Rajampeta MLA: 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ‘ఆకేపాటి ఎస్టేట్’!
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:02 AM
ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తన స్వగ్రామమైన రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ‘ఆకేపాటి ఎస్టేట్’ పేరిట రిజిస్ర్టేషన్ చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజంపేట టీడీపీ మండల అధ్యక్షుడు పెన్నె సుబ్బనరసయ్య నాయుడు ఫిర్యాదు చేశారు.
రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేకు జేసీ నోటీసులు
భూఆక్రమణపై నేడు విచారణకు రావాలని
అమరనాథరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆదేశం
ఆక్రమిత భూముల్లో విలాసవంత భవనం
గుర్రపుశాలలు, గోశాల, స్విమ్మింగ్‌పూల్ కూడా
రాజంపేట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మెడకు భూ కబ్జాల వివాదం చుట్టుకుంది. ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తన స్వగ్రామమైన రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ‘ఆకేపాటి ఎస్టేట్’ పేరిట రిజిస్ర్టేషన్ చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజంపేట టీడీపీ మండల అధ్యక్షుడు పెన్నె సుబ్బనరసయ్య నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి భూ కబ్జాలకు పాల్పడి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో కలెక్టర్ శ్రీధర్ ఈ విచారణ బాధ్యతలను రాజంపేట సబ్ కలెక్టర్ నిదియా దేవికి అప్పగించారు. దరిమిలా రెవెన్యూ, సర్వే అధికారులు ఇటీవల విచారణ పూర్తి చేశారు. మందపల్లి రెవెన్యూ భూమిలోని సర్వే నంబరు 814/3లో 4 ఎకరాలు, 814/4లో 5 ఎకరాలు, 815/1లో 3.79 ఎకరాలు, 815/2లో 5 ఎకరాలు, 816/2 4.13 ఎకరాలు.. అలాగే ఆకేపాడు రెవెన్యూ భూమిలోని సర్వే నంబరు 56/1లో 5 ఎకరాలు, 56/8లో 5.68 ఎకరాలు, 56/9లో 2.35 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు ప్రాఽఽథమికంగా నిర్ధారించారు. సంబంధిత నివేదికను రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ పీర్‌మున్నీ కలెక్టర్‌కు సమర్పించారు. అమరనాథరెడ్డి, ఆయన భార్య జ్యోతమ్మ, సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి, ఆయన భార్య సృజన పేరుతో దాన విక్రయాల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నట్లు నివేదించారు. దీనిపై శనివారం విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. కాగా, ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో ఓ చిన్నగుట్టపై ఆకేపాటి ఎస్టేట్ పేరిట ఎమ్మెల్యే విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, గుర్రపుశాలలు.. పాఠశాల....టీటీడీ కల్యాణ మండపం, సమావేశ మందిరం, గోశాల, కొన్ని కుటీరాలు నిర్మించారు. కొంత భూమిలో వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు.