Share News

Andhra Pradesh liquor scam: రాజ్‌ కసిరెడ్డి అరెస్టు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:52 AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. విచారణకు నాలుగు సార్లు హాజరుకాకపోవడంతో, సిట్ అధికారులు ఆయనను విజయవాడకు తరలించారు.

Andhra Pradesh liquor scam: రాజ్‌ కసిరెడ్డి అరెస్టు

కలుగు నుంచి బయటికొచ్చిన లిక్కర్‌ డాన్‌

గోవా నుంచి విమానంలో హైదరాబాద్‌కు.. అట్నుంచి అటే చెన్నైకి వెళ్లాలని పథకం

ఆపై విదేశాలకు చెక్కేసే యోచన

విమానాశ్రయం వద్ద ‘సిట్‌’ నిఘా

ఎంతకీ బయటికి రాని రాజ్‌ కసిరెడ్డి

లోపలికే వెళ్లి అరెస్టు చేసిన పోలీసులు

విచారణకు వస్తా, వదిలేయాలని వినతి

నమ్మలేమంటూ అరెస్టు చేసిన ‘సిట్‌’

విజయవాడకు తరలింపు..

నేడు కోర్టు ముందు హాజరు

వైసీపీ హయాంలో మద్యం కుంభకోణాన్ని నడిపించిన రాజ్‌ కసిరెడ్డి అలియాస్‌ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని ‘సిట్‌’ సిబ్బంది పట్టేసుకున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు విచారణకు డుమ్మా కొట్టి... హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేసి... ‘తప్పించుకుని’ తిరుగుతున్న ఆయన ఎత్తును చిత్తు చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్‌ కసిరెడ్డిని హైదరాబాద్‌ (శంషాబాద్‌) విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి ఆయనను విజయవాడకు తరలించారు.

అమరావతి/శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మద్యం స్కామ్‌ లో కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగుసార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి... చివరకు విజయం సాధించారు. శుక్రవారం రాజ్‌ తండ్రి ఉపేందర్‌ రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణ ముగిసిన వెంటనే... ‘పోలీసులు ఏం అడిగారు?’ అంటూ రాజ్‌ తన తండ్రిని వాట్సాప్‌ ద్వారా ఆరా తీశారు. అప్పటికే ఉపేందర్‌ రెడ్డి ఫోన్‌పై నిఘా వేసిన ‘సిట్‌’ సిబ్బంది... ఆ మెసేజ్‌ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ‘లొకేషన్‌’ తెలియడంతో... గోవాకు వెళ్లి ఆయనను పట్టుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఒక బృందం గోవాకు చేరుకుంది. అయితే... జగన్‌ హయాంలో ‘వైపీఎ్‌స’గా పని చేసిన ఒక పోలీసు అధికారి వెంటనే రాజ్‌ కసిరెడ్డిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మరోవైపు... ఎంపీ మిథున్‌ రెడ్డికి కల్పించినట్లు తనకూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆయనకు తక్షణ ఉపశమనం లభించలేదు.

gfd.jpg

దీంతో... ఆయన వ్యూహాత్మకంగా ఒక ఆడియో రిలీజ్‌ చేశారు. ‘‘మంగళవారం సిట్‌ ముందు విచారణకు హాజరవుతాను’’ అని అందులో తెలిపారు. అయినా సరే... పోలీసులు గోవాకు బయలుదేరారు. అక్కడ... రాజ్‌ కసిరెడ్డి ఫోన్‌ చివరి లొకేషన్‌ వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన గోవా నుంచి హైదరాబాద్‌కు చెక్కేసినట్లు గుర్తించారు.


పేరు మార్చి... ఏమార్చాలని..

రాజ్‌ కసిరెడ్డి పోలీసులను ఏమార్చేందుకు మరో ఎత్తు వేశారు. ‘రాజేశ్‌ రెడ్డి’ పేరుతో నకిలీ ఐడీతో గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. రాజ్‌ కసిరెడ్డి హైదరాబాద్‌లో దిగగానే అదుపులోకి తీసుకునేందుకు ‘సిట్‌’కు చెందిన మరో బృందం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయం ‘అరైవల్‌’ గేట్‌ ముందు అధికారులు వేచి చూస్తున్నారు. అయితే... రాజ్‌ కసిరెడ్డి పథకం వేరు. ఆయన.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి మరో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. బహుశా... చెన్నై నుంచి విదేశాలకు చెక్కేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. రాజ్‌ ఎంతకీ బయటికి రాకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు, అధికారుల సహకారంతో తామే లోపలికి వెళ్లారు. అక్కడ రాజ్‌ కసిరెడ్డిని గుర్తించిన తక్షణం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో హైడ్రామాకు తెరలేపారు. ‘‘రేపు (మంగళవారం) విజయవాడలో విచారణకు హాజరవుతాను. నన్ను వదిలేయండి’’ అని పదేపదే కోరారు. పోలీసులు ఆయన మాటల్ని వినిపించుకోలేదు. ‘‘నాలుగు సార్లు నోటీసులిచ్చినా రాలేదు. ఇప్పుడుమాత్రం వస్తావని నమ్మేదెలా!? మాతోపాటు ఇప్పుడే రావాల్సిందే’’ అని స్పష్టం చేశారు. రాజ్‌ కసిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయనను విజయవాడలోని ‘సిట్‌’ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం సీఐడీ కోర్టులో హాజరు పరచనున్నారు.


సూత్రధారి ఆయనే...

మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ‘సిట్‌’... ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో మొదలుకుని... ఎంపీ మిథున్‌ రెడ్డి వరకు అనేకమందిని ప్రశ్నించింది. మద్యం వ్యాపారులనూ విచారించింది. టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించింది. జగన్‌ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి దాని అమలు, జే-బ్రాండ్లను ప్రవేశపెట్టడం, కమీషన్ల వసూలు చేయడం, ఆ మొత్తాన్ని చేరాల్సిన చోటికి చేర్చడం... ఇలా ఏడంచెల్లో సాగిన కుంభకోణంలో రాజ్‌ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. పేరుకు జగన్‌ ప్రభుత్వంలో ఐటీ సలహాదారు పదవి! కానీ... చేసిందంతా ‘లిక్కర్‌’ లెక్కలే! రాజ్‌ కసిరెడ్డిని పిలిచి ప్రశ్నించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఆయన సహకరించలేదు. మొబైల్‌ ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి ఇంటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ‘సిట్‌్‌’ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి... హైదరాబాద్‌లోని ఆయన నివాసం, వ్యాపార కార్యాలయాలు, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో రెండు రోజులపాటు సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. ఆర్థిక మూలాల్ని స్తంభింపజేశారు. లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌(ఎల్‌ఓసీ) కూడా జారీ చేశారు. ఆయన తండ్రి ఉపేందర్‌ రెడ్డిని విచారణకు పిలిచి గౌరవంగా మాట్లాడారు. ‘మీ కుమారుడు విచారణకు వచ్చి మాకు సహకరించక పోతే చట్ట పరంగా చేయాల్సినంత చేస్తాం’ అని స్పష్టం చేశారు. చివరికి... సోమవారం రాజ్‌ కసిరెడ్డి కలుగులో నుంచి బయటికి రావడం, పోలీసులు పట్టేసుకోవడం జరిగిపోయింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని... మద్యం స్కామ్‌ నుంచి లబ్ధి పొందిన ‘అసలు బాస్‌’లు ఎవరు, ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు... ఆ డబ్బు ఎలా చేతులు మారింది... అనే వివరాలను రాబట్టే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:06 AM