గిడ్డంగుల సంస్థకు జవసత్వాలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:26 PM
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నగరంలోని కోడుమూరు రోడ్డు రేడియో స్టేషన వద్ద ఉన్న గోడౌన.

జీవో. 565ను నీరుగార్చిన గత వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మీద ఎస్‌డబ్ల్యూసీ వర్గాల ఆశ
లక్ష మెట్రిక్ టన్నుల నిత్యావసరాల నిల్వకు కార్యాచరణ
జీవో 565 పకడ్బందీగా అమలుకు ఎస్‌డబ్ల్యూసీ ఎండీ చర్యలు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నగరంలోని కోడుమూరు రోడ్డు రేడియో స్టేషన వద్ద ఉన్న గోడౌన. దీని సామర్థ్యం 6వేల మెట్రిక్ టన్నులు. గత ఐదేళ్లుగా ఇందులో ఒక్క బియ్యం గింజ కూడా నిల్వ చేయలేదు. సివిల్ కార్పొరేషన అధికారులు ఏవేవో కుంటి సాకులు చెప్పడం వల్ల ఈ గోదాములో నిల్వ చేయాల్సిన బియ్యం, ఇతర ఆహారోత్పత్తులు ప్రైవేటు గోదాములకు తరలిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మళ్లీ జవసత్వాలు కల్పిస్తుండటంతో ఇలాంటి గిడ్డంగులకు పూర్వ వైభవం రానుంది.
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంట ఉత్పత్తులను భద్రంగా నిల్వ చేసేందుకు, బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు తాత్కాలికంగా దాచుకొని బ్యాంకుల్లో రుణం తీసుకొనేందుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాములు ఉపయోగకరంగా ఉండేవి. 1956లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్లూసీ)ను ఏర్పాటు చేసింది. రైతుల పంట ఉత్పత్తులను భద్రపరచడమే కాకుండా సివిల్ సప్లయ్, నాఫెడ్, మార్క్‌ఫెడ్ తదితర సంస్థలకు గోదాములను సమకూర్చే బాధ్యతను కూడా ఈ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకే ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ రాష్ట్ర గిడ్డంగుల సంస్థను నిర్వీర్యం చేసే మహాకుట్రకు గత సీఎం జగన రెడ్డి పాల్పడ్డారు. ఈ సంస్థకు జవసత్వాలు కల్పించడం కోసమని 2022 సెప్టెంబరు 1న జీవోఆర్‌టి. నెం. 565ను తీసుకొచ్చారు. ఈ జీవో ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాల కోసం మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్, నాఫెడ్ తదితర సంస్థలకు అవసరమైన బియ్యం, కందులు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను సేకరించి గోదాముల్లో నిల్వ చేసే బాధ్యతను రాష్ట్ర గిడ్డంగుల సంస్థనే చేపట్టాలని, నోడల్ ఏజెన్సీగా ఈ సంస్థనే బాధ్యత తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం వరకు ఈ సంస్థ కార్యకలాపాలు విస్తృతంగా జరిగాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవోను సృష్టించి, క్రమంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను కూడా శిథిలావస్థకు చేర్చారు. గోదాముల మరమ్మతులకు ఒక్క రూపాయి నిధులను కూడా మంజూరు చేయలేదు. దీంతో ఆ గోదాములన్నీ పంట ఉత్పత్తుల నిల్వకు ఏ మాత్రం పనికి రాకుండా పోయే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇదే అదునుగా వైసీపీ నేతలు ఎస్‌డబ్య్లూసీ గోదాముల్లో పంట ఉత్పత్తలను నిల్వ చేసే అవకాశం లేదని ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న గోదాములను అద్దె ప్రాతిపదికన తీసుకుని నిత్యావసరాల వస్తువుల నిల్వకు ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వారి కుట్ర ఫలించడంతో సివిల్ సప్లయ్ సంస్థతో పాటు మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర సంస్థలన్నీ నాయకులు, వ్యాపారుల ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లోనే బియ్యం, కందులు, మొక్కజొన్నలు తదితర వాటిని నిల్వ చేయించారు. మరో వైపు సివిల్ సప్లయ్ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని పక్కదారి పట్టించేసి కోట్లు దండుకునే దుర్మార్గానికి తెర లేపారు.
ఫ కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరిగేనా..? ఎస్‌డబ్ల్యూసీ అధికారుల ఆందోళన:
గత వైసీపీ పాలనలో సివిల్ సప్లయ్‌తో పాటు మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, నాఫెడ్ సంస్థలు బియ్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధీనంలోని గోదాములకు ప్రాధాన్యత ఇవ్వకుండా వైసీపీ నేతల కనుసన్నల్లో ఉన్న గోదాములకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారణంగానే రైతుల పంట ఉత్పత్తులు, అదేవిధంగా బియ్యం పక్కదారి పట్టాయి. భారీ ఎత్తున ప్రభుత్వానికి నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతోనే ఈ అక్రమాలన్నీ వెలుగు చూశాయి. ఇకపై సివిల్ సప్లయ్‌కు చెందిన బియ్యం ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లోనే నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్ సంస్థ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌డబ్ల్యూసీ సంస్థ అధికారులు తెలిపారు. అయితే.. సివిల్ సప్లయ్ సంస్థ ఉన్నతాధికారులు కొందరు వైసీపీ నేతల ఆదేశాలనే ఇంకా పాటిస్తూ వస్తుండటంతో ఎస్‌డబ్య్లూసీ అధికారుల్లో ఆందోళన మొదలైంది. కర్నూలు నగరంలోని రేడియో స్టేషన వద్ద 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తామని చెప్పిన సివిల్ సంస్థ అధికారులు ఇప్పుడు మళ్లీ కుంటి సాకులతో ఎస్‌డబ్య్లూసీ గోదాముల్లో బియ్యం నిల్వ చేయకుండా ప్రభుత్వానికి వివిధ కారణాలు చెప్పినట్లు విశ్వసనీయం సమాచారం అందింది.
కాగితాలకే నోడల్ ఏజెన్సీగా ఎస్‌డబ్ల్యూసీ సంస్థ:
జగన తెచ్చిన జీవో 565 ప్రకారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నోడల్ ఏజెన్సీగా పని చేయాలి. సివిల్ సప్లయ్, మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, నాఫెడ్ తదితర సంస్థలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను సమకూర్చి గోదాముల్లో నిల్వ చేయాలి. అయితే గత ఐదేళ్లుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నోడల్ ఏజెన్సీగా పని చేసిన దాఖలా లేదు. వైసీపీ ప్రభుత్వం తమ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆ సంస్థ అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయ్ తదితర సంస్థలు బియ్యం, కందులు, మొక్కజొన్న మొదలైన వాటిని కొనుగోలు చేసి అవసరమైన గోదాములను ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటైన అధికారుల కమిటీకి ఏ మాత్రం అఽధికారాలు లేకుండా చేశారనే ఆరోపణ ఉంది. దీంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కాగితాల్లోనే నోడల్ ఏజెన్సీగా మిగిలిపోయిందని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు.
ఫ కూటమి ప్రభుత్వంతో ఎస్‌డబ్ల్యూసీకి జవసత్వాలు:
గత వైసీపీ ప్రభుత్వంలో అలంకార ప్రాయంగా ఉండిపోయిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కూటమి పాలనలో మళ్లీ బలోపేతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా సివిల్ సప్లయ్ అధికారులు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాములు బియ్యం నిల్వ చేసేందుకు ఏ మాత్రం పనికిరావని ప్రభుత్వానికి నివేదిక పంపడమే కాకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో బియ్యాన్ని నిల్వ చేసేందుకు అనుకూలమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆనాటి అధికార పార్టీలోని పెద్దల వత్తాసుతో బియ్యం నిల్వలు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలోని గోదాముల్లోకి చేర్చారు. ఈ కొత్త నిర్ణయంతో ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు రూ.కోట్లు దండుకోవడంపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ దురాగతాలకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఎస్‌డబ్ల్యూసీ సంస్థకు జవసత్వాలు కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆ సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 40 వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేసేందుకు ఎస్‌డబ్ల్యూసీ సంస్థకు గోదాములు ఉన్నాయి. సివిల్ సప్లయ్ అధికారులు ఈ గోదాములు పనికి రావని, కుంటి సాకులు చెప్పడంతో ఆ గోదాముల్లో బియ్యం నిల్వ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఈ గోదాములకు మళ్లీ మహర్దశ పట్టనుంది. ఎస్‌డబ్ల్యూసీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మెట్రిక్ టన్నుల నిత్యావసరాల వస్తువులను నిల్వ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆ సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌డబ్ల్యూసీ గోదాములు ఎంత మేర శిథిలావస్థకు చేరాయో గుర్తించి వాటి మరమ్మతులకు అవసరమైన నిధులను మంజూరు చేయించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం.
ఫ ఎస్‌డబ్ల్యూసీ గోదాములకు మహర్దశ కల్పిస్తాం : షాకీర్ హుశేన, రీజనల్ మేనేజర్:
ఎస్‌డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంస్థ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతాం. గోదాముల మరమ్మతులకు నిధులు ఎంత అవసరయో గుర్తించి ప్రభుత్వానికి నివేదికను పంపుతున్నాం. మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మెట్రిక్ టన్నుల నిత్యావసర వస్తువులు మా గోదాముల్లో నిల్వ చేసేలా కార్యాచరణ ప్రణాళిక తయారవుతుంది.