రెండోసారీ చర్చలు విఫలం
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:10 PM
గ్రానైట్ సీనరేజి వసూలు హక్కులు దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ, గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల మధ్య మంగళవారం రెండోసారి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల ఒకటో తేదీ నుంచి మొదలైన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల సమ్మె ముగింపునకు చేరే పరిస్థితులు కనిపించకపోవటంతో ఫ్యాక్టరీ ఓనర్లలో ఆందోళన పెరిగిపోతోంది.
ముడిరాళ్ల రికవరీపైనే ఫ్యాక్టరీ ఓనర్ల ఆందోళన
దానికి మాకేం సంబంధం అంటున్న ఏఎంఆర్
రాయల్టీకి అదనంగా చిల్లిగవ్వ కూడా చెల్లించేదిలేదని తేల్చిచెప్పిన ఓనర్లు
సంస్థ యజమానుల దృష్టికి తీసుకెళ్తామన్న ఏఎంఆర్ ప్రతినిధులు
చీమకుర్తి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ సీనరేజి వసూలు హక్కులు దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ, గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల మధ్య మంగళవారం రెండోసారి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల ఒకటో తేదీ నుంచి మొదలైన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల సమ్మె ముగింపునకు చేరే పరిస్థితులు కనిపించకపోవటంతో ఫ్యాక్టరీ ఓనర్లలో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా ఫ్యాక్టరీలను లీజు తీసుకొని నడుపుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లీజు హక్కులు పొందిన ఏఎంఆర్ సంస్థ ప్రభుత్వంతో అగ్రిమెంట్ బు ధవారం కుదుర్చుకుంటే సమస్య కొలిక్కి వస్తుందని ఓనర్లు భావించారు. అగ్రిమెంట్‌కు తుది గడువును ఈనెల 24 వరకూ పొడిగించాలని ఏఎంఆర్ సంస్థ, మైన్స్ డీడీకి వినతిపత్రం అందచేయటం ఫ్యాక్టరీ ఓనర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. నెలాఖరు వరకూ ఫ్యాక్టరీలు మూసివేయాల్సిందేనా...అ దే జరిగితే బ్యాంకు ఈఎంఐలు, కరెంట్ బిల్లు లు, లీజు చెల్లింపులు, జీతాలు అందివ్వటం ఎలా అని ఓనర్లు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం 800 ఫ్యాక్టరీల్లో నలభైశాతం వరూ లీజుదారులే ఉండటం గమనార్హం.
రికవరిపైనే పీటముడి...
రెండోసారి చర్చల్లో ముడిరాళ్లలో రికవరీ శాతం ప్రధాన అంశంగా మారింది. ఒక కట్టర్‌కు రాయల్టీగా ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తే అందుకుప్రతిగా 22 క్యూబిక్ మీటర్ల ముడిరాయిని క్వారీ ఓనర్ల నుంచి కొనుగోలు చేసే అవకాశం లీగల్‌గా ఫ్యాక్టరీ ఓనర్లకు లభిస్తుంది. అలా కొనుగోలు చేసినపుడు ముడిరాయిలో దాదాపు సగానికి సగం వేస్ట్‌గా మిగిలిపోతుంది. అంటే రికవరీ శాతం సగమే ఉంటుంది. ఇప్పటి వరకూ క్వారీ ఓనర్లు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అదనంగా రాయిని లాట్ల రూపంలో విక్రయిస్తున్నారు. రాయి వేస్ట్ విషయం మైనింగ్ అధికారులకు తెలుసు.. అందుకే అదనంగా ఫ్యాక్టరీ ఓనర్లు కొనుగోలు చేసిన రాళ్లపై పెనాల్టీని విధించేవారు కాదు. ఇలా అవగాహనతో సాగిపోతున్న క్రమంలో ప్రభుత్వం సీనరేజి వసూలును ప్రైవేటు సంస్థకు అప్పచెప్పటంతో సమస్యగా మారింది. రికవరీతో మాకు సంబంధం లేదు కొనుగోలు చేసిన రాళ్లను లెక్కకట్టి పర్మిట్‌కు మించితే పెనాల్టీ వసూలు చేస్తాం లేదా ముందుగానే మాతో ఒప్పందం కుదుర్చుకొని కట్టర్‌కు రూ.30వేలు అదనంగా చెల్లిస్తే మీ పని మీరు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పటంతో సమస్యగా మారి సమ్మె వరకూ వెళ్లింది. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి కట్టర్‌కి రూ.27వేలు చెల్లిస్తుండగా ఇపుడు మరో ఎనిమిది వేలు పెంచడమే భారం అనుకుంటే మరో ముప్పై వేలు అదనంగా ప్రభుత్వానికి కాకుండా మీ జేబుల్లోకి వెళ్లే విధంగా మేము చెల్లించే ప్రసక్తే లేదని ఓనర్లు భీష్మించుకున్నారు. ఇపుడే అంతంత మాత్రంగా జరుగుతున్న వ్యాపారాలు ఈ అదనపు చెల్లింపులతో ఫ్యాక్టరీలను నడిపే అవకాశమే లేదని, ఖర్చులు కూడా రాని దుస్థితి ఏర్పడుతుందని, అంతకన్నా మూసివేసుకోవటమే మేలని ఏఎంఆర్ సంస్థ ముందు ఫ్యాక్టరీ ఓనర్లు తెగేసి చెప్పారు. అవసరమైతే ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు మేరకు ప్రభుత్వానికే అధనంగా రెండుశాతం రాయల్టీ చెల్లిస్తే ఎంతమేరకు అయినా రాళ్ల కొనుగోలుకు అనుమతి లభిస్తుందని, అలానే ముందుకెళతామని ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ నాయకులు తెగేసి చెప్పటంతో ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆలోచనలో పడ్డారు. ఈ అంశాలను మా సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని, మరోసారి చర్చలు జరిపి పరిష్కారమార్గం కనుగొందామని ఏఎంఆర్ ప్రతినిధి చెప్పటంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి.
క్వారీ ఓనర్ల చేతిలోనే పరిష్కారం...
ముడిరాయిని విక్రయించే క్వారీ ఓనర్ల చేతిలోనే పరిష్కార మార్గం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. రికవరీతో సంబంధంలేదు, పర్మిట్‌కు మించితే పెనాల్టీ వేస్తామన్న ఏఎంర్ సంస్థ వాదన ప్రభుత్వ నిబంధనల మేరకే ఉంది. మరో వైపు నాణ్యమైన రాయిని ఎగుమతి చేసుకుంటూ నాణ్యత తక్కువ ఉన్న రాయిని లోకల్ ఫ్యాక్టరీలకు క్వారీ ఓనర్లు విక్రయిస్తున్నారు. ఈ రాళ్లలో రికవరీ శాతం తక్కువ అని ఓనర్లకు తెలుసు కాబట్టి రేటు తక్కువకు విక్రయిస్తే ఫ్యాక్టరీ ఓనర్లు నష్టాల నుంచి గట్టెక్కవచ్చు. వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కళకళలాడాలంటే పదుల సంఖ్యలో ఉన్న క్వారీ ఓనర్లు తమ లాభాల్లో కొంత మేర తగ్గించుకుంటే వారికొచ్చే నష్టమేమి లేదనేది కొంతమంది ఫ్యాక్టరీ ఓనర్లు వాదన. ఉభయతారకంగా సమ్మెకు స్వస్తి పలికి పరిశ్రమ యథాతఽథంగా నడిచేలా క్వారీ ఓనర్లు ముందుకు వచ్చి తమ నిర్ణయం తెలపాలని ఆశిస్తున్నారు. ఏఎంఆర్, ఫ్యాక్టరీ ఓనర్ల మధ్య చర్చల్లో మధ్యవర్తిగా ఉంది కూడా క్వారీ ఓనర్లే కావటం విశేషం. గత రెండు సార్లు జరిగిన చర్చల్లో వారు మౌనంగా వింటున్నారే తప్ప సమస్య పరిష్కారం దిశగా ముందుకు రాకపోవటం గమనార్హం. మంగళవారం జరిగిన చర్చల్లో ఏఎంఆర్ సంస్థ ప్రతినిఽధి నీహంత్, కారీ ఓనర్లు శిద్దా భరత్, ఆర్‌పీ రవి, చలువాది బదరీనారాయణ, సురేంద్రరెడ్డి, శిల్పారెడ్డి, నూనె అనుదీప్, ఫ్యాక్టరీ ఓనర్లు కాట్రగడ్డ రమణయ్య, యర్రగుంట్ల శ్రీనివాసరావు, కోడూరి వెంకట్రావు, లగడపాటి శ్రీనివాసరావు, మలినేని వెంకటేశ్వర్లు, సూదనగుంట కోటేశ్వరరావు, మస్తాన్‌రెడ్డి పాల్గొన్నారు.