Share News

మత్స్యకార యువకుడు మృతి

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:05 PM

ఓ మత్స్యకార యువకుడు మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదరీతిలో దుర్మరణం చెందాడు. అందిన వివరాల ప్రకారం... చీరాల మండల పరిధిలోని దానాయిపేటకు చెందిన ఓసిపిల్లి మోషే(26) మత్స్యకారుడు. ఇటీవలే ఇతనికి ఓ యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది.

మత్స్యకార యువకుడు మృతి

సుమారు 15 అడుగుల వంతెనపై నుంచి జారిపడినట్లు ఆనవాళ్లు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ఇటీవలే ఓ యువతితో నిశ్చితార్థం

ఈపూరుపాలెం(చీరాల), నవంబరు26 (ఆంధ్రజ్యోతి) : ఓ మత్స్యకార యువకుడు మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదరీతిలో దుర్మరణం చెందాడు. అందిన వివరాల ప్రకారం... చీరాల మండల పరిధిలోని దానాయిపేటకు చెందిన ఓసిపిల్లి మోషే(26) మత్స్యకారుడు. ఇటీవలే ఇతనికి ఓ యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది. వచ్చే ఏడాది వేసవిలో వివాహానికి పెద్దలు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే.. మోషే కొద్ది రోజులుగా మిత్రులు ముత్యాలు, మనోజ్‌తో కలిసి గ్రామంలోని చర్చి సమీపంలోని ఓ ఇంట్లో రోజూ రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే మంగళవారం రాత్రి కూడా పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయం వరకు మిత్రులతో కలిసి పడుకున్న మోషే అర్ధరాత్రి సమయంలో స్కూటీతో సహా 167 ఏ వాడరేవు - పిడుగురాళ్ల నూతన జాతీయ రహదారి ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ వద్ద ప్రస్తుతం సగం పూర్తయిన ఆర్వోబీ వంతెన వద్ద తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ నాగభూషణం మృతుని వేలిముద్ర ఆధారంగా ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి కొన్ని నెంబర్లకు ప్రయత్నించగా మృతుని వివరాలు చెప్పారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు అవగాహన లోపంతోనే పూర్తికాని వంతెనవైపు ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో మృతుడు ఒంటరిగా సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణించడంపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి.

Updated Date - Nov 26 , 2025 | 11:05 PM