Share News

ACB Court: మిథున్‌కు ఇంటి భోజనం

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:54 AM

మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి ఇంటి నుంచి అల్పాహారం, రెండుపూటలా భోజనాన్ని తీసుకెళ్లడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.

ACB Court: మిథున్‌కు ఇంటి భోజనం

  • 2 పూటల ఆహారం ఒకేసారి తీసుకెళ్లడానికి కోర్టు అనుమతి

  • ప్రత్యేక సెల్‌, సహాయకుడు, టేబుల్‌, పెన్ను, పేపర్లు, పత్రికలు, టీవీ,

  • మినరల్‌ వాటర్‌, కూలర్‌, కమోడ్‌, మందులు ఏర్పాటు చేయాలి

  • వారానికి మూడేసి ములాఖత్‌లు.. ఏసీబీ కోర్టు తీర్పు

విజయవాడ/రాజమహేంద్రవరం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి ఇంటి నుంచి అల్పాహారం, రెండుపూటలా భోజనాన్ని తీసుకెళ్లడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ములాఖత్‌ల సమయంలో న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ప్రత్యేక గదిని కేటాయించాలన్న అభ్యర్థనను కొట్టేసింది. మిథున్‌రెడ్డి జైల్లో తనకు కల్పించాల్సిన సదుపాయాలపై పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంచం, కుర్చీ, టేబుల్‌, టీవీ, సహాయకుడు (అటెండర్‌), ప్యూరిఫైడ్‌ మంచినీళ్ల సీసాలు, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగా మ్యాట్‌, మల్టీవిటమిన్‌ మందులు, చేపనూనె మందులు, ప్రొటీన్‌ పౌడర్‌, దిండు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కేంద్ర కారాగారం నుంచి డీఎస్పీ వెంకటేశ్వరరావు కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. జైలు మాన్యువల్‌ ప్రకారమే తాము మిథున్‌రెడ్డికి సదుపాయాలు కల్పించామన్నారు. మిథున్‌రెడ్డి తరఫున న్యాయవాదులు, జైలు అధికారి వాదనలు విన్న అనంతరం మంగళవారం రాత్రి న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పు వెలువరించారు. మిథున్‌రెడ్డికి ప్రత్యేక సెల్‌, టేబుల్‌, కుర్చీ, టేబుల్‌ మ్యాట్‌, పెన్‌, పేపర్లు, పత్రికలు, సహాయకుడిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం తీసుకెళ్లడానికి అనుమతిచ్చారు. ఈ మూడింటినీ ఒకేసారి తీసుకెళ్లాలని, తీసుకెళ్లిన వ్యక్తి జైలు అధికారులకు పూచీకత్తు రాసి ఇవ్వాలని స్పష్టం చేశారు. వారంలో న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి మూడు ములాఖత్‌లు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి మూడు ములాఖత్‌లు ఇచ్చారు. సెల్‌లో టీవీ లేకపోతే పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు దానిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మినరల్‌ వాటర్‌ బాటిళ్లు, సెల్‌ కూలర్‌ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మందులు అందజేయాలని, అందుబాటులో లేనిపక్షంలో బయటి నుంచి కొని తెప్పించాలని ఆదేశించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెస్ట్రన్‌ కమోడ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.


మిథున్‌రెడ్డితో వైసీపీ నేతల ములాఖత్‌

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో మిథున్‌రెడ్డిని మంగళవారం ములాఖత్‌ ద్వారా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, దాట్ల పృథ్వీరాజ్‌ కలిశారు. అనంతరం జైలు బయట వేణు మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డిని జైలులో ప్రజాప్రతినిధిగా పరిగణించడం లేదని, సాధారణ ఖైదీగానే చూస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వమే అమ్మకాలు చేసినప్పుడు మద్యం కుంభకోణం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. మిథున్‌రెడ్డి కోర్టును కోరిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి మంగళవారం తమకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ తెలిపారు. కాగా మిథున్‌రెడ్డి కుటుంబం రాజమహేంద్రవరంలో ఉండటానికి అపార్టుమెంట్ల వంటివికాకుండా విలాసవంతమైన ఇల్లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. మాజీ ఎంపీ భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటిని వెదికే పనిలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 03:55 AM