Ratan Tata Innovation Hub: రాష్ట్రానికి రతన్ హారం
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:58 AM
తెలివి తేటలు ఏ ఒక్కరి సోత్తూ కాదు. విభిన్నంగా ఆలోచించే లక్షణం, ఆవిష్కరణలకు ఊపిరిపోసే చాకచక్యం ఉంటే ప్రతి ఒక్కరూ ఆవిష్కర్తలే...
ఐదు నగరాల్లో రతన్‌టాటా ఇన్నోవేషన్ కేంద్రాలకు శ్రీకారం
మంగళగిరిలో ఆవిష్కరణల ‘హబ్’
విజయవాడ, రాజమండ్రి, తిరుపతి,అనంతపురం, విశాఖల్లో సెంటర్లు
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా స్థానిక యువత సృజనకు పదును
ఆవిష్కరణల ద్వారా ఆర్థికానికి దన్ను
వచ్చే ఐదేళ్లలో లక్ష మందికి ఉపాధి
నేడు మంగళగిరిలో హబ్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు
ఆవిష్కరణ అనేది మెట్రో నగరాలు, కొన్ని సంస్థలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి హక్కు! మట్టి నుంచి మాణిక్యాలు లభించినట్టు సరైన వేదికలు కల్పిస్తే.. ఒకింత ఊతమిస్తే.. వెనుక బడిన సమాజం నుంచి వేలాది మంది ఆవిష్కర్తలు పుట్టుకొస్తారు.
- రతన్ టాటా
రతన్‌టాటా ఆవిష్కరణల ‘హబ్’ కేవలం ఓ భవనం కాదు. ‘ప్రజలే ప్రధానం’ నినాదంతో.. వారి భవిష్యత్తును భవ్యంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే సాధనం. ఆవిష్కరణలకు చేయూతనిచ్చి... పారిశ్రామికవేత్తలను తయారు చేసే వేదిక!
- రతన్ టాటా ఇన్నోవేషన్ సంస్థ
అమరావతి/మంగళగిరి/అనంతపురం రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘‘తెలివి తేటలు ఏ ఒక్కరి సోత్తూ కాదు. విభిన్నంగా ఆలోచించే లక్షణం, ఆవిష్కరణలకు ఊపిరిపోసే చాకచక్యం ఉంటే ప్రతి ఒక్కరూ ఆవిష్కర్తలే.’’ అని విశ్వసించే ప్రముఖ పారిశ్రామిక వేత్త, దివంగత రతన్ టాటా స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని యువతను సృజన శీలురుగా తీర్చిదిద్దే అతిపెద్ద క్రతువుకు బుధవారం అంకురార్పణ జరగనుంది. రతన్ టాటా ఆవిష్కరణ కేంద్రాల(ఆర్‌టీఐసీ)కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా విశ్వ విపణిలో యువత అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయనున్నారు. స్థానిక యువతలోని మేథస్సును వెలికి తీయనున్నారు. అదేవిధంగా స్థానిక పెట్టుబడులకు వేదికను కల్పించనున్నారు.
రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు, వీటిని సమన్వయం చేయడంతోపాటు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యమయ్యేలా రాజధాని పరిధిలోని మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్)ను ఏర్పాటు చేశారు. మంగళగిరి బైపా్‌సలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వెంబడి నూతనంగా నిర్మించిన మయూరి టెక్‌పార్కులో ఏర్పాటు చేసిన రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభిస్తారు. అనంతరం, ఇక్కడ నుంచే ఇతర నగరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను వర్చువల్‌గా ఆయన ప్రారంబించనున్నారు. మయూరి టెక్‌పార్కులోని నాల్గవ అంతస్తులో సుమారు 53 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఇంటీరియర్స్ అభివృద్ధి, ఇతరత్రా ఎలక్ట్రికల్ పనుల పూర్తికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.13.96 కోట్లను ఖర్చు చేసింది. రానున్న అయిదేళ్లలో లక్ష మంది యువతకు ఉద్యోగవకాశాలను కల్పించడమే లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నొవేషన్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. జేఎన్‌టీయూ పరిపాలనా భవనంలో ఉన్న ఈ సెంటర్‌ను ఆయన మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
దేశంలోనే తొలిసారి
రాష్ట్రంలో ఆవిష్కరణలు, స్టార్ట్‌పలు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెలకొల్పారు. అంతేకాదు, వీటి ద్వారా సిలికాన్‌వ్యాలీ తరహా ఎకోసిస్టమ్‌ను సృష్టించాలని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో తొలి హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. వీటి ద్వారా స్థానిక పెట్టుబడిదారులకు ప్రత్యేక గుర్తింపు, యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని వివరించింది. ప్రధానంగా ‘ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామివేత్త’ను రూపొందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయని తెలిపింది. అదేవిధంగా ఈ కేంద్రాలకు అవకాశాల గనులుగా మారనున్నాయని పేర్కొంది. ప్రతిభ ఉన్న ఒక్కరినీ ప్రోత్సహించనున్నట్టు తెలిపింది. ‘‘ఆలోచనలనే పెట్టుబడితో నగరాలు, గ్రామీణ ప్రాంతాలను ఆవిష్కరణల నిలయాలుగా తీర్చిదిద్దుతాం. యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేస్తాం.’’ అని రతన్‌టాటా సంస్థ స్పష్టం చేసింది. వనరుల కల్పన, నెట్‌వర్క్ అవకాశాలు, కార్యక్రమాల రూపకల్పనకు ఈ కేంద్రాలు దోహదపడనున్నాయని పేర్కొంది. నైపుణ్యాభివృద్ధికి కీలక కేంద్రాలుగా మార్చనున్నట్టు తెలిపింది.
నగరానికో నగ!
ఐదు నగరాల్లో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఆవిష్కరణల కేంద్రాలు.. ఆయా ప్రాంతాల్లోని స్థానిక అంశాలకు పెద్దపీట వేయనున్నాయి. స్థానిక యువత నైపుణ్యాలు, ఏయే రంగాలకు అవకాశం ఉందన్న విషయాలను గమనంలో పెట్టుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ‘మన మిత్ర’ సేవలతో అనుసంధానం చేస్తారు.
అనంతపురం: తయారీ సహా ఆటోమోటివ్ రంగాలకు ప్రాధాన్యం.
విశాఖపట్నం: సాఫ్ట్‌వేర్ సేవలు, ఫార్మా, మ్యారిటైమ్ రంగాలకు పెద్దపీట.
విజయవాడ: మొబిలిటీ, పబ్లిక్ సెక్టార్, తయారీకి కీలక ప్రాధాన్యం.
రాజమండ్రి: వ్యవసాయ, ఆక్వా సుస్థిరాభివృద్దికి దన్ను.
తిరుపతి: అగ్రి ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు ఊతం.