Rayachoti Area Hospital : అత్యవసరమా.. అవతలికెళ్లు..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:06 PM
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 100 పడకల ఏరియా అసుపత్రి ఉన్నప్పటికీ.. ఇక్కడ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందడం లేదు. అత్యవసరం అంటూ ఎవరు వెళ్లినా సరే వేరే ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు.
రాయచోటి టౌన్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 100 పడకల ఏరియా అసుపత్రి ఉన్నప్పటికీ.. ఇక్కడ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందడం లేదు. అత్యవసరం అంటూ ఎవరు వెళ్లినాసరే వేరే ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం జనాన్ని వేధిస్తున్న సీజనల్ వ్యాధులకూ సరిగా అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో పాటు ఎక్కువ సమయం ప్రైవేటు ప్రాక్టీస్లో గడుపుతుండటమే.
రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ప్రతి రోజు 800 నుంచి 900 వరకు ఓపీ ఉంటోంది. పట్టణానికి చెందిన వందలాది మంది పేదలు ప్రతిరోజు ఏరియా ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఆసుపత్రిలో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు ఎక్కువ సమయం ప్రైవేటు ప్రాక్టీస్లో గడుపుతుండడంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆసుపత్రికి వచ్చే జనరల్ వైద్యుల్లో కొంత మంది ఓపీ చూడకుండా కేవలం ఆపరేషన్లకే పరిమితం అవుతున్నారు. అలాగే స్త్రీల శస్త్ర చికిత్స విభాగం, పురుషుల శస్త్ర చికిత్స విభాగాల్లో వైద్యులు అంతంత మాత్రమే విధులకు హాజరవుతుండడంతో చాలా మంది రోగులు సరైన వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
పని ఇక్కడ.. నివాసం వేరేచోట
రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట, పీలేరు. పులివెందుల నియోజకవర్గాల్లోని వీరబల్లి, సుండుపల్లి, కేవీపల్లి, కలకడ కలికిరి, గుర్రంకొండ, చక్రాయపేట, సత్యసాయి జిల్లాలోని కదిరి, ఎన్సీ కుంట తదితర మండలాల నుంచి కూడా ఎంతో మంది పేద రోగులు రాయచోటి ఏరియా ఆసుపత్రికి వైద్యంకోసం వస్తుంటారు. వైద్యులు పనిచేసేచోటే నివాసం ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు కొంతమంది కడప, పీలేరు నుంచి విధులకు హాజరవుతుండటంతో వీరు సమయానికి రావడం లేదని అంటున్నారు. రాయచోటి ఏరియా ఆసుపత్రిలో 23 మంది వైద్యులకు గానూ ప్రస్తుతం 21 మంది ఉండగా ఒక జనరల్ మెడిసిన్, ఒక ఆర్థోపెడిక్ వైద్యుల కొరత ఉంది.
ఆర్థోపెడిక్ డాక్టర్ లేక..
రోడ్డు ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు చికిత్స అందించాల్సిన ఆర్థోపెడిక్ డాక్టర్ లేకపోవడంతో ఎమర్జెన్సీ వైద్యం అందక సామాన్య రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరుపతి, వేలూరు, బెంగళూరు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాల ఏర్పాటు పరిశీలనకు వెళ్లిన ప్రసాద్ అనే కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై రాయచోటి ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో డ్యూట్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. దీనికి తోడు సీజనల్ వైద్య సేవలు దీనికి కారణం వ్యాధులతో అల్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కొంతమంది సీనియర్ వైద్యులు కేవలం ఆపరేషన్లకు పరిమితం అవుతుండడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూస్తున్నారు.
ప్రహరీ గోడ కూలిపోయి..
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన 100 పడకల ఆసుపత్రికి పడమర భాగంలో ఉన్న పాత ప్రహరీగోడ వర్గాలకు కూలిపోయింది. దీంతో ఆసుపత్రి ఆవరణం పశువులు, కుక్కలకు ఆవాసంగా మారింది. మందుబాటులు, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు పడమర వైపు నుంచి ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశిస్తుండడంతో రాత్రి సమయాల్లో ఇక్కడ ఉండే రోగులకు రక్షణ లేకుండా పోయింది. దీనికి తోడు ఆసుపత్రి రోగులకు, సిబ్బందికి నీటి కొరత కూడా వెంటాడుతోంది. కూలిపోయిన ప్రహరీగోడను త్వరగా పూర్తి చేసి పశువులు, కుక్కలు, మందుబాబులు ఆసుపత్రిలోకి ప్రవేశించకుండా చూడాలని పట్టణ ప్రజలు, రోగులు, ఆసుపత్రి సిబ్బంది కోరుతున్నారు.
రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ వైసీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మించినప్పటికీ ఎమర్జెన్సీ కేసులకు అవసరమైన క్రిటికల్కేర్ యూనిట్ను ఏర్పాటు చేయలేదు. దీంతో సకాలంలో సరైన ఎమర్జెన్సీ వైద్యం అందక కొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకొని వికలాంగులైన దాఖరాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాయచోటి ఏరియా ఆసుపత్రికి రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ను మంజూరు చేయించడమే కాకుండా ఇటీవలనే దీని నిర్మాణానికి భూమిపూజ కూడా చేపట్టారు. 50 పడకలతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు ఇక్కడే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆవకాశం ఉంటుంది.