ZPTC Bye Election: పులివెందులలో 2చోట్ల రీపోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:45 AM
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారంనాటి..
కడప స్ట్రాంగ్‌రూంకు బ్యాలెట్ బాక్సుల తరలింపు
నేడు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
పులివెందుల, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారంనాటి పోలింగ్‌లో అచ్చవెల్లిలో మూడో పోలింగ్ బూత్ వద్ద ఓట్లు వేసేందుకు వస్తున్న వారిపై దాడి జరగడం, అలాగే ఇ.కొత్తపల్లెలో ఏజెంట్ల విషయమై జరిగిన గొడవల కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రెండు చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించింది. బుధవారం రీపోలింగ్ నిర్వహించారు. దీనిగురించి ఓటర్లకు చాలాసేపటి వరకు తెలియలేదు. దీనికితోడు ఉదయం నుంచీ వర్షం కురుస్తుండడంతో ఓటింగ్ శాతంపై దాని ప్రభావం పడింది. 3వ పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు 492 . ఇక్కడ మంగళవారం 398 ఓట్లు పోల్ కాగా బుధవారం 337 ఓట్లు పడ్డాయి. 14వ పోలింగ్ కేంద్రంలోని 1,273 ఓట్లకు గాను మంగళవారం 919 ఓట్లు పడ్డాయి. బుధవారం 691 ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్‌ను ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పరిశీలించారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రీపోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అధికారులు ప్రత్యేక వాహనంలో కడప స్ర్టాంగ్ రూంకు తరలించారు.
రీపోలింగ్‌కు ఆదేశించాలంటూ వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థుల పిటిషన్లు
హైకోర్టులో నేడు విచారణ
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికలో అధికారపార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, అక్రమాలు చోటు చేసుకున్న పలు పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర సాయిధ పోలీసు బలగాల భద్రతతో రీపోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ)ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్లుగా విచారణ జరిపేందుకు న్యాయస్ధానం అంగీకరించింది. అయితే వ్యాజ్యాలు సరైన సమయానికి బెంచ్ ముందుకు రాకపోవడంతో పిటిషన్లపై బుధవారం విచారణ సాధ్యపడదని న్యాయస్థానం ప్రకటించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపకుంటే నిరర్థకం అవుతాయన్నారు. ఈ నెల 12న నిర్వహించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్‌ఈసీ బుధవారం వేకువజామున 3 గంటలకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నేపఽథ్యంలో అత్యవసరంగా పిటిషన్లు వేశామన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. వ్యాజ్యాల్లో తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కనీసం గురువారం ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే పిటిషన్లపై విచారణ జరపాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ విచారణను గురువారానికి వాయిదా వేశారు.