RTC Employees Demand: ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:47 AM
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ..
లులుకు స్థలం కేటాయింపు జీవో రద్దు చేయాలి: ఎన్‌ఎంయూఏ
విజయవాడ (బస్‌స్టేషన్), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్‌ను ప్రకటించాలని బుధవారం వారు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల గవర్నర్‌పేట డిపో స్థలాన్ని లులు మాల్‌కు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో రద్దు చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలింపు ఆపాలని, రిటైర్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, టెర్మినల్ ఎన్‌క్యా్‌షమెంట్, ఇతర చెల్లింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఉన్న 8వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్‌లు వెంటనే ఇవ్వాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా వేతనం చెల్లించాలని, ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈవోఎల్ మంజూరు చేయాలని, పారదర్శకమైన బదిలీలను అమలు చేయాలని, ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.