అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ప్రొఫెసర్ దాడి
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:34 AM
నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ ప్రొఫెసర్ మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దాడికి దిగిన ఘటన కృష్ణా యూనివర్సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది.
- నాపై ఫిర్యాదు చేస్తావా అంటూ ముఖంపై పిడిగుద్దులు
- కృష్ణా యూనివర్సిటీ వీసీ బాధ్యతలు స్వీకరించిన మర్నాడే ఘటన
- బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించిన వీసీ రాంజీ
- ఆలస్యంగా వెలుగులోకి విషయం
మచిలీపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ ప్రొఫెసర్ మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దాడికి దిగిన ఘటన కృష్ణా యూనివర్సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... కృష్ణా యూనివర్సిటీకి నూతన వీసీగా రాంజీ గత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ మర్నాడు సోమవారం స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు, సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం వీసీ చాంబరుకు సమీపంలో వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ వీరబ్రహ్మాచారి ఫార్మసీ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న అసిస్టెంట్ ఫ్రొఫెసర్ హనుమంతరావుపై దాడికి దిగారు. నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వాగ్వివాదం చేస్తూ ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఇద్దరికి సర్దిచెప్పేందుకు కొందరు ప్రొఫెసర్లు మంత్రాంగం నడిపారు. అయినప్పటికీ బాధితుడైన అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతరావు వీసీకి ఈ ఘటనపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై వీసీ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని రిజిస్ర్టార్ శోభన్‌బాబు తెలిపారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.