ప్రజాధనం నీళ్లపాలు
ABN , Publish Date - Feb 19 , 2025 | 11:13 PM
ద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత వైసీపీ సర్కార్ నాడు- నేడు కింద రూ.కోట్లు ఖర్చు చేసి పలు ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లును ఏర్పాటు చేసింది.
వైసీపీ హయాంలో అంతులేని నిర్లక్ష్యం
ఆర్వో ప్లాంట్లు పేరుతో.. రూ.కోట్ల ఖర్చు
పనిచేయని నీటి శుద్ధి యంత్రాలు
ఇళ్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్న విద్యార్థులు
వేసవిలోగా కూటమి ప్రభుత్వం స్పందించేనా?
నంద్యాల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో గత వైసీపీ సర్కార్ నాడు- నేడు కింద రూ.కోట్లు ఖర్చు చేసి పలు ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వాటి నిర్వాహణను గాలికి వదిలేసింది. ఖరీదైన పరికరాలు సైతం మరమ్మతులకు చేరి నిరూపయోగంగా మారాయి. తద్వారా ఆయా పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఓ మూలకు చేరి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఇక విద్యార్థులు చేసేదేమీ లేక ఇళ్ల నుంచి బాటిళ్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చేతిబోరు నీటినే తాగాల్సిన గత్యంతర పరిస్థితి ఏర్పడింది. ఆర్వో ప్లాంట్లు నిర్వహణపై గత ప్రభుత్వ తీరు మూన్నాళ్ల ముచ్చగానే మారింది. గత వైసీపీ పాలకుల నిర్వాకంతో.. విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికమైంది. ఈ క్రమంలో వేసవి సీజనను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలల్లో ఆర్వో ప్లాంట్లను మరమ్మతులు చేసి వినియోగం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1,352 ప్రభుత్వ పాఠశాలల్లో 1,45,517మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఆయితే చాలా ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఎక్కువ శాతం ఆర్వో ప్లాంట్‌లు కూడా పనిచేయకపోవడంతో దిక్కులేక.. కొళాయి నీరు, చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అపరిశుభ్రత ప్రాంతాల్లో ఉండే కలుషిత నీరు ను తాగాల్సిన పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలని సుమారు రూ.3 కోట్లకుపైగా నాడు- నేడు కింద ఖర్చు చేసి ఆర్వో ప్లాంట్లును ఏర్పాటు చేసి మమ అనిపించేశారు. కానీ ఆచరణలో మాత్రం ఆశించిన స్థాయిలో పెట్టలేకపోయింది. ఎక్కడ చూసినా ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు చేరి పనికిరాకుండా పోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 357 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 177 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 180 మాత్రం ఏళ్ల తరబడి పనిచేయడం లేదని అధికార లెక్కలు చెబుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
ఫ ఏళ్ల తరబడి మూలనపడ్డ ఆర్వో ప్లాంట్లు
గత జగన ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు నాణ్యాతలోపంగా ఉండటంతో ఎక్కువ కాలంలో పనిచేయలేదు. 70 శాతం పనిచేయకపోవడంతో పలుమార్లు ఆయా ఏజెన్సీలతో పాటు అధికారులకు సంబంధిత యాప్ ద్వారా ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు ఫిర్యాదు చేసినా ఏమాత్రటి పట్టించుకోలేదు. చివరికి విద్యార్థుల కష్టాలు చూడలేక.. కొందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు. మరికొన్ని ఏజెన్సీలకు ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంగా సర్వీసింగ్ చేయడం లేదు.
జిల్లా వ్యాప్తంగా వివరాలివి...
- ప్రైమరీ పాఠశాల సంఖ్య : 969
- విద్యార్థుల సంఖ్య : 41,640
- ప్రాథమిక పాఠశాలలు : 104
- విద్యార్థుల సంఖ్య : 10,945
- హైస్కూల్స్ : 279
- విద్యార్థుల సంఖ్య : 92,932
-------------------------------------------
ఫ జిల్లాలో ఆర్వో ప్లాంట్లు అమర్చిన పాఠశాలల సంఖ్య : 357
ఫ ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్వో ప్లాంట్లు : 177
ఫ పనిచేయని ఆర్వో ప్లాంట్లు : 180
--------------------------------------------
మంత్రి బీసీ ఇలాకాలో...
బనగానపల్లి మండలంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత పాఠశా లల్లో -10, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో-10 చొప్పున మొత్తంగా 20 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలు, బాలికల ఉన్నత పాఠశాలు, నందవరం నందివర్గం, పలుకూరు రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, టంగుటూరు, బనగానపల్లె మోడల్ స్కూల్, కస్తూర్బా, ఏపీ గురుకుల పాఠశాలలతో పాటు మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లు ఎక్కడా పనిచేయడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కొళాయినీరు తాగుతుండగా.. మరికొన్ని పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద నుంచే తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్న బీసీ జనార్దన రెడ్డి చొరవ తీసుకుని తాగునీటి ప్లాంట్లను వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
ఫ మహానంది మండలంలో నాడు-నేడు కింద గత వైసీపీ ప్రభుత్వం ఏడు పాఠశాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. గోపవరం, గాజులపల్లి, బుక్కాపురం, బొల్లాపురం ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ గత ఏడాది నుంచి పనిచేయడం లేదు. చేసేదీ లేక కొందరు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. మరికొందరు బయట ప్రాంతాల్లో కొనుగోలు చేసి తెచ్చకుంటున్నారు. అధికార లెక్కల ప్రకారం ఏడు వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయగా.. వాటిలో నాలుగు మరమ్మతులకు చేరాయి.
ఫ బండి ఆత్మకూరు మండలం పరిధిలో 9 ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆయితే ఆ మిషన్లు ఎక్కువ కాలం పనిచేయకపోవడంతో మరమ్మతులకు చేరాయి. మండలంలోని పార్నపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 74 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ తాగునీటి వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటుండగా.. కొన్ని సార్లు ప్లాస్టిక్ బిందెలతో తాగునీరు అందిస్తున్నారు. మిగిలిన 8 పాఠశాలల్లో కూడా సదరు వాటర్ ప్లాంట్‌లు పనిచేయడం లేదు.
ఫ శ్రీశైలంలోని జడ్పీహెచఎస్ పాఠశాలలో గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అయితే గత ఏడాది నుంచి పనిచేయడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటుండగా.. మరికొందరు విద్యార్థులు బోరింగ్ నీరు తాగాల్సిన దుస్థితి.
ఫ జూపాడుబంగ్లా మండలంలో నాడు-నేడు కింద గత వైసీపీ ప్రభుత్వం 13 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆయితే ఒక్కటి కూడా పనిచేయలేదు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలన చేయగా.. ఆర్వో ప్లాంట్‌ను ఓ మూలన పడేశారు. రెండేళ్ల నుంచి పని చేయలేదు. ఇక్కడ 537 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ట్యాంకు ద్వారా సరఫరా చేసే నీటిని విద్యార్థులు తాగాల్సిన దుస్థితి. కొందరు విద్యార్థులు ట్యాంకు నీళ్లు తాగి.. అనారోగ్యం పాలు కావడంతో కొందరు ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నామని వాపోయారు.
ఫ రుద్రవరం మండలం పేరూరు ప్రాథమిక పాఠశాలలో గత మూడేళ్లుగా గత ప్రభుత్వం అమర్చిన తాగునీటి వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు గురై అటకెక్కింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మూలకు ఉంచారు. ఇక్కడ 61 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల కష్టాలు చూడలేక.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి ప్లాస్టిక్ క్యానలో నీటిని తెచ్చిపెడుతున్నారు. ఇవీ సరిపోక కొందరు ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు.
ఫ డోన పట్టణంలో జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో 1,747 మంది విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వం నాడు-నేడు కింద ఇక్కడ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల నుంచి పనిచేయకపోవడంతో తాగునీరు లేక.. బోరు నీరు తాగలేక.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా మరుగుదొడ్డు కూడా సక్రమంగా లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది.
ఫ శిరివెళ్ల మండలం యర్రగుంట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 610 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజు 550 మందికిపైగా విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తుంటారు. ఏడాది నుంచి ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలోని బోరు నీటినే తాగుతున్నారు. కొందరు విద్యార్థులు బోరు నీరు తాగలేక.. ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వం శిరివెళ్ల మండల పరిధిలో 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయగా.. యర్రగుంట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, మెయిన ప్రాథమిక పాఠశాల, గుండంపాడు, మహాదేవపురం మెయిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయలేదు.
ఫ ఫిర్యాదు చేసినా మెకానిక్ రావడం లేదు
- చిన్న మద్దిలేటి, ఎంఈఓ, జూపాడు బంగ్లా
మూడేళ్ల నుంచి జూపాడుబంగ్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎలాంటి నిధులు రాలేదు. ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతులు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏజెన్సీ మెకానిక్ కూడా స్పందించలేదు. చివరికి చేసేది నేనే స్వయంగా రూ.15 వేలు ఖర్చు చేసి ఆర్వో ప్లాంట్‌కు రిపేరీ చేయించాను. ఆ తర్వాత కూడా కొన్ని నెలలు పనిచేసి తర్వాత చెడిపోయింది. దీంతో విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తతెత్తాయి. మా పరిధిలోని కొన్ని పాఠశాలల్లో కూడా ఇదే తరహా సమస్య ఉండటంతో ఉపాధ్యాయులే డబ్బులు వెచ్చించి చేయించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఫ ఆర్వో ప్లాంట్లు పనిచేయని విషయం వాస్తవమే
-ఎస్.ప్రేమంతకుమార్ , ఏసీపీ, సమగ్రశిక్షా
జిల్లాలో చాలా వరకు ఆర్వో ప్లాంట్లు పనిచేయని విషయం వాస్తవమే. ఈ విషయాన్ని ఇదివరకే ఉన్నతాధికారులకు నివేదించాం. అతి త్వరలోనే ఆర్వో ప్లాంట్లుకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెస్తాం. విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించేలా చూస్తాం. సదరు ఏజెన్సీలకు గత ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌తో మరమ్మతులు చేయలేదని తెలిసింది.