Police Tracking System: సీసీటీఎన్‌ఎస్ నిర్వహణకు రూ.12 కోట్లు
ABN , Publish Date - May 16 , 2025 | 05:27 AM
కూటమి ప్రభుత్వం సీసీటీఎన్‌ఎస్ నిర్వహణకు రూ.12 కోట్లు విడుదల చేసింది. ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ సౌకర్యం పునరుద్ధరించి నేర నివారణ వ్యవస్థను మెరుగుపరిచింది.
గత ప్రభుత్వంలో ఆగిపోయిన విధానానికి ఊపిరి
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో తిరోగమనంలో పయనించిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎ్‌స)కు కూటమి ప్రభుత్వం ఊపిరిలూదింది. ఆన్‌లైన్ బిల్లులు చెల్లించలేక మాన్యువల్ ఎఫ్‌ఐఆర్ దిశగా వెళ్లిన సీసీటీఎన్‌ఎ్‌సకు రూ.12 కోట్లు విడుదల చేసి పూర్వ వైభవం తీసుకొచ్చింది. దేశంలో ఎక్కడైనా బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆన్‌లైన్‌లో పొందు పరిచే విధానం ఉమ్మడి రాష్ట్రంలోనే అమల్లోకి వచ్చింది. ఫలితంగా బాధితులు తమ కేసు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు నిందితుల వివరాలు ప్రతి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు తెలిసే విధంగా ఉండేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణ భారమంటూ బిల్లులు చెల్లించక పోవడంతో సీసీటీఎన్‌ఎస్ అటకెక్కింది. దీంతో చేతి రాతతో మాన్యువల్‌గా నమోదు చేసే ఎఫ్‌ఐఆర్ వల్ల పొరుగు జిల్లాలో నేరం చేసిన వ్యక్తి గురించి ఆ పక్క జిల్లా పోలీసులకు తెలిసేది కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీసీటీఎన్‌ఎస్ పునరుద్ధరించేందుకు నిధులు విడుదల చేస్తూ గురువారం జీవో జారీ చేసింది.