Share News

ప్రభుత్వ భూమిలో ప్రైవేట్‌ వెంచర్‌..!

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:43 PM

ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తూ వెంచర్లు వేసి లక్షల రూపాయలకు విక్రయించేస్తున్నారు.

   ప్రభుత్వ భూమిలో  ప్రైవేట్‌ వెంచర్‌..!
చిన్నటేకూరు గ్రామం హంద్రీనది పోరంబోకు భూమిలో గ్రావెల్‌తో రోడ్డు వేసిన దృశ్యం

చిన్నటేకూరు సర్వే నెం-1లో భూమి ఆక్రమణ

లేఅవుట్‌ వేసి అనుమానం రాకుండా హద్దురాళ్లుగా మొక్కలు

గ్రావెల్‌ తోలి చదును చేసి రోడ్డు వేసిన అక్రమార్కులు

పట్టించుకోని రెవెన్యూ శాఖ

కల్లూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేస్తూ వెంచర్లు వేసి లక్షల రూపాయలకు విక్రయించేస్తున్నారు. ఇటీవలి కాలంలో కబ్జాపర్వం అధికమవుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు కబ్జాదారులు ఏకంగా ప్రభుత్వ భూమిలోనే వెంచర్‌ వేసి విక్రయాలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు సర్వే నెంబరు 1లో 130 ఎకరాల హంద్రీపోరం బోకు భూమి ఉంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో, జగన్నాథగట్టు ట్రిపుల్‌ఐటీ, జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో ఎకరం ధర రూ.కోట్లలో పలుకుతోంది. దీంతో ప్రభుత్వ భూమి కనపడితే చాలు ఆక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, వక్ఫ్‌, నదీపోరం బోకు భూమిలో రూ.కోట్లు విలువ చేసే భూములను కొట్టేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తూ అక్రమార్కులు జోబులు నింపుకుంటున్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో సర్వే నెంబరు 1లో హంద్రీ పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు దర్జాగా ఆక్రమించి... ప్రైవేటు వెంచర్‌ వేసిన సంఘటన వెలుగు చూసింది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేకుండా పోయిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హంద్రీనది పోరంబోకు భూములు ఆక్రమణకు గురికాకుండా రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ లేఅవుట్‌ వేసి హద్దు రాళ్లుగా మొక్కలు

హంద్రీనది పోరంబోకు భూమి ఆక్రమించడమే కాక చదును చేసి లేఅవుట్‌తో అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మి సోమ్ము చేసుకుంటున్నారు. పేపర్‌పై లేఅవుట్‌ తయారు చేసి క్రయ,విక్రయాలు జరిపినట్లు ఇప్పటికే దాదాపు రెండు రూ.కోట్ల మేర దందా జరిపారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. అధికారుల అండదండలతోనే హంద్రీనది పోరంబోకు భూమి ఆక్రమణ జరుగుతున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుని అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. చిన్నటేకూరు గ్రామంలో ఓవ్యక్తి సర్వే నెం-1లోని హంద్రీనది పోరంబోకు భూమిలో ప్లాట్లు వేసి హద్దురాళ్లుగా మొక్కలు నాటినట్లు చిన్నటేకూరు వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌ పి.రంజితబాషాకు డిసెంబరు 23న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వినతిని కల్లూరు తహసీల్దారుకు విచారణ నిమిత్తం పంపారు. దాదాపు 15 రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆక్రమణకు గురికాకుండా రక్షణ బోర్డు ఏర్పాటు

- కె.ఆంజనేయులు, తహసీల్దారు, కల్లూరు.

చిన్నటేకూరు సర్వే నెంబరు 1లోని హంద్రీనది పోరం బోకుభూమి ఆక్రమణకు గురవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ గ్రామసభలు ఉన్నందున చర్యలు తీసుకోవడంలో కొంత ఆలస్యమైంది. వెంచర్‌ వేసిన ఆ భూమి ప్రభుత్వానిదే. ప్రజలు ప్లాట్లు కొని మోసపోవద్దు. తక్షణమే ఆక్రమణ భూమిలో రక్షణ బోర్డు ఏర్పాటు చేస్తాం. అలాగే ఉలిందకొండ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, భూ ఆక్రమణకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతాం.

Updated Date - Jan 07 , 2025 | 11:43 PM