Share News

Literary Scholar: ప్రముఖ సాహితీవేత్త చిరంజీవినీకుమారి అస్తమయం

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:16 AM

కాకినాడలో ప్రసిద్ధ సాహితీవేత్త, డాక్టర్ పి.చిరంజీవినీకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె తెలుగుభాషా సంస్కృతి పరిరక్షణలో, మహిళల హక్కుల కోసం పని చేస్తూ ఎంతో సేవలు చేసిన వ్యక్తి.

 Literary Scholar: ప్రముఖ సాహితీవేత్త చిరంజీవినీకుమారి అస్తమయం

కాకినాడ రూరల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహితీవేత్త, కాకినాడలోని ఐడీఎల్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌, కార్యదర్శి డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి(94) ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాకినాడలోని ఆమె స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 1931, మార్చి 30న జన్మించిన చిరంజీవినీకుమారి కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా కొంతకాలం సేవలందించారు. డాక్టర్‌ పీవీఎన్‌ రాజుతో కలిసి 1970లో కాకినాడలో ఐడీఎల్‌ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. అనంతరం డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలలను స్థాపించారు. చిరంజీవినీకుమారి మహిళల హక్కుల పరిరక్షణకు పాటుపడ్డారు. కాకినాడ కేంద్రంగా సాహితీరంగానికి ఆమె ఎనలేని సేవలందించారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహాకవి శ్రీసప్తతి, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య వేడుకలు, డాక్టర్‌ గరికపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం మొదలైన కార్యక్రమాలను ఐడీఎల్‌ విద్యాసంస్థల ద్వారా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి, జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రచనకు సారధ్యం వహించి జనవిజ్ఞానవేదికకు సేవలందించారు. చిరంజీవినీకుమారి మృతి ఐడీఎల్‌ విద్యాసంస్థలకు, తెలుగు భాషకు తీరని లోటని పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు, సంతాపం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 06:18 AM