Andhra Rains Alert: నేడు కోస్తా సీమలో వర్షాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:08 AM
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు చేరాయి

విశాఖపట్నం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం ఉత్తర ఈశాన్యంగా పయనించి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు లేని ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని, సాధారణం కంటే 2నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. రాష్ట్రంలో శుక్రవారం భిన్నమైన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 41.8, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.1, చిత్తూరు జిల్లా నగరి, కడప జిల్లా ఒంటిమిట్టలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి