Share News

అంతా మొక్కుబడి

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:42 AM

జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఏదో సమావేశం పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేశామన్నట్లు ఉందే తప్ప తక్షణ ప్రజా సమస్యల ప్రస్తావనే కరువైంది.

అంతా మొక్కుబడి
జడ్పీ సమావేశానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

సాదాసీదాగా జిల్లా పరిషత్‌ సమావేశం

అజెండాపై తూతూమంత్రంగా చర్చ

తాగునీటి ఎద్దడిపైనే కొంతమేర ప్రస్తావన

ఇతర అంశాలపై అంతంతమాత్రమే

జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఏదో సమావేశం పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేశామన్నట్లు ఉందే తప్ప తక్షణ ప్రజా సమస్యల ప్రస్తావనే కరువైంది. ఈ సమావేశంలో ఆరు ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చినా ప్రయోజనం లేదు. ఏదో మొక్కుబడిగా చర్చ నడిపి మమ అనిపించారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తాగునీటి సమస్యను మాత్రమే ఏడెనిమిది మంది సభ్యులు ప్రస్తావించగా... మిగిలిన అంశాలపై పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. దానిపై సమావేశంలో చర్చ అంతంతమాత్రంగానే జరిగింది.

ఒంగోలు కలెక్టరేట్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఎంతో కీలకమైన జిల్లా పరిషత్‌ సమావేశం మొక్కుబడిగా సాగింది. స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో శనివారం చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఇది జరిగింది. ఉదయం 11.15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.45 గంటలకు ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగినా అందులో 45 నిమిషాలు తాగునీటి సమస్యపై చర్చ నడిచింది. మిగిలిన అంశాలపై ఆయా శాఖల అధికారులు తాము చేస్తున్న కార్యక్రమాలను వివరిం చారు. అడపాదడపా శాసనసభ్యులు ఆయా అంశాలపై ప్రశ్నించడం మినహా మిగిలిన సభ్యులు తమ ప్రాంత సమస్యలపై గొంతెత్తిన పరిస్థితి లేకుండాపోయింది. మరో వైపు ఆయా సమస్యల పరిష్కారానికి వేదికైన జడ్పీ సమావేశానికి ప్రజాప్రతినిధుల హాజరు పలుచగానే ఉంది. కలెక్టర్‌ అన్సారియా సెలవులో ఉండటంతో జేసీ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి, సంతనూతలపాడు, దర్శి ఎమ్మె ల్యేలు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌.విజయ కుమార్‌, డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పాల్గొనగా సమావేశం చివర్లో వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు మిగిలిన శాసనసభ్యులు హాజరుకాలేదు.

రామతీర్థం పైపులైన్‌ దెబ్బతింది

కనిగిరి ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యను అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. రామతీర్థం జలాశయం నుంచి కనిగిరి ప్రాంతానికి ఏర్పాటుచేసిన పైపులైను దెబ్బతినడంతో నీరు రావడం లేదన్నారు. పైపులైనుకు మరమ్మతులు చేసినా ఇంకోచోట దెబ్బతింటుందన్నారు. ఆ పైపులైను నిర్మాణానికి రూ.3కోట్లు అవసరమని, ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. జిల్లా పరిషత్‌ నుంచి కొంతచ ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కొందరు నిధులు కేటాయించాలని కోరారు.

ఎంపీ ల్యాడ్స్‌ నుంచి మంజూరు

ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఆ పైపులైన్‌ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.కోటి కేటాయించనున్నట్లు తెలిపారు. మిగిలిన నిధులను పంచాయతీరాజ్‌శాఖ మంత్రితోపాటు జిల్లా పరిషత్‌ నుంచి సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు అవకాశం లభించిందన్నారు. గత ప్రభుత్వంలో ఆ పనుల నిర్వహణలో తీవ్రజాప్యం జరగడంతో ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడిందన్నారు. జలజీవన్‌ మిషన్‌ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకశ్రద్ధ తీసుకొని గడువును పెంచే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లాలోని ఆర్వో ప్లాంట్ల నిర్వహణతోపాటు కొత్తగా మంజూరైన ప్లాంట్లను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రామతీర్థంకు నిధులు ఇవ్వాలి

సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ మాట్లాడుతూ రామతీర్థం జలాశయానికి రూ.20కోట్ల నుంచి రూ.30కోట్లు వ్యయం చేస్తే మరో 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చీమకుర్తి జడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు మాట్లాడుతూ రామతీర్థం జలాశయానికి వెళ్లే రోడ్లకు మరమ్తతులతోపాటు, జంగిల్‌ క్లియరెన్స్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చీమకుర్తి మండల పరిషత్‌ నుంచి ఆ పనులను చేసేందుకు ఎమ్మెల్యే విజయకుమార్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనిగిరి, హనుమంతునిపాడు, బేస్తవారపేట, త్రిపురాంతకం, వైపాలెం జడ్పీటీసీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను ఏకరువు పెట్టారు. ఆర్వో ప్లాంట నిర్వహణ సరిగా లేని కారణంగా పనిచేయడం లేదన్నారు. వాటిని సర్పంచ్‌లకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)పై జరిగిన చర్చలో దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వివక్ష లేకుండా అందరికీ ఉపాధి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యమైన అధికారులు లేకపోతే ఎలా?

త్రిపురాంతకం జడ్పీటీసీ సభ్యుడు జాన్‌పాల్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులతో శ్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ వంటి అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం వలన ఏమి ప్రయోజనం అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ ఉన్నప్పుడే సమావేశం నిర్వహిస్తే తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు లేకుండా ముందుగానే అనుమతి తీసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని సీఈవోను కోరారు. ఇలా ఆయా అంశాలపై అరకొరగానే సభ్యులు మాట్లాడారే తప్ప పూర్తిస్థాయిలో చర్చించిన పరిస్థితి లేకుండాపోయింది. చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అర్ధవంతంగా సమావేశం నిర్వహించామని తెలిపారు. జడ్పీ సీఈవో చిరంజీవి రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు. జడ్పీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అతిఽథిగృహాన్ని ఆధునికీకరణ చేయాలని తీర్మానించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు అయ్యే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. జూన్‌ 21న యోగా దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పొగాకు పంట కొనుగోళ్లపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి

ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు కొనుగోళ్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపాలని ఎంపీ మాగుంట కోరారు. ఈ ఏడాది పంట ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో కొనుగోళ్లు మందగించాయన్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లారని తెలిపారు. అందువల్ల జడ్పీలో కూడా తీర్మానం చేసి పంపాలని సూచించారు.

Updated Date - Jun 01 , 2025 | 01:42 AM