Rajamahendravaram Court: శవం డోర్ డెలివరీ కేసును మళ్లీ విచారించండి
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:45 AM
దళిత యువకుడైన తన కారు డ్రైవర్‌ను హత్యచేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మరోసారి, మరింత లోతుగా విచారించాలని రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది.
రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం తీర్పు
90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌కు ఆదేశం
సొంత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఝలక్
రాజమహేంద్రవరం, జూలై 22(ఆంధ్రజ్యోతి): దళిత యువకుడైన తన కారు డ్రైవర్‌ను హత్యచేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును మరోసారి, మరింత లోతుగా విచారించాలని రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు న్యాయాధికారి సింగవరపు ఉమా సునంద మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కోర్టు మరింత లోతైన విచారణ జరపాలని తీర్పు ఇవ్వడంతో సిట్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. 2022, మే 5న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. దళిత యువకుడు, తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి, శవాన్ని డోర్ డెలివరీ చేశారు.
అయితే, అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు కేవలం అనంతబాబు మీదే చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, సుబ్రహ్మణ్యం తల్లి.. నాటి టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అప్పటి డీజీపీకి, కాకినాడ ఎస్పీకి విన్నవించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న కేసు విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్‌పై బయటఉండడంతో తదుపరి విచారణకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రాసిక్యూషన్(సిట్) కోర్టును కోరింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి మంగళవారం తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన న్యాయ సలహాదారు ముప్పాళ్ల సుబ్బారావు న్యాయసలహా ఇవ్వగా, పీపీలు కె. రాధాకృష్ణ. డి. శ్రీవాణి వాదనలు వినిపించారు.
ఎవరూ తప్పించుకోలేరు: ముప్పాళ్ల సుబ్బారావు
దళిత డ్రైవర్‌ను హత్యచేసి, శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఎవరూ తప్పించుకోలేరని న్యాయ సలహాదారు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయనకు సహకరించిన వారికి శిక్ష పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అనంతబాబును కాపాడడానికి శక్తివంచన లేకుండా పనిచేసిందని.. కానీ ప్రజా న్యాయపోరాటాల వల్ల కేసు మళ్లీ విచారణకు వచ్చిందన్నారు. ఆనాటి కాకినాడ ఎస్పీ, ఇతర అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా అనేక తప్పిదాలు చేశారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News