Share News

Cybercrime Arrest: పెట్టుబడి పేరుతో రూ.49.72 లక్షల మోసం

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:35 AM

ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో విశాఖపట్నానికి చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ నుంచి..

Cybercrime Arrest: పెట్టుబడి పేరుతో రూ.49.72 లక్షల మోసం

  • విశ్రాంత ప్రొఫెసర్‌ నుంచి కొట్టేసిన సైబర్‌ నేరగాడు

  • నిందితుడ్ని ఢిల్లీలో అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

ఎండాడ (విశాఖపట్నం), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో విశాఖపట్నానికి చెందిన రిటైర్డు ప్రొఫెసర్‌ నుంచి రూ.49 లక్షలు దోచుకున్న కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీలో ఓ యువకుడిని అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డు ఫ్రొఫెసర్‌ (73)కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన నిందితుడు పెట్టుబడుల పేరుతో సుమారు రూ.49.72 లక్షలు కొట్టేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నొయిడా సెక్టార్‌-16కు చెందిన సతీష్‌ కుమార్‌ను నిందితుడిగా గుర్తించి ఢిల్లీలో అరెస్టు చేశారు. అతను 2020లో డిగ్రీ పూర్తిచేసి, పలు ఉద్యోగాలు చేశాడు. నోయిడాలోని వరల్డ్‌ ట్రేడ్‌ టవర్స్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత కశ్యప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించి, దివాలా తీశాడు. అయితే సంస్థ పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాలను యాక్టివ్‌గా ఉంచాడు. కొంతమందితో ఫేస్‌బుక్‌లో పరిచయాలు పెంచుకుని, వారి బ్యాంకు ఖాతాలను సైబర్‌ యాక్టివిటీ్‌సకి వాడుకుంటూ పది శాతం కమీషన్‌ ఇచ్చేవాడు. అతని బ్యాంకు ఖాతాలను కూడా సైబర్‌ నేరస్థులకు అందించి, మోసాలకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి ఖరీదైన మొబైల్‌, ల్యాప్‌టా్‌పను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 05:35 AM