Heat Rises: తగ్గిన వాన.. పెరిగిన ఎండ
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:23 AM
రాష్ట్రంలో ఆదివారం ఎండతీవ్రత పెరిగింది. మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు, జల్లులు, మేఘాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది.
కావలిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత
శ్రీశైలం ఒక్కగేటు ద్వారా నీటి విడుదల
గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఆదివారం ఎండతీవ్రత పెరిగింది. మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు, జల్లులు, మేఘాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు శనివారం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 37.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న 48 గంటలు ఉత్తరకోస్తాలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. ఆగస్టు తొలి వారంలో రుతుపవనద్రోణి తూర్పుభాగం దక్షిణాదివైపునకు వచ్చే అవకాశం ఉన్నందున కోస్తాలో వర్షాలు పెరుగుతాయన్నారు. కాగా, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. శనివారం రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఆదివారం ఒక గేటును మూసివేశారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 1,18,274 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ఒక్క గేటు ఎత్తి 66,417 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882 అడుగులకు చేరుకుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.81 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 93,115 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో నీటి మట్టం 584అడుగులకు చేరింది. ఇది 291.37 టీఎంసీలకు సమానం. పులిచింతల ప్రాజెక్టులో 20.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 26,430 క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది.
ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉప నదులు శబరి, సీలేరు, మంజీర, ప్రవర, పర్ణ, ఇంద్రావతి నుంచి అదనంగా వస్తున్న 6,89,258 క్యూసెక్కుల వరదను పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 35.00 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ 175 గేట్లను 1.5 మీటర్లు ఎత్తి 6,18,044 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News