Share News

మధురానగర్‌ తూర్పున రైల్వే ఓవర్‌ బ్రిడ్జి!

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:52 AM

నగరంలో సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌కు ప్రత్యామ్నాయంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) సాకారం కాబోతోంది. మధురానగర్‌ తూర్పున ఇది ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జి కోసం వీఎంసీ, రైల్వేశాఖలు సర్వే పూర్తి చేశాయి. నేతాజీ రోడ్డు చివర నుంచి మొదలై రైవస్‌ కాల్వ, విజయవాడ - గుడివాడ రైల్వేలైన్‌ మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు అనుసంధాన మవుతుంది. బుడమేరు ఉత్తర ప్రాంత వాసులు నగరంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. నూతన ఆర్‌వోబీపై ’ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

మధురానగర్‌ తూర్పున రైల్వే ఓవర్‌ బ్రిడ్జి!

- సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌కు ప్రత్యామ్నాయం

- నేతాజీ రోడ్డు చివర నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు వరకు సరికొత్త ఆర్‌వోబీ

- సిద్ధమైన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు

- సర్వే పూర్తి చేసిన వీఎంసీ, రైల్వేశాఖలు

- బుడమేరు ఉత్తర ప్రాంత వాసులు నగరంలో ప్రవేశానికి మార్గం సుగమం

నగరంలో సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌కు ప్రత్యామ్నాయంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) సాకారం కాబోతోంది. మధురానగర్‌ తూర్పున ఇది ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జి కోసం వీఎంసీ, రైల్వేశాఖలు సర్వే పూర్తి చేశాయి. నేతాజీ రోడ్డు చివర నుంచి మొదలై రైవస్‌ కాల్వ, విజయవాడ - గుడివాడ రైల్వేలైన్‌ మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు అనుసంధాన మవుతుంది. బుడమేరు ఉత్తర ప్రాంత వాసులు నగరంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. నూతన ఆర్‌వోబీపై ’ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

ఆంధ్రజ్యోతి-మధురానగర్‌:

సెంట్రల్‌ నియోజకవర్గంలో బుడమేరుకు ఉత్తరాన ఉన్న ప్రాంతవాసులు నగరంలోకి రావడానికి ప్రధానంగా సింగ్‌నగర్‌ ఫ్లైవోవర్‌ ఒక్కటే దారి. దీంతో రోజువారి ట్రాఫిక్‌ సమస్య అంతా ఇంతా కాదు. ఇపుడు ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఈ నియోజకవర్గంలో రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడానికి రైల్వే శాఖ డిటైల్డ్‌ ప్రాజెక్టు డ్రాయింగ్‌, అంచనాలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలనే దాని మీద నాలుగు రోజుల కిందట వీఎంసీతో కలిసి రైల్వేశాఖ అధికారులు సర్వే చేశారు. సింగ్‌నగర్‌, పాయకాపురం, వాంబేకాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, కుందావారి కండ్రిక, ఇందిరా నాయక్‌ నగర్‌, దేవినగర్‌, దావు బుచ్చయ్య కాలనీ వాసులు దేవినగర్‌ మీదుగా మధురానగర్‌ దేవినగర్‌ వంతెన మీదుగా నగరంలోకి వస్తున్నారు. అయితే రద్దీ సమయంలో ఇక్కడ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో మధురానగర్‌ పప్పుల మిల్లు వద్దకు ట్రాఫిక్‌ వస్తోంది. ఇక్కడ రైల్వే గేటు ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్య పరిష్కారం కోసం మొదటి దశలో గుడివాడ రైల్వే లైను మీద మరో వంతెన ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన మేరకు నేతాజీ రోడ్డు చివర అనువుగా ఉంటుందని నిర్ణయించారు.

సర్వేతో స్థానికుల్లో ఆందోళన

సర్వే చేసిన వీఎంసీ, రైల్వే అధికారులు నేతాజీ రోడ్డులో రెండు వైపులా ఇళ్లకు మార్కింగ్‌ చేశారు. దీంతో స్థానికుల్లో అందోళన మొదలైంది. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో రెవెన్యూ అఽధికారులతో సర్వే చేయించారు. మాస్టర్‌ ప్లాన్‌లో బుడమేరు, దాని పక్కనే ఉన్న ఏలూరు కాల్వల నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు పక్కన ఉన్న రైవస్‌ కాల్వకు అనుసంధానంగా ఒక కాల్వ ఉండేది. ఈ కాల్వకు రెండు పక్కల కట్ట ఆక్రమణలకు గురై ఇపుడు రెండు మూడు అంతస్తుల భవనాలు వెలిసాయి. వీటిలో కొంత మేర 1981లో ఇందిరాగాంధీ హయాంలో పట్టాలు ఇచ్చారు. అదే కాల్వ కాలక్రమంలో నేతాజీ రోడ్డుగా మారింది. ఈ ఆక్రమణలను గుర్తించి ఖాళీ చేయించడమా లేక పట్టాలు ఇవ్వడమా అనే దాని కోసం వైసీపీ హయాంలో సర్వే చేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఇపుడు రైల్వే శాఖ, మున్సిపల్‌ శాఖలు సర్వే చేయడంతో పట్టాల రిజిసే్ట్రషన్‌ కోసం వేచి ఉన్న ప్రజలు ఆందోళనలో పడ్డారు. మరో పక్క రైల్వే అధికారులు ఇప్పటికే డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు, డ్రాయింగ్‌, అంచనాలు సిద్ధం అయ్యాయని చెప్పారు.

ప్రజల సమక్షంలో మరోసారి సర్వే

మొదట ఆర్‌యూబీ అన్నారు. కానీ నేతాజీ రోడ్డు చివర రైవస్‌ కాల్వ, డ్రైనేజీ అడ్డు వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆర్‌వోబీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని కోసం అధికారులు చేసిన సర్వే వల్ల నేతాజీ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆ కాలనీ వాసులు నా దగ్గరకు వచ్చారు. వీఎంసీ, రైల్వే అధికారులు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు సర్వే చేసారో చూడాలి. అందుకని మరోసారి నేనే దగ్గరుండీ సర్వే చేయిస్తా.

-బొండా ఉమామహేశ్వరరావు, సెంట్రల్‌ ఎమ్మెల్యే

రైవస్‌ కాల్వ మీద వంతెన

బీఆర్‌టీఎస్‌ రోడ్డు పక్కన ఉన్న రైవస్‌ కాల్వ మీద వంతెన వస్తుంది. వంతెనకు ఒక పక్కన నేతాజీ రోడ్డులో ర్యాంపు ఉంటుంది. ఏలూరు కాల్వ వీవీ నరసరాజు రోడ్డు నుంచి ఈ ర్యాంపు మొదలవుతుంది. మరో వైపు ర్యాంపు బీఆర్‌టీఎస్‌ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దిగుతుంది.

- రాంబాబు, వీఎంసీ ఏసీపీ

Updated Date - Feb 17 , 2025 | 12:52 AM