Share News

పోలీస్‌ కస్టడీకి బియ్యం నిందితులు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:47 AM

మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను ఏడు గంటల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతినిస్తూ స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేర్ని గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగారావును పోలీసులు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు.

పోలీస్‌ కస్టడీకి బియ్యం నిందితులు

- నేడు ఏడు గంటల పాటు పోలీస్‌ విచారణ

- హాజరుకానున్న గోడౌన్‌ మేనేజర్‌, మిల్లు యజమాని, లారీడ్రైవర్‌

-పేర్ని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు

- పౌరసరఫరాలశాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డికి బెయిల్‌ మంజూరు

మచిలీపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను ఏడు గంటల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతినిస్తూ స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేర్ని గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగారావును పోలీసులు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు. అనంతరం వీరిని మళ్లీ రిమాండ్‌కు పంపుతారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్‌ను గతేడాది డిసెంబరు 30వ తేదీన మంజూరు చేసింది. ఆ తర్వాత ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీఎంఆర్‌ బియ్యం మాయం కేసులో ఏ-2గా ఉన్న గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ పోలీసుల విచారణలో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లుగానే తాను చేశానని చెప్పడంతో పోలీసులు ఈ కేసులో ఏ-6గా మాజీ మంత్రి పేర్ని నాని పేరును చేర్చారు. అయితే పేర్ని నాని తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైౖకోర్టును ఆశ్రయించారు. సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా, మంగళవారం నాటికి విచారణను వాయిదా వేశారు. దీర్ఘకాలం పాటు పేర్ని నాని గోడౌన్‌ నుంచి సీఎంఆర్‌ బియ్యం మాయం కావడం, ఈ వ్యవహారంలో గోడౌన్‌ మేనేజర్‌, మిల్లు యజమాని, లారీడ్రైవర్‌, పేర్ని నాని కుటుంబ సభ్యుల ఖాతాలకు నగదు మళ్లింపు తదితర అంశాలపై పోలీస్‌ కస్టడీకి వచ్చే నిందితులను పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. నిందితులను వారం రోజులపాటు పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా, ఏడు గంటలపాటు మాత్రమే కస్టడీకి అనుమతులు ఇచ్చారు. కాగా, జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కోటిరెడ్డిని ఇదే కేసులో గతేడాది డిసెంబరు 30వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనకు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి సోమ వారం బెయిల్‌ను మంజూరు చేశారు.

Updated Date - Jan 07 , 2025 | 12:47 AM