Share News

కప్పం కట్టాల్సిందే!

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:31 AM

మార్కాపురం మునిసిపాలిటీ పాలకవర్గంలోని ప్రధాన ప్రజాప్రతినిధి (వైసీపీ) ధన దాహానికి కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ముందుగానే పర్సంటేజీని తనకు ఇస్తేనే పనులు మంజూరవుతాయని ఆయన బాహాటంగా చెప్తున్నట్లు తెలుస్తోంది.

కప్పం కట్టాల్సిందే!
మార్కాపురం మునిసిపల్‌ కార్యాలయం

మార్కాపురంలో వైసీపీ ప్రజాప్రతినిధి పర్సంటేజీల గోల

ముందుకురాని కాంట్రాక్టర్లు

గత సంవత్సరం బిల్లులు రాక అవస్థలు

మూడుసార్లు పిలిచినా స్పందించని వైనం

సందిగ్ధంలో పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మార్కాపురం మునిసిపాలిటీ పాలకవర్గంలోని ప్రధాన ప్రజాప్రతినిధి (వైసీపీ) ధన దాహానికి కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ముందుగానే పర్సంటేజీని తనకు ఇస్తేనే పనులు మంజూరవుతాయని ఆయన బాహాటంగా చెప్తున్నట్లు తెలుస్తోంది. అదీకూడా గతం కంటే మించి అడుగుతున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఏఎ్‌ససీ గ్రాంట్‌ ద్వారా ట్యాంకర్లతో సరఫరా చేసిన నీటికి బిల్లులు నేటికీ రాలేదు. ఇప్పుడు మళ్లీ డబ్బులు ముందుగానే ఆ ప్రజాప్రతినిధికి చెల్లించి నీటి సరఫరా చేసే ధైర్యం తమకు లేదని కాంట్రాక్టర్లు మిన్నకుండిపోతున్నారు. పుర ప్రజల దాహార్తితో నాకేంటి నా కప్పం నాకు కట్టాల్సిందేనని సదరు ప్రజాప్రతినిధి నిస్సిగ్గుగా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

మార్కాపురం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. డీప్‌బోర్లు ఒట్టిపోతున్నాయి. మరోవైపు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల నిండా సాగర్‌ నీళ్లున్నా సకాలంలో పుర ప్రజలకు అందించలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో గొంతెండుతోన్న పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా సరఫరానే దిక్కు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం రూ.40లక్షలు మంజూరు చేసింది. రోజుకు వంద ట్రిప్పుల చొప్పున మూడు మాసాలపాటు సరఫరాకు అనుమతులు ఇచ్చింది. ఈ నెలారంభంలోనే మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికి మూడుసార్లు పిలిచినా ఎటువంటి స్పందన లేదు. అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే మునిసిపాలిటీలోని కీలక ప్రజాప్రతినిధి ధనదాహామే కారణమన్న ప్రచారం నడుస్తోంది. వైసీపీకి చెందిన పాలకవర్గ ప్రధాన ప్రజాప్రతినిధి బాహాటంగానే పర్సంటేజీలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

పట్టణంలో ప్రారంభమైన దాహం కేకలు

మార్కాపురం పట్టణానికి ప్రధాన తాగునీటి వనరు సాగర్‌ జలాలే. 80శాతం మేర ప్రాంతానికి అంతర్గత పైప్‌లైన్‌ ఉంది. త్రిపురాంతకం మండలం దూపాడులోని సాగర్‌ తూర్పు ప్రధాన కాలువ ద్వారా 2,200 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి నీటిని నింపుతారు. అక్కడ నుంచి 28 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ ద్వారా సాగర్‌ నీరు పట్టణానికి చేరాలి. ఎస్‌ఎస్‌ ట్యాంకులో నిండా నీరున్నా సరఫరాలో చోటుచేసుకుంటున్న ఇబ్బందులతో ప్రస్తుతం వారం నుంచి పది రోజులకోసారి నీటిని అందిస్తున్నారు. సాగర్‌ అంతర్గత పైప్‌లైన్‌ లేని శివారు కాలనీల్లో డీప్‌బోర్లు ఒట్టిపోయి ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అంతేకాక కొందరు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తేనే ప్రజలకు అవస్థలు తప్పేది. ఆ దిశగా అధికారులు అడుగులు వేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరికొన్ని రోజులు ఈ ఇబ్బందులకు అడ్డుకట్టపడే అవకాశాలు కనిపించడం లేదు.


ఏపనైనా ముందుగా పర్పంటేజీలు ఇవ్వాల్సిందే

మార్కాపురం పురపాలక సంఘంలో వైసీపీ పాలకవర్గం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత వైసీపీ హయాంలో 10 శాతంగా ఉన్న ప్రధాన ప్రజాప్రతినిధి పర్సంటేజీ ప్రస్తుతం రెట్టింపు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ పీఠం ఎప్పుడు కూలుతుందోనన్న అపోహతో ఆ ప్రజాప్రతినిధి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మునిసిపాలిటీలో ప్రస్తుతం ఏపనికీ టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు నిధులున్నా గత కొన్నాళ్లుగా టెండర్లు దాఖలు చేయడంలేదు. పని ప్రారంభించక ముందే 20 శాతం మేర పర్సంటేజీ ఇస్తేనే అనుమతులు ఇస్తానని బెదిరిస్తుండడంతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో చేసిన చాలా పనులకే ఇంకా బిల్లులు రాక ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే రెట్టింపు పర్సంటేజీలు ఇస్తే తాము మునిగిపోవాల్సిందే అని బాహాటంగానే చెప్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు కాంట్రాక్లర్లు ముందుకు రావడంలేదని స్పష్టమవుతోంది.

Updated Date - Apr 30 , 2025 | 01:31 AM