సమాజానికి ఉపయోగపడేలా యువత ఆలోచనలు ఉండాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:27 PM
: నేటి యువత ఆలోచనలు, మేధో సంపత్తి సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు మేలు చేకూర్చేలా ఉండాలని కలెక్టర్ పీ రాజాబాబు సూచించారు.
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నేటి యువత ఆలోచనలు, మేధో సంపత్తి సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు మేలు చేకూర్చేలా ఉండాలని కలెక్టర్ పీ రాజాబాబు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ సమావేశపు హాలులో గురువారం ట్రిపుల్‌ఐటి, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ఐడియా టు ఇంప్లాక్ట్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు నమూనాలను కలెక్టర్ తిలకించడంతో పాటు ప్రాజెక్టు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ యువత వినూత్న ఆలోచనలు, మేధో సంపత్తిని, ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేందుకు జిల్లాలో ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. పలువురు విద్యార్థులు స్వీయ నియంత్రణతో నీటిట్యాంకు నింపే వ్యవస్థ, స్మార్ట్ నీటి భద్రత, వ్యాధి హెచ్చరిక వ్యవస్థ, టచ్‌లె్‌స స్మార్ట్ డస్ట్‌బిన్, వాయిస్ నియంత్రిత వీల్ చైర్, రియల్ టైమ్ లోకేషన్, అత్యవసర హెచ్చరికలతో కూడిన కాంపాక్ట్, మహిళా భద్రత పరికరం లాంటి నమూనాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకుపోతున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా యువత కూడా నడుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, జిల్లా స్కిల్ డెవల్‌పమెంట్ అధికారి రవితేజ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.