Raghurama Krishnaraju: తులసిబాబుకు 48 లక్షలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:46 AM
తులసిబాబు పాత్ర ఉందని అతని స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. తులసిబాబు బెయిల్ కేసు మంగళవారం విచారణకు వచ్చింది.

నాడు సీఐడీ లాయరుగా నియమించారు
బార్‌లో ఎన్‌రోల్ అయిన మూడు నెలల్లో 12 కేసుల్లో సహకారం
అందుకు 48 లక్షలు చెల్లించిన సీఐడీ
మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలి
ఆయన పాత్ర గురించి స్నేహితులే చెప్పారు
బెయిల్‌పై హైకోర్టుకు నివేదించిన పోలీసులు
ముగిసిన వాదనలు.. 14న నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో నిందితుడు తులసిబాబు పాత్ర ఉందని అతని స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. తులసిబాబు బెయిల్ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ... ‘నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి సీఐడీ కార్యాలయంలోకి వచ్చారని డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారు. నలుగురిలో ఒడ్డు, పొడుగు ఉన్న వ్యక్తి తన గుండెలపై కూర్చున్నారని ఫిర్యాదుదారుడు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి దర్యాప్తు అధికారి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్, తులసిబాబు... ఇద్దరినీ కలిపి పోలీసులు విచారించారు. చిత్రహింసలకు గురిచేసిన వారిలో తులసిబాబు లేరని విజయ్‌పాల్ చెప్పడం లేదు. నేర ఘటన నాలుగు గోడల మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంటుంది. విచారణ సందర్భంగా నోరు తెరవకుండా ఉంటామంటే కుదరదు. తులసిబాబు 2020 అక్టోబరు 6న సీఐడీ లీగల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. హైకోర్టులో సీఐడీ కేసులు ట్రయల్ కోసం తులసిబాబును నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటికి తులసిబాబు న్యాయవాది కూడా కాదు. తులసిబాబు 2021, నవంబరు 16న ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన మూడు నెలల్లోనే 12 కేసుల్లో సహకారం అందించినందుకుగాను ఆయనకు సీఐడీ రూ.48 లక్షలు చెల్లించింది. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. రఘురామపై పిటిషనర్‌తోపాటు మరో ముగ్గురు దాడి చేశారు.
వారిని గుర్తించాల్సి ఉంది. అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్ కూడా దర్యాప్తునకు సహకరించడం లేదు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇస్తే పోలీసు అధికారులను తులసిబాబు బెదిరించారు. కుట్ర కోణం వెలికితీయాలన్నా, ఘటనలో ఇతరుల పాత్ర తేల్చాలన్నా పిటిషనర్‌ను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలి. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని కోరారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి రిప్లై వాదనలు వినిపిస్తూ.... ‘కేసులో మొదటి, రెండో నిందితుడిగా ఉన్న పోలీస్ అధికారులకు ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. సాక్షులను ప్రభావితం చేసే సామర్థ్యం పిటిషనర్‌కు లేదు. పిటిషనర్‌కు బెయిల్ మంజూరు వల్ల దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలగదు. బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన విచారణలో బెయిల్ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు ముగియడంతో ఫిబ్రవరి 14న నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు.
Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..