సంబంధించి బాధిత మహిళలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కనీసంగా నెలకు ఐదారుగురు ఈ సఖీ కేంద్రానికి వస్తున్నారు. వీరిని ఇక్కడ ఉంచి వారికి కనీస సౌకర్యాల కల్పించాలి. ఈ అవకాశం లేకపోవడంతో త్వరితగతిన వీరిని బయటకు పంపేస్తున్నారు. నిమ్మకూరులోని సదర్ గృహానికి లేదా హనుమాన్ జంక్షన్‌లోని ప్రజ్వల కేంద్రానికి పంపుతున్నారు. బాధిత మహిళలు పూర్తిగా కోలుకోకుండానే బయటకు పంపేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేంద్రం ఇక్కడ నడవకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బందిని సంబంధిత కేంద్రాన్ని పర్యవేక్షించే అధికారి ఇంటి పనులకు ఉపయోగించు కుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిధులు ఏమవుతున్నాయో?
బాధిత మహిళలకు ఆసరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులు ఏమవుతున్నాయనే అంశంపై కనీస సమాచారం చెప్పేవారు ఈ కార్యాలయంలో లేరు. ఎవరికి వారు క్యాంప్‌లో ఉన్నారని చెప్పడం గమనార్హం. ఉన్న సిబ్బంది తమకేమీ తెలియదని, అంతా కంప్యూటర్ ఆపరేటర్, అధికారి చూసుకుంటారని చెబుతున్నారు. ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బదికి ఆరు నెలలుగా జీతాలు కూడా చెల్లించడంలేదు. టీఏ, డీఏలు కూడా ఇవ్వడం లేదు. బాధిత మహిళలు ఈ కేంద్రంలో ఉంటే వారికోసం చేసిన ఖర్చుల నిమిత్తం ఇక్కడి సిబ్బంది అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చేసిన ఖర్చులకు కనీసంగా బిల్లులు కూడా చేయడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
అంతా బాగానే ఉంది
మచిలీపట్నంలోని సఖీ కేంద్రంలో అంతా సక్రమంగానే ఉంది. సర్వజన ఆస్పత్రిలో సఖీ కేంద్రానికి రెండు గదులు కేటాయించాలని చాలా కాలంగా కోరుతున్నాం. కానీ గదులు కేటాయించడంలేదు. సిబ్బందిని ఇతరత్రా ఇంటి పనులకు వాడుకోవడం లేదు.
-విజయలక్ష్మి, సఖీ కేంద్రం విస్తరణాధికారి