రసాభాసగా పంచాయతీ సమావేశం
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:46 PM
పాణ్యం మేజర్ గ్రామపంచాయతీ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం పంచాయతీ సమావేశం సర్పంచ పల్లవి అధ్యక్షతన జరిగింది.

పాణ్యం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : పాణ్యం మేజర్ గ్రామపంచాయతీ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం పంచాయతీ సమావేశం సర్పంచ పల్లవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఉప సర్పంచ చంద్రశేఖరరెడ్డి రూ.14 లక్షల గోల్‌మాల్ జరిగిందంటూ ఈవోఆర్‌డీ, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు పాణ్యం పంచాయతీకి మంజూరైన 15 ఆర్థిక సంఘం నిధులు, జనరల్ నిధులు, ఇతర నిధుల ఖర్చులను, మిగులును చూపించాలని పట్టుబట్టారు. ప్రతిపాదనలు తయారు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వీధి దీపాలు, వాహనాల డీజల్, జనరల్ ఫండ్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎస్సీ కాలనీలో నీటి సరఫరా సరిగా లేదన్నారు. తాగునీటి వృథాను అరికట్టడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. బస్టాండు సమీపంలోని చర్చి వద్ద అపరిశుభ్రతతో కంపుకోడుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. 2024-25 సంవత్సరానికి మంజూరైన నిధుల వివరాలు వారం రోజులుగా అడుగుతున్నా ఇవ్వడం లేదని ఉప సర్పంచ ఆరోపించారు. మంజూరైన పనులకు రెండు పర్సెంటీజీ ఇవ్వాలని, లేని పక్షంలో ఎంబుక్కులో పనులు నమోదు చేయబోమని ఈఓఆర్‌డీ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపాదనల రికార్డుల్లో ఖాళీ పేజీలు తయారు చేసి తర్వాత పనులు ఎక్కించుకుంటున్నారన్నారు. గ్రామ సమప్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఆనందరావు సమాధానమిస్తూ గత సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 71,82,212 మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో 58,95 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రికార్డుల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేవన్నారు. సర్పంచ అనుమతితోనే పనులు చేపడుతున్నామన్నారు. ప్రతి పనికి ఓచర్, బిల్లులు ఉన్నాయన్నారు. ప్రతి రోజూ పరిశుభ్రత, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈఓఆర్‌డీ చంద్రమౌళీశ్వర గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో నిధులు ఉంటేనే ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని కార్యదర్శులను ఆదేశించామన్నారు. నిధుల్లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. కార్యక్రమం లో వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.